వైభవంగా గణేష్ ఉత్సవాలు | Grander the celebration of Ganesh | Sakshi
Sakshi News home page

వైభవంగా గణేష్ ఉత్సవాలు

Published Sat, Sep 6 2014 10:25 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

Grander the celebration of Ganesh

సాక్షి, ముంబై: ఠాణేలో గణేషోత్సవాలు ఘనంగా జరుపుకొంటున్నారు. గణనాథుడి కి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు  సుభాష్‌నగర్ పోక్రాన్ రోడ్డు నెంబరు రెండులోని ‘శ్రీ ఆంధ్ర గణేష్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో 1967 నుంచి ప్రతీఏటా గణేషోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే సుభాష్‌నగర్, హజూరి, సీపీ తలావ్, కిసన్‌నగర్, శివాజీ నగర్ తదితర ప్రాంతాల్లో చవితి పండుగ సందడి నెలకొన్నది.

 48 ఏళ్లుగా...
 శ్రీ ఆంధ్ర గణేష్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో 48 ఏళ్లగా (ప్రతీఏటా) ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వినాయకుడు కొంగుబంగారంగా వెలుగొందుతున్నాడు. ఠాణేతో పాటు ముంబై, కళ్యాణ్, ఉల్లాస్‌నగర్ తదిత ర ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకొంటారు. సుభాష్‌నగర్‌లో కె.ఎ.పి.ఎల్ కంపెనీ, వెల్‌మెన్ కంపెనీలలో పనిచేసే తెలుగు కార్మికులు, ఆంధ్రా నుంచి వచ్చిన టైలర్స్‌తో పాటు ఇతర పనులు చేసుకుంటున్న ప్రజలు కలిసికట్టుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

భక్తులందరూ కలిసి 1967లో వినాయకుని ఆలయాన్ని  నిర్మించుకున్నారు. ఈ దేవాలయాన్ని 4 సంవత్సరాల కిందటే ఆధునీకీకరించారు. ప్రస్తుతం తెలుగు గణేషోత్సవ మండలికి అధ్యక్షులుగా గుత్తుల సాహెబ్‌రావ్, ప్రధాన కార్యదర్శి కె.శ్రీను, క్యాషియర్‌లు శ్రీమాన్‌నారాయణలు బాధ్యతలు నిర్వహిస్తున్నారని మండలి సభ్యులు దాసరి భాస్కర్ రావ్ తెలిపారు.

 ప్రత్యేక పూజలు...
 ఈ సంవత్సరం పత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరానికి చెందిన బ్రాహ్మణులు ప్రభాకర్ బృందాన్ని ఠాణేకి తీసుకొచ్చారు. ప్రతి ఏట మాదిరిగానే ఈ సారి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి ఉత్సవాల్లో తెలుగు సంస్కతి సాంప్రదాయలు ఉట్టిపడుతాయి. శనివారం రాత్రి పిల్లలకు డాన్స్ ప్రొగ్రామ్, డ్రాయింగ్ పోటీ తదితరాలు నిర్వహించారు.

 నేడు సత్యనారాయణ మహాపూజ...
 గణేషోత్సవాలలో చివరిఘట్టంలో భాగంగా ఆదివారం శ్రీసత్యనారాయణ మహాపూజ నిర్వహించనున్నారు. ‘లక్ష పత్రి’ (వినాయకుని) పూజ హోమాలు చేయనున్నారు. చివరి రోజు సోమవారం అన్నదానం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

 భివండీ పట్టణంలోని కన్నేరి ప్రాంతంల్లో
 బివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణంలోని కన్నేరి ప్రాంతంలో 48 ఏళ్లుగా తెలుగు యువక్ మండలి సార్వజనీక గణేషోత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలను పుర స్కరించుకొని ప్రతి సంవత్సరం మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు తదితర సాంఘిక దురాచారలపై ప్రజలను చైతన్యం చేస్తోంది. ఇందుకు ఎన్నో బహుమతులను మండలి సొంతం చేసుకొంది.

ఈ సంవత్సరం స్వార్థం అనే అంశంపై చాలా చక్కటి ఛాయా చిత్రాలతో వినాయకుడి మండపాన్ని అలంకరించింది. సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు ఝాము వరకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకొంటున్నారని మండలి అధ్యక్షుడు గాజెంగి రాజు తెలిపారు. మండలి సభ్యులు బిల్ల నరేందర్, వడ్లకోండ శ్రీనివాస్, బిల్ల శేఖర్, చెన్న లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.

 స్వార్థ వీడాలి..
 తనకు కోరికలు తీరిస్తే, నీకు కానుకలు అందజేస్తామని కొందరు స్వార్థ బుద్ధితో దేవుడిని పూజిస్తున్నారు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రుల అనారోగ్యం గురించి పట్టించుకోనివారు దేవునికి ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదనే సందేశానిస్తున్నారు. రోడ్లపై, బస్సు స్టాపుల్లో అమ్మాయిలను వేధించి, వారిని కిడ్నాప్ చేస్తున్న కామాంధులను పట్టించుకోకుండా భక్తిప్రపత్తులు చాటడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చాటి చెబుతున్నారు. స్వార్ధాన్ని విడనాడి సమాజ శ్రేయస్సుకు పాటుపడడంలోనే దేవుని పట్ల నిజమైన భక్తి భావం ఉన్నట్లువుతుందని, వారికే విఘ్నేశ్వరుడి దీవెనలు ఉంటాయని చెబుతున్నారు.

 జైహింద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో..
 భివండీ, న్యూస్‌లైన్: ప్రసిద్ధి గాంచిన జై హింద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భివండీ పట్టణంలో అత్యధికంగా తెలుగు ప్రజలు ఉండే పద్మానగర్ ప్రాంతంలో 30 ఏళ్లుగా  ఈ మండలి వారు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలోని గణపతి మండపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడి ఆకారంలో అలంకరించారు. పర్యావరణానికి హాని జరగకుండా వెదురు బొంగులు, కార్బన్ దుస్తులు, కాగితాలు, తర్మాకోల్ వస్తువులతో అతి సుందరంగా తీర్చిదిద్దారు.

 మట్టితో చేసిన వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. వినాయకున్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. సాక్షాత్ తిరుమల తిరుపతి గర్భగుడిలో ఉన్నట్లు అనుభూతిని పొందుతున్నామని భక్తులు అంటున్నారు. ప్రతి సంవత్సరం వివిధ సామాజిక అంశాలపై ప్రజలను చైతన్య వంతం చేస్తూ బహుమతులను అందుకోంటోందని, ఈ సంవత్సరం ధామన్‌కర్ నాకా మిత్ర మండల్‌కు ప్రథమ బహమతి లభించగా, ద్వితీయ బహుమతి జై హింద్ మిత్ర మండల్‌కు లభించిందని మండలి అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ సుంక తెలిపారు.

 ప్రముఖులకు సన్మానం
 పట్టణంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు నిత్యం ఇక్కడి వినాయకుడిని దర్శించుకొంటారు. వీరిని నిర్వాహకులు ఘనంగా సత్కరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ముంబై సర్కల్ జనరల్ మేనేజర్ డి. పూర్ణచంద్ర రావు,  డిప్యూటీ జనరల్ మేనేజర్ శివానంద, పీఆర్‌ఓ చంద్రశేఖర్‌ను మండలి అధ్యక్షుడు సుంక శ్రీధర్, పదాధికారులు మ్యాన రవి, వాసం మునింధర్, కొండ మోహన్, కముటం సుధాకర్, బూర పప్పు తదితరులు ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement