ఎస్‌ఐ పోస్టుల స్కాం: పరీక్ష టైంలో ఫోన్‌లో మాట్లాడారా? | PSI Scam Twists And Turns In Karnataka | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ పోస్టుల స్కాం: పరీక్ష టైంలో ఫోన్‌లో మాట్లాడారా?

Published Tue, Apr 26 2022 8:45 AM | Last Updated on Tue, Apr 26 2022 1:32 PM

PSI Scam Twists And Turns In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(కర్ణాటక): రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎస్‌ఐ పోస్టుల కుంభకోణం మరిన్ని ఉద్యోగ నియమాకాలపై అనుమానాలను పెంచుతోంది. బ్లూ టూత్‌ సహాయంతో ఈసారి, గతంలోనూ ఎంతమంది  పరీక్షల్లో అక్రమాలకు పాల్ప డ్డారోనని సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఎవరికీ కనబడకుండా చెవి లోపల చిన్న బ్లూటూత్‌ పరికరం పెట్టుకుని బయటి నుంచి అక్రమార్కులు సరైన సమాధానం చెబుతుంటే విని రాసి ఉద్యోగాలు వెలగబెడుతున్న వారికి ఇప్పుడు వణుకు మొదలైంది.

ఇటీవల ఎస్‌ఐ పరీక్ష రాసిన అభ్యర్థుల మొబైల్‌ కాల్స్‌ లిస్టులను  అధికారులు పరిశీలిస్తున్నారు. పరీక్ష రాసిన సమయంలో అభ్యర్థుల మొబైల్‌ఫోన్లకు ఎవరైనా కాల్‌ చేశారా, ఎంతసేపు మాట్లాడారు తదితర అంశాలను మొబైల్‌ టవర్‌ డంప్‌ తదితర  సాంకేతికతల సహాయంతో వెలికితీయనున్నారు.  

సాధారణంగా పరీక్ష సమయంలో అభ్యర్థులు ఫోన్‌ను స్విచాఫ్‌ చేసి బయట సిబ్బందికి ఇచ్చేయాలి. లేదా స్నేహితులకు, ఇంట్లోనూ ఇచ్చి రావచ్చు. ఆ సమయంలో కాల్‌ వచ్చి ఎక్కువసేపు మాట్లాడి ఉంటే చిక్కుల్లో పడినట్లే. అభ్యర్థులకు ఎన్ని మొబైల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు ఉన్నాయో కూడా వివరాలు రాబడుతున్నారు. ఈ విచారణలో అక్రమార్కులు దొరికిపోవడం ఖాయం అని సీఐడీ అధికారులు తెలిపారు.  

కోవిడ్‌ మృతుని సెల్‌ నుంచి దందా  
ఎస్‌ఐ కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోవిడ్‌తో మరణించిన వ్యక్తి పేరుతో ఉన్న మొబైల్‌ఫోన్‌ను వినియోగించి నిందితుడు రుద్రేగౌడ పాటిల్‌ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.  పాటిల్‌ వద్ద సోన్న గ్రామానికి చెందిన లక్ష్మీపుత్ర అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. లక్ష్మీపుత్ర కోవిడ్‌తో మృతిచెందగా, అతనికి చెందిన ఒక మొబైల్‌ను పాటిల్‌ తీసుకున్నాడు.

అదే మొబైల్‌తో ఎస్‌ఐ పోస్టుల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో తెలిసింది. నేరం బయటపడినా తప్పించుకోవడానికి ఈ ఉపాయాన్ని ఆలోచించాడు. రెండు రోజుల క్రితం రుద్రేగౌడ, స్నేహితుడు మంజునాథ్‌ను అరెస్ట్‌చేసిన సీఐడీ అధికారులు 13 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. 

ఇతర పరీక్షల్లోనూ ప్రమేయం: ఎస్‌ఐ పోస్టులే కాకుండా ఎఫ్‌డీఏ, ఎస్‌డీఏ, ఏఈ పోస్టులతో పాటు వివిధ నియామక పరీక్షల్లో రుద్రేగౌడ  పాటిల్‌ ముఠా  అక్రమాలకు పాల్పడి ఉండొచ్చని సీఐడీ విచారణ చేస్తోంది. రుద్రేగౌడను, స్నేహితుడు మల్లికార్జున పాటిల్‌ను సీఐడీ విచారిస్తోంది. రుద్రేగౌడ నివాసంలో లభించిన హాల్‌టికెట్లు, పీఎస్‌ఐ పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు కొన్ని ఆధారాలు లభించాయని సమాచారం. ఇతని సహకారంతో పెద్దసంఖ్యలో నిరుద్యోగులు పలు కేపీఎస్‌సీ పరీక్షల్లో బ్లూటూత్‌లో సమాధానాలు పొంది ఎంపికైనట్లు తెలిసింది.

ఈ వార్త కూడా చదవండి: వీసీల నియామకం రాష్ట్ర హక్కే: తమిళనాడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement