కుక్కల కట్టడికి చర్యలు
చార్మినార్ : పండుగలు వస్తున్నాయంటే... రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. అయితే ప్రస్తుతం వీరితో పాటు దక్షిణ మండలం పోలీసులు కుక్కలపై (గ్రామసింహాలు) కూడా దృష్టి పెట్టారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని డీసీపీ సత్యనారాయణ కుక్కలను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఓ వైపు వినాయక ఉత్సవాలు.. మరోవైపు ఈనెల 25న జరుగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీసులు పాతబస్తీలో రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు పాతనేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. అలాగే, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమవుతున్న కుక్కలను కట్టడి చేయాలని డీసీపీ నిర్ణయించారు. చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా ఏసీపీ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ప్రాంతాల్లో కుక్కల బెడద లేకుండా ఇప్పటి నుంచే జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు, సిబ్బందితో కలిసి కుక్కల సంచారాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు.
కుక్కలతో ఇరు వర్గాల ఘర్షణలు...
బక్రీద్ పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లపై కనిపించే జంతువుల వ్యర్థాలను కుక్కలు తింటుంటాయి.అయితే,కొన్ని కుక్కలు ఆ వ్యర్థాలను తమకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ప్రశాంతంగా తింటుంటాయి. ఇలా తీసుకెళ్లే కుక్కల వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. జంతువుల వ్యర్థాలను వినాయక మండపాలు, మండపాల సమీపంలోకి తీసుకె ళ్లి వదిలేస్తే.. మండపాల నిర్వాహకులు, భక్తులకు ఆగ్రహం వచ్చి ఇరువర్గాల మధ్య ఘర్షణలకు దారితీయొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ముందుగా కుక్కలను కట్టడి చేయడం శ్రేయస్కరమని భావిస్తున్నారు.
గట్టి బందోబస్తు...
జంట పండుగల కోసం ఇప్పటికే పాతబస్తీలో అదనపు బలగాలను రప్పించి బందోబస్తులో నియమించామన్నారు. ఒక కంపెనీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు, రెండు కంపెనీల సీఆర్‌పీఎఫ్, రెండు కంపెనీల ఆర్‌ఏఎఫ్‌లతో పాటు 2 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారన్నారు.
శాంతి సామరస్యంతో పండుగలు జరుపుకోవాలి...
జంట పండుగులను ఇరువర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో జరుపుకోవాలి. గణేశ్ వేడుకలు, బక్రీద్ సందర్భంగా పాతబస్తీలో గట్టి బందోబస్తు కొనసాగిస్తున్నాం. వినాయక మండపాల నిర్వాహకులు 9వ రోజు (ఈనెల 25న)న పెద్ద సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించే అవకాశాలున్నాయి. అదే రోజు బక్రీద్ పండుగ ఉన్నందున భక్తులు తమ విగ్రహాల నిమజ్జనాన్ని ఒక రోజు ముందు చేసుకోవడంలేదా..26వ తేదీకి వాయిదా వేసుకుంటే బాగుంటుంది.
-వి.సత్యనారాయణ, దక్షిణ మండలం డీసీపీ