డిప్లొమా అభ్యర్థుల అర్హతపై డైలమా
Published Tue, Dec 27 2016 2:30 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM
జంగారెడ్డిగూడెం : కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీలో డిప్లొమా(పాలిటెక్నిక్) అభ్యర్థుల అర్హతపై ఇంకా డైలమా కొనసాగుతోంది. పోస్టులకు వారూ అర్హులేనని ఏపీ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా ప్రభుత్వం, పోలీసు శాఖ నుంచి ఇంకా స్పష్టత లేదు. ఫలితంగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసి ప్రాథమిక పరీక్ష రాసి అర్హత సాధించిన డిప్లొమా అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షా సమయంలో పోలీసు అధికారులు అర్హులు కాదంటూ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది అభ్యర్థులు ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. నోటిఫికేషన్‌లో ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హత కలిగిన వారు అర్హులని ప్రకటించారు కనుక డిప్లొమా అభ్యర్థులూ అర్హులేనని ఈనెల 19న ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. కానిస్టేబుళ్ల ఎంపిక కోసం జిల్లాలోని ఏలూరు , భీమవరం కేంద్రాల్లో 21,661 మంది అభ్యర్థులు ప్రాథమిక పరీక్ష రాశారు. వీరిలో 6,472 మంది అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,86,472 మంది పరీక్షలకు హాజరుకాగా 1,16,127 మంది అర్హత సాధించారు. వీరందరికీ పోలీసు రిక్రూట్ మెంట్‌బోర్డు జారీ చేసిన నిబంధనల ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి వారంపాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. పాలిటెక్నిక్ అభ్యర్థులను మాత్రం సర్టిఫికేట్ల పరిశీలన దశలోనే నిరాకరించారు. దీంతో వీరంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డిప్లొమా అభ్యర్థులు జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో కొందరు రిక్రూట్‌మెంట్ బోర్డుకు తమ అభ్యర్థనను మెయిల్ ద్వారా పంపారు. అయినా స్పందన లేకపోవడంతో అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లోనూ ఇదే సమస్య తలెత్తడంతో అక్కడి అభ్యర్థులంతా ఉన్నత విద్యాశాఖను ఆశ్రయించారు. దీంతో ఇంటర్మీడియెట్ బోర్డు పాలిటెక్నిక్ కూడా ఇంటర్మీడియెట్‌తో సమానమేనని ప్రకటించింది. దీంతో అక్కడ డిప్లొమా అభ్యర్థులకూ అర్హత కల్పించారు. తాజాగా ఏపీ ట్రిబ్యునల్ తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి గానీ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా అభ్యర్థులకు ఎటువంటి సమాచారం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల మందికిపైగా డిప్లొమా అభ్యర్థులు ప్రాథమిక పరీక్ష అర్హత సాధించగా, జిల్లాలో ఈ సంఖ్య 200కు పైగానే ఉంది. ఏపీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కాపీని ఏపీ పోలీస్‌రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ సింగ్‌ను కలిసి డిప్లొమా అభ్యర్థులు అందజేశారు. అయినా స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పును గౌరవించి న్యాయం చేయాలని డిప్లొమా అభ్యర్థులు కోరుతున్నారు.
Advertisement
Advertisement