ముంబై: ఉగ్రవాద దాడులకు అస్కారముందన్న హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసు శాఖ అప్రమత్తమైంది. వచ్చే నెలలో జరగనున్న గణేశ్ ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ప్రాంతంపై డేగ కళ్లతో నిఘా వేయనుంది. ‘వచ్చే నెల తొమ్మిది నుంచి ఉత్సవాలు మొదలవుతాయి. పది రోజుల పాటు కొనసాగుతాయి. మేం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటుచేస్తున్నాం. అయితే దీనికి ప్రజల సహకారం కూడా అవసరమ’ని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ అన్నారు. గణేశ్‌ఉత్సవ నిర్వాహకులు పాటించాల్సిన నియమావళిని ఆదివారం విడుదల చేశారు.
భద్రత చర్యల వివరాలు, ట్రాఫిక్ ఏర్పాట్లు, వివిధ ఏజెన్సీలు, సీనియర్ పోలీసులు, విపత్తుల నియంత్రణ విభాగ అధికారులు ఫోన్ నంబర్‌లతో పాటు వివిధ ఆదేశాలతో కూడిన మాన్యువల్‌ను ఆరువేల గణేశ్ మండళ్లకు పంపిణీ చేయనున్నామన్నారు. రోజు సుమారు 1 నుంచి 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకునే ‘లాలాబాగ్‌చా రాజా’కు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని ఆయన తెలిపారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రత్యేక హెచ్చరికలు ఏమీ అందలేదని, అయితే పండుగ సమయంలో దానికి అస్కారముండటంతో చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
పండుగ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి ఇప్పటికే అనేక గణేశ్ మండళ్లకు శిక్షణ ఇచ్చామని అదనపు కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) నవల్ బజాజ్ తెలిపారు. సెప్టెంబర్ 18న గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం 50 రోడ్లు మూయనున్నామని జాయింట్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) వివేక్ పాన్సల్కర్ తెలిపారు. 56 రోడ్లలో వన్‌వేకు వీలుంటుందని, 13 రోడ్లలో భారీ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. 94 రోడ్లను నో పార్కింగ్ జోన్లుగా ప్రకటించామన్నారు. ఐదు పోలీసు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. నగరవ్యాప్తంగా ఎన్‌ఎస్‌ఎస్ నుంచి 900 మంది వాలంటీర్‌లు, ఎన్‌సీసీ నుంచి 400 మంది వాలంటీర్లు సేవలందిస్తారని చెప్పారు.
మందిరాలకు బాంబు బెదిరింపు
సాక్షి, ముంబై: అంబర్‌నాథ్, ఉల్లాస్‌నగర్‌లోని మూడు పురాతన మందిరాలను పేల్చివేస్తముంటూ బెదిరింపు లేఖ రావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఆలయాల ఆవరణల్లో పోలీసు బలగాలను మోహరించింది. ఈ బెదిరింపు లేఖ ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అంబర్‌నాథ్‌లో ప్రాచీన శివమందిరం సహా బిర్లా మందిరాన్ని, ఉల్లాస్‌నగర్‌లో ఉన్న జూలేలాల్ మందిరాన్ని పేల్చివేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. ఇది చేతితో రాయబడిందని, దీంతో రాతను బట్టి నిందితులెవరో త్వరలో గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.
ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు శిక్షణ
పింప్రి, న్యూస్‌లైన్: గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పుణే యూనివర్శిటీకి చెందిన రాష్ట్రీయ సేవా యోజన (ఎన్‌ఎస్‌ఎస్) విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వీరిని ‘పోలీస్ మిత్రులు’గా నామకరణం చేసి సేవలను ఉపయోగించుకొనున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు సహాయం అందించేందుకు 10వేల మంది పోలీసు మిత్రులు ముందుకు వస్తున్నారని, వీరికి పోలీసులు శిక్షణ ఇస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ గులాబ్‌రావ్ పోల్ చెప్పారని రాష్ట్రీయ సేవా యోజన సమన్వయకులు డాక్టర్ శాకేరా ఇనాందార్ తెలిపారు. గతంలో గణేశ్ ఉత్సవాల సమయంలో ఐదువేల మంది పోలీసు మిత్రులు పోలీసులకు సహాయంగా తమ సేవలను అందజేశారు. అయితే ఈ నెల 30న ఉపముఖ్య మంత్రి అజిత్ పవార్ గణేష్ కళాక్రీడా సంకుల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో పోలీసు మిత్రులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు ఇనాందార్ తెలిపారు.
ఈసారి కూడా డ్రెస్ కోడ్
సాక్షి, ముంబై: భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన ‘అంధేరి చా రాజా’ దర్శనానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని మండలి పదాధికారులు నిర్ణయం తీసుకున్నారు. వినాయకున్ని భక్తి శ్రద్దలతో ఎంతో పవిత్రంగా దర్శించుకోవాలనే ఉద్ధేశంతో దీన్ని అమలు చేస్తున్నారు. మినీ స్కర్ట్‌లు, వంకర్లు తిరిగిన డెస్సులు వేసుకుని దర్శనానికి రావడంవల్ల ఇతరుల ఏకాగ్రత దెబ్బతింటుంది. దీంతో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వినాయకుడి దర్శనానికి రావాలని అంధేరి చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి పదాధికారులు విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం కూడా ఇలాగే డ్రెస్ కోడ్ అమలుచేశారు.
‘మహా’ నిఘా
Published Mon, Aug 26 2013 11:22 PM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
Advertisement