సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాలను అదనుగా చేసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు ప్రయాణికులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వినాయక చవిత శుక్రవారం కావడంతో స్వగ్రామాలకు వెళ్లేవారు ముంబై నుంచి ఎట్టి పరిస్థితుల్లో గురువారం బయలుదేరాల్సిందే. దీన్ని ప్రైవేటు బస్సు, టూరిస్టు యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు.
సాధారణంగా కొంకణ్ వెళ్లే వారి సంఖ్య 90 శాతం ఉంటుంది. రెగ్యూలర్‌గా నడిచే రైళ్ల రిజర్వేషన్ రెండు నెలల కిందటే ఫుల్ అయ్యాయి. ఉత్సవాల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న వందకుపైగా రైళ్లు, ఎమ్మెస్సార్టీసీ నడుపుతున్న 3,500కు పైగా ప్రత్యేక బస్సులు కూడా ఎటూ సరిపోవడం లేదు. దీంతో కొంకణ్ వాసులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రైవేటు వాహనాల యజమానులు దోపిడీ పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో కొంకణ్ రీజియన్‌లోని సింధుదుర్గ్, రత్నగిరి, సావంత్‌వాడి ప్రాంతాలకు వెళ్లాలంటే రూ.400-500 చార్జీలు వసూలు చేస్తారు.
కాని గణేష్ ఉత్సవాల పుణ్యమా అని ఒక్కసారిగా రెండు, మూడు రెట్లు చార్జీలు పెంచేశారు. దీనికి తోడు కొంకణ్ రైళ్లు 12 గంటలు ఆలస్యంగా నడవడం, మొన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దుకావడం, తాజాగా బుధవారం సిగ్నల్ ఫెయిల్ కావడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఘాట్ ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ..ఇలా అనేక కారణాలవల్ల అత్యధిక శాతం ప్రజలు ప్రైవేటు వాహనాల్లో వెళ్లడమే నయమని భావిస్తున్నారు.
బుధవారం వరకు రూ. వేయి వసూలుచేసిన ప్రైవేటు వాహనాలు గురువారం ఏకంగా రూ.15 వందల వరకు పెంచేశారు. ఇంత పెద్దమొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ సీటు కావాలని వారిని ప్రాధేయపడాల్సి వస్తోంది. దీన్ని బట్టి ప్రైవేటు వాహనాల డిమాండ్ ఎంతమేర పెరగిందో ఇట్టే స్పష్టమవుతోంది. సందెట్లో సడేమీయా అన్నట్లుగా రద్దీని అదనుగా చేసుకుని పాత, తుక్కు బస్సులను కూడా రోడ్డుపైకి తెస్తున్నారు. అనుభవం లేని డ్రైవర్లకు స్టీరింగ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కాగా, ప్రతియేటా వినాయక చవితి సందర్భంలో ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని, ట్రాఫిక్, ఆర్టీవో, రాష్ట్ర పోలీసులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ వాహన యజమానులు తమను నిలువుదోపిడీ చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నింగికెగిసిన సామగ్రి ధరలు
పెరిగిన నిత్యావసర సరుకుల ధరల ప్రభావం వినాయకుని విగ్రహాలు, పూజా సాహిత్యంపై విపరీతంగా చూపాయి. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో స్వీట్లు, పండ్లు, పూలు, అగరవత్తులు ఇలా పూజా, హోమం సాహిత్యం ధరలు విపరీతంగా పెంచేశారు. మొన్నటి వరకు కేజీ రూ.40 పలికిన బంతిపూలు ఇప్పుడు రూ.150-200 చొప్పున విక్రయిస్తున్నారు. అదేవిధంగా మల్లెపూలు, చామంతి, అరటి కొమ్మలు, అరటి ఆకులు, మామిడి ఆకులు, కొబ్బరి బొండం, మొక్కజొన్న, పూల దండలు, ఐదు రకాల పండ్లు, ఫలాలు ఇలా వినాయకుడికి సమర్పించే సామాగ్రి ధరలు మూడు, నాలుగు రెట్లు పెంచేశారు. అయినప్పటికీ దాదర్ పూల మార్కెట్ కొనుగోలుదార్లతో కిటకిటలాడుతోంది. స్వీట్ల ధరలు కూడా మిగిలిన వాటితో పోటీపడుతున్నాయి.
చవితి ‘బాదుడు’..!
Published Thu, Aug 28 2014 10:39 PM | Last Updated on Thu, May 24 2018 1:29 PM
Advertisement
Advertisement