నేరగాళ్ల పంజా
సాక్షి, సిటీబ్యూరో:శుక్రవారం.. ఐడీఏ బొల్లారం ఔటర్ రింగ్‌రోడ్ సర్వీస్ రోడ్‌లో ఉప్పల్ టెలిఫోన్ కాలనీకి చెందిన కాంట్రాక్టర్ హన్మంతు దారుణహత్య
శనివారం.. ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్డులోని నాలాలో హత్యకు గురైన స్థితిలో మహిళ మృతదేహం..
లక్డీకాపూల్ హోటల్‌లో విజయనగరం జిల్లాకు చెందిన రియల్టర్ వై.శివప్రసాద్ దారుణహత్య..
కుత్బుల్లాపూర్ శ్రీసాయి కాలనీలో పట్టపగలు తాయమ్మపై హత్యాయత్నం, దోపిడీ..
ఆదివారం.. సీతారామ్‌బాగ్‌లో పట్టపగలు ఇంట ర్మీడియట్ విద్యార్థి శివకుమార్ దారుణహత్య, దోపిడీ.
సోమవారం.. కూకట్‌పల్లిలో కర్రీ పాయింట్ నిర్వహించే చందుపై దుండగుల కాల్పులు.. దోపిడీ యత్నం..
జంట కమిషనరేట్ల పరిధిలో గడిచిన మూడు రోజుల్లో చోటుచేసుకున్న దారుణోదంతాలివి. నేరగాళ్లు బరితెగించి పట్టపగలు గొంతులు తెగ్గోస్తున్నా.. నిండు ప్రాణాల్ని బలిగొంటున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారు. నిఘా దగాపడుతోంది. నేరగాళ్లపై కదలికలు కరువయ్యాయి. పోలీసుల పనితీరుకు ‘మచ్చ’ తునకలుగా నిలుస్తున్న ఈ వరుస ఉదంతాలను పరిశీలిస్తే.. నేరగాళ్లే పోలీసులపై కదలికలపై కన్నేసి, వారు ఆదమరుపుగా ఉండటాన్ని గమనించి పంజా విసురుతున్నారని స్పష్టమవుతోంది.
పోలీస్ కదలికల్ని కనిపెట్టి మరీ నేరాలు..
బోనాలు, రంజాన్, స్వాతంత్య్ర దినోత్సవం.. వరుస వేడుకల నేపథ్యంలో పోలీసులు కొద్ది రోజులు అప్రమత్తంగా ఉన్నారు. రాజధాని వ్యాప్తంగా నిఘా ముమ్మ రం చేసి, గస్తీలు, ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో అన్ని రోజులు నేరగాళ్లు మిన్నకుండిపోయారు. కీలక ఘట్టాలు పూర్తయి పోలీసులు కాస్త ఏమరుపాటు ప్రదర్శించారో లేదో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ప్రసు ్తతం నగరంలో ఎక్కడా నిఘా, తనిఖీల్లేవు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎలాగూ కొద్ది రోజుల్లో డబుల్ డ్యూటీలు తప్పవనే భావనతో ఇప్పటి నుంచే పోలీ సులు ‘రిలాక్స్’ అవుతున్నారు. ఇదే అదనుగా దొం గలు విజృంభిస్తున్నారు. అంటే పోలీసుల కదలికల్ని నేరగాళ్లు పక్కాగా గమనిస్తున్నారని భావించాలి.
ఎన్ని అనుభవాలైనా ఏం లాభం?
గతానుభవాల నుంచి పోలీసులు పాఠాలు నేర్వట్లేదు. మొన్నటికి మొన్న సైబరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో పట్టపగలు దొంగలు పంజా విసిరారు. ఓ వృద్ధురాలి గొంతు కోసి దోపిడీకి పాల్పడ్డారు. అంతలోనే హైదరాబాద్ పరిధిలోని సీతారాంబాగ్‌లో పంజా విసిరారు. ఇది జరిగిన 12 గంటల్లోనే కూకట్‌పల్లిలో ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ మూడు ఉదంతాలు నిఘా, గస్తీ విధానాల్లోని డొల్లతనానికి నిదర్శనం.
సమర్థ అధికారులేరీ?
దోపిడీ, దొంగతనాల ఆపరేషన్లలో అనుభవం, పాత నేరగాళ్ల కదలికలపై పట్టున్న అధికారుల సంఖ్య జంట కమిషరేట్లలో వేళ్లపైనే లెక్కించవచ్చు. వీరు కూడా ప్రస్తు తం పూర్తిగా అందుబాటులో లేరు. హైదరాబాద్ కమిషరేట్‌లో ఉన్న వారు ప్రస్తు తం బందోబస్తులతో బిజీ అయిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అధికారుల్లో కొందరు లూప్‌లైన్‌లోకి వెళ్లిపోగా... ఇంకొందరు పదవీ విరమణ చేశారు. ఇంకొందరు బదిలీలపై వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. క్రైమ్ విభాగంలోకి రావడమంటే సమర్థులైన అధికారులంతా శిక్షగా భావిస్తున్నారు. అక్కడున్న పరిస్థితులే ఇందుకు కారణం. వెరసి ఇవన్నీ నేరాలకు ఊతమిస్తున్నాయి.
నైబర్‌హుడ్ వాచ్ ఉత్తమం...
అడ్డూఅదుపూ లేకుండా జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే పౌరులూ స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటికీ పోలీసులపై ఆధారపడకుండా ఎవరికి వారు బాధ్యతగా మెలగాలని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఏం జరుగుతోందో కన్నేసి ఉంచి అవసరమైన సందర్భాల్లో స్పందించి పోలీసులకు సమాచారమివ్వడమనే సూత్రంతో కూడిన నైబర్‌హుడ్ వాచ్ (ఇది విదేశాల్లో అమల్లో ఉంది) విధానాన్ని మెరుగుపర్చడానికి పోలీసు విభాగం కృషి చేయాలని సూచిస్తున్నారు.
డైనమిక్ విధానాలే శరణ్యం..
నగరంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఒక షెడ్యూల్ ప్రకారం తనిఖీలు జరుగుతుంటాయి. ఒకరోజు, ఒక సమయానికి, ఒక ప్రాంతంలో తనిఖీలు చేసిన పోలీసులు... తరువాతి రోజూ అవే వేళల్లో తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ పాయింట్స్ స్థిరంగా ఉంటున్నాయి. పెట్రోలింగ్ వాహనాల గస్తీదీ ఇదే తీరు. ఇవన్నీ యాంత్రికంగా సాగిపోతున్నాయి. దీనివల్ల పోలీసులు ఏ సమయంలో ఎక్కడకు వస్తున్నారనేది సాధారణ ప్రజలే కనిపెట్టేస్తున్నారు. ఇక, నేరగాళ్లకు ఇదో పెద్ద లెక్క కాదు. డైనమిక్ విధానాల అమలే ఈ పద్ధతిలో మార్పు తేగలదు. ఈ విధానంలో పోలీసుల చర్యలేవీ అంతుబట్టవు. నిర్దేశించిన మేరకు జరగవు. ప్రతి ఠాణా పరిధిలోనూ అకస్మాత్తుగా, ఆకస్మికంగా తనిఖీలు జరుగుతాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా పోలీసులు ప్రత్యక్షమవుతారు. దీనివల్ల పూర్తిగా విజిబుల్ పోలీసింగ్ అమల్లో ఉంటుంది. ఫలితంగా నేరగాళ్లు చెలరేగడానికి జంకుతారు.