సాక్షి, ముంబై: నగరంలోని ఫ్లై ఓవర్ల కింద నిలిపి ఉంచిన వాహనాలను జప్తు చేయనున్నట్లు మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్టీసీ) స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశానుశారం ఈ చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎంఎస్‌ఆర్టీసీ పరిధిలో మొత్తం 11 ఫ్లై ఓవర్లు ఉన్నాయి. వాటి దిగువ భాగంలో వేలాది వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. 2010లో నగరవ్యాప్తంగా ఉన్న ఫ్లై ఓవర్ల దిగువ భాగాన వాహనాలను పార్కింగ్ చేయడాన్ని నిషేధించింది. నగరానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. సదరు స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్‌ఆర్టీసీ తగిన ప్రణాళికను తయారుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ వాహనాలను నిలిపి ఉంచడం నిషేధమని రెండు నెలల కిందటే ఎంఎస్‌ఆర్టీసీ ఆయా వాహనాల యజమానులను ఆదేశించింది. ఇప్పటికే నిలిచి ఉంచిన వాహనాలను తొలగించకుంటే వాటిని జప్తు చేస్తామని హెచ్చరించింది. అయితే సంస్థ ఆదేశాలను నగరవాసులు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు.
ఇదిలా ఉండగా ఆరే మిల్క్ కాలనీ ఫ్లై ఓవర్, ఠాణేలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న క్యాడ్‌బరీ జంక్షన్ ఫ్లై ఓవర్ దిగువన ఎప్పటినుంచో ధ్వంసమైన కార్లు అధిక సంఖ్యలో పడి ఉన్నాయి. కాగా, ఎంఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ బిపిన్ శ్రీమల్ మాట్లాడుతూ .. ఎంఎస్‌ఆర్టీసీ పరిధిలోని ఫ్లై ఓవర్ల దిగువ భాగంలో పార్క్‌చేసిన వాహనాల తొలగింపు చేపట్టామన్నారు. తాము ఇప్పటికే ఏడు, ఎనిమిది ఫ్లై ఓవర్ల దిగువన పార్క్ చేసిన వాహనాలను తొలగించి, ఆ స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. త్వరలోనే మొత్తం ఫ్లై ఓవర్ల కింద వాహనాల తొలగింపును పూర్తిచేస్తామన్నారు.
కాగా వకోలా జోగేశ్వరి-విక్రోలి లింక్ రోడ్ ఫ్లై ఓవర్, కుర్లా-సీఎస్టీ ఫ్లై ఓవర్, అంధేరి-ఘాట్కోపర్ లింక్ రోడ్ ఫ్లై ఓవర్, వకోల ఫ్లై ఓవర్, గోరేగావ్-ములుండ్ లింక్ రోడ్, చెడా నగర్ ఫ్లై ఓవర్, వకోల, నితిన్ క్యాస్టింగ్, గోల్డెన్ డైస్, క్యాడ్‌బెరీ, ఫర్గ్యూసన్ రోడ్ ఫ్లై ఓవర్లు ఎంఎస్‌ఆర్టీసీ పరిధిలోకి వస్తాయి.
ఫ్లైఓవర్ కింద ‘నో పార్కింగ్’!
Published Sun, Sep 1 2013 12:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement