నేరాలు గంపెడు.. స్టేషన్లు గుప్పెడు | Huge crimes but there is no police stations | Sakshi
Sakshi News home page

నేరాలు గంపెడు.. స్టేషన్లు గుప్పెడు

Published Sat, Dec 9 2017 2:44 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Huge crimes but there is no police stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు, ఆ జిల్లాల్లోని ప్రధాన పట్టణాల పోలీసు అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల దర్యాప్తు, బందోబస్తు కష్టసాధ్యంగా మారింది. జిల్లా కేంద్రాల్లో పట్టణ ప్రాంత విస్తరణ, దానికి తగ్గట్టే నేరాల నమోదూ పెరగడంతో మూడింటినీ ఒకే ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షించడం కత్తిమీద సాములా తయారైంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా గతేడాది కొత్త మండలాల్లో పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని జిల్లా హెడ్‌క్వార్టర్లలో ఇప్పటికీ ఒకే స్టేషన్, మరికొన్నింటిలో ఎస్‌హెచ్‌ఓ ర్యాంకు అధికారిగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు. దీంతో తీవ్రమైన నేరాలు జరిగినపుడు దర్యాప్తు చేయడం కష్టమవుతోంది.  
 
ఈ ప్రాంతాల్లో తప్పదు..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏటా 700–750 వరకు కేసులు నమోదువుతున్నాయి. అర్బన్‌ ప్రాంతం, పైగా జిల్లా కేంద్రం కావడంతో ఒకే స్టేషన్‌తో నేరాల దర్యాప్తు, శాంతి భద్రతల పర్యవేక్షణ ఇన్‌స్పెక్టర్‌కు కత్తిమీద సాములా మారింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ ఒకే స్టేషన్‌ ఉంది. పైగా ఎస్సై ర్యాంకు అధికారి స్టేషన్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ కూడా మరో స్టేషన్, ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు అ«ధికారి అవసరం ఉంది. ఇలా పలు జిల్లా కేంద్రాలు, జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వన్‌టౌన్, టూ టౌన్, సీసీఎస్, ట్రాఫిక్‌ స్టేషన్ల అవసరముంది. నల్లగొండలోని దేవరకొండ, మహబూబ్‌నగర్‌ లోని కోస్గి, భూపాలపల్లి జిల్లా కేంద్రం, హుజూరాబాద్‌ జమ్మికుంట, పెద్దపల్లి కేంద్రంతోపాటు మంథని, సుల్తానాబాద్, వరంగల్‌లోని నర్సంపేట, పరకాల, సిద్దిపేటలోని హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, మహబూబాబాద్‌ కేంద్రంతో పాటు తొర్రూర్, కొత్తగూడెం కేంద్రంతో పాటు మణుగూరు, ఇల్లెందు, జగిత్యాల కేంద్రం, కోరుట్ల, మెట్‌పల్లి, ఆసిఫాబాద్‌ కేంద్రంతో పాటు కాగజ్‌నగర్, నిజామాబాద్‌లోని ఆర్మూర్, బోధన్, కామారెడ్డి జిల్లా కేంద్రం, సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడ, మెదక్‌ జిల్లా కేంద్రం, వనపర్తి జిల్లా కేంద్రం, జనగామ జిల్లా కేంద్రాల్లో అదనపు స్టేషన్లతో పాటు ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకుకు అప్‌గ్రేడ్‌ చేస్తే పర్యవేక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల దర్యాప్తు సులభతరం కానుంది. 

జనాభా ప్రాతిపాదికన కాదు..
పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు జనాభా దామాషాతో సంబంధం లేదు. అయితే కొత్తగా మండలం ఏర్పాటైతే ప్రభుత్వ కార్యాలయాల్లాగే పోలీస్‌ స్టేషనూ సర్కారు ఏర్పాటు చేస్తుంది. పట్టణాల్లో నేరాల నమోదు, తీవ్రత, పారిశ్రామిక అభివృద్ధి ఆధారంగా స్టేషన్ల ఏర్పాటు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. స్టేషన్ల ఏర్పాటు సమయంలో జనాభాను పరిగణనలోకి తీసుకుంటారని, అయితే జనాభా దామాషాలో ఠాణాల ఏర్పాటు ఉండదని చెప్పారు. 

కమిషనరేట్లలో అప్‌గ్రేడ్‌ సంగతేంటి?
సైబరబాద్‌ కమిషనరేట్‌ను విభజించి రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌గా పునర్విభజన చేశారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి కొత్త పోలీస్‌ స్టేషన్లు వచ్చి చేరాయి. వాటిని అప్‌గ్రేడ్‌ చేసి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు ఎస్‌హెచ్‌ఓగా మార్చాల్సి ఉంది. కానీ పునర్విభజన జరిగి ఏడాదిన్నర గడిచినా ఎస్సై ర్యాంకు ఎస్‌హెచ్‌ఓ పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement