బకాయిల చెల్లింపు కోసం బాదుడు | MSRTC to pay arrears by raising fares from June 1 | Sakshi
Sakshi News home page

బకాయిల చెల్లింపు కోసం బాదుడు

Published Wed, May 28 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

MSRTC to pay arrears by raising fares from June 1

సాక్షి, ముంబై: మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఎమ్మెస్సార్టీసీ) బస్ చార్జీలను 2.5 శాతం మేర పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పెరిగిన చార్జీలు మొదటి రెండు స్టేజీ (12 కి.మీ.)లకు వర్తించవని, ఆపై ప్రయాణానికి 2.5 శాతం చొప్పున చార్జీలు వసూలు చేస్తారన్నారు. ఎమ్మెస్సార్టీసీ ఉద్యోగులకు ఏరియర్స్‌ను పెంచి ఇచ్చేందుకే ఈ చార్జీలను పెంచాల్సి వచ్చిందని చెప్పారు. ఏరియర్స్ పెంచకపోతే జూన్ 4 నుంచి ఆందోళనకు దిగుతామని సిబ్బంది, యూనియన్లు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

 త్వరలో ఏసీ బస్సు చార్జీలు కూడా...
 ఏసీ బస్సుల చార్జీలను కూడా పెంచే అవకాశముందని,  త్వరలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు పెంచాలని నిర్ణయించిన చార్జీల పట్టిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారని, పట్టిక సిద్ధమవుతోందన్నారు.

 శ్రమ ఫలించింది..: యూనియన్లు
 ఏరియర్స్ పెంపు కోసం తాము చేస్తున్న ఆందోళన సత్ఫలితాలనిచ్చిందని యూనియన్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఏరియర్స్, కరవు భత్యాన్ని పెంచాలని కొన్ని నెలలుగా కోరుతున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో మంగళవారం పలు డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించామని, జూన్ 4వ తేదీన 80 వేలకుపైగా సిబ్బందితో ఆందోళనకు దిగుతామని హెచ్చరించామని యూనియన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. చార్జీలను పెంచిన తర్వాత కూడా ప్రభుత్వం ఏరియర్స్‌ను చెల్లించేందుకు నిరాకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు.

 మూడు నెలల్లోపే...
 మార్చిలో చార్జీలను పెంచుతూ ప్రయాణికులపై భారం మోపిన ఎమ్మెస్సార్టీసీ మూడు నెలలు తిరగకుండానే మరోసారి చార్జీలను పెంచింది. గత మార్చిలో ఏసీ బస్ చార్జీలను రూ.15 పెంచారు. దాదర్-పుణే ఏసీ బస్ చార్జీలను రూ.390 నుంచి 405కు పెంచారు. బోరివలి నుంచి పుణే వరకు ప్రయాణించేవారికి రూ.465 నుంచి 480 వరకు చార్జీలను పెంచారు. ఏసీ బస్సు చార్జీలను కూడా త్వరలో పెంచనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement