భద్రతకు పటిష్ట చర్యలు
-
మరో రెండు పోలీస్ సబ్ డివిజన్ల మంజూరు
-
ఆరుకు పెరిగిన శాంతిభద్రతల సబ్‌డివిజన్లు
-
అదనంగా 12 మంది సిబ్బంది నియామకం
అల్లిపురం : నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్ సిటీ నేపథ్యం, నగర పరిధి పెరగడంతో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నాలుగు సబ్ డివిజన్లను ఆరుకు పెంచింది. ఈ మేరకు పచ్చజెండా ఊపుతూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 23 పోలీస్ స్టేషన్లను ఆరు డివిజన్లకు సమానంగా విడదీయనున్నారు. నాలుగు పోలీస్ స్టేషన్లను ఒక సబ్ డివిజన్‌గా చేయనున్నారు. దీంతో మరో రెండు ఏసీపీ పోస్టులు, సీనియర్ అసిస్టెంట్లు రెండు, జూనియర్ అసిస్టెంట్లు నలుగురు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు(అవుట్ సోర్సింగ్) నాలుగు పోస్టులను మంజూరు చేశారు. ఇందు కోసం ఏడాదికి రూ.70,12,128 బడ్జెట్‌ను కేటాయించారు.
సబ్ డివిజన్ల ఏర్పాటు ఇలా..
ప్రస్తుతం ఈస్ట్ , వెస్ట్, నార్త్, సౌత్ సబ్ డివిజన్లు ఉన్నాయి, అదనంగా ద్వారకా, హార్బర్ సబ్ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు పోలీస్ స్టేషన్లు ఒక ఏసీపీ పరిధిలో ఉంటాయి. దీని వల్ల కేసులు పరిష్కారంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణ సులభతరమవుతుంది. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న పోలీసులనే వీటిలో సర్దాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో విశాఖ కీలకం
నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విశాఖ నగరం కీలకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సదస్సులు, కార్యక్రమాలు విశాఖలో నిర్వహిస్తుండడంతో వీఐపీలు, వీవీఐపీలు నగరానికి తరచూ వస్తున్నారు. ముఖ్యమంత్రి నెలలో కనీసం 10 సార్లయినా వస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో శాంతి భద్రతల విషయం పోలీసులకు సవాలుగా మారింది. కొత్త సబ్ డివిజన్ల ఏర్పాటుతో కొంత వరకు భారం తగ్గే అవకాశం ఉంటుందని పలువురు పోలీసు అధికారులు భావిస్తున్నారు.