బనశంకరి: ఎస్‌ఐ రాత పరీక్ష కుంభకోణంలో లొంగుబాట్లు పెరిగాయి. సోమవారం కలబురిగి జ్ఞానజ్యోతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాశీనాథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ పాఠశాల ముఖ్య నిందితురాలు దివ్య హగరగికి చెందినది. గత నెల 10 నుంచి పరారీలో ఉండగా, అరెస్టు తప్పదని తెలిసి కలబురిగిలో సీఐడీ ఆఫీసులో లొంగిపోయాడు. ఈ స్కాం సూత్రధారి రుద్రేగౌడపాటిల్, నీటిపారుదల శాఖ ఇంజనీర్ మంజునాథ మేళకుందతో కాశీనాథ్ కుమ్మక్కయినట్లు సమాచారం. ఆదివారం ఇంజనీర్ మంజునాథ లొంగిపోవడం తెలిసిందే.
సమగ్ర దర్యాప్తునకు సమయం కావాలి
ఈ బాగోతం రోజురోజుకు మలుపు తిరుగుతుండడంతో సమగ్ర సమాచారం రావాలంటే మరికొన్ని రోజులు పడుతుందని సీఐడీ సీనియర్ అధికారి తెలిపారు. ఎస్‌ఐ పరీక్ష అక్రమాలు కలబురిగి నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగి ఉండవచ్చని, లోతుగా దర్యాప్తు చేయడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. తమకు సాంకేతిక నిపుణులు అవసరమన్నారు. ఎస్‌ఐ నియామకాల్లో ఎంపికైన 545 మంది అభ్యర్థులను విచారణ కు పిలవగా కొందరు గైర్హాజరైయ్యారు. ఆ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 92 కేంద్రాల్లో జరపగా 54,104 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఆ మంత్రి పేరు చెప్పాలంటే భయం: డీకే
శివాజీనగర: ఎస్‌ఐ కుంభకోణం లో మంత్రి హస్తం ఉందని వార్తలు వినిపిస్తున్నాయని, ఓ అభ్యర్థి కోసం మంత్రి రాజకీయ పలుకుబడిని వినియోగించినట్లు తెలిసిందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. సోమవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆ మంత్రి ముఖ్యమంత్రి కానున్నారని, ఆయన పేరును బయటకు చెప్పరాదని మండ్య నుంచి ఓ నేత తో పాటు పలువురు ఒత్తిడి తీసుకువస్తున్నారని, తనకు అతడి పేరు చెప్పాలంటే భయంగా ఉందని అన్నారు.
రామనగరలో మీరు మగాడా? అని మాకు ఆ మంత్రి తనకు సవాల్ విసిరాడని, దీంతో భయం వేస్తుందని పరోక్షంగా బెంగళూరుకు చెందిన ఓ మంత్రి గురించి చలోక్తులు విసిరారు. కాగా ఈ ఆరోపణలను విలేకరులు సీఎం బొమ్మై వద్ద ప్రస్తావించగా తరువాత మాట్లాడతానని చెప్పారు. మరో కాంగ్రెస్ నేత ఉగ్రప్ప మాట్లాడుతూ ఎస్‌ఐల స్కాంలో అరెస్ట్ అయినవారిని విడుదల చేయించేందుకు ఉన్నత విద్యా, రామనగర జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీఎన్ అశ్వత్థనారాయణ ఒత్తడి తీసుకొస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment