శ్యామ్ (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లైఓవర్‌పై మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. వేగంగా వస్తూ వాహనాలను అదుపు చేయలేక ప్రమాదానికి గురవుతున్నారు.
అల్లిపురం నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రెండో పట్టణ ఇన్‌చార్జి సీఐ రమణమూర్తి తెలిపిన వివరాలివీ.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన కాపరపు శ్యామ్(21), కాపరపు రాజు అలియాస్ బాబీ(20), అనకాపల్లి జిల్లా కొత్తూరుకు చెందిన తోట హర్ష అలియాస్ నాని ఇళ్లకు సున్నాలు వేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
గాజువాకలో సున్నాలు వేసేందుకు వచ్చిన వారు బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో ఒకే బైక్‌పై ఆర్.కె.బీచ్‌కు వెళ్లారు. తిరిగి సుమారు మూడు గంటల ప్రాంతంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా గాజువాక వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పడంతో వంతెన చివర్లో గల మలుపు వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో శ్యామ్ తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే మరణించాడు.
హర్ష తలకు తీవ్ర గాయాలవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రాజు కాళ్లు విరిగిపోవడంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే హర్ష ప్రాణాలు కోల్పోయాడు. రాజు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. శ్యామ్, రాజులిద్దరూ అన్నదమ్ముల పిల్లలు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ..
ఈ విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఏడీసీపీ, ఏసీపీలను ఆదేశించారు.
నిబంధనలు పాటించాలి..
తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ఎత్తు పల్లంతో కూడిన ప్రమాదకర మలుపు వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఫ్లైఓవర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది మరణించారని, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఇంజినీరింగ్ వైఫల్యమే ఇందుకు కారణమని, ఈ సమస్యపై గత ఫిబ్రవరిలో జీవీఎంసీ అధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు.
జీవీఎంసీ అధికారులు సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వాహన చోదకులు కూడా నిబంధనలు పాటించాలన్నారు. త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర, శిక్షార్హమైన డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. వాహన చోదకలు నిబంధనలు పాటించకపోవడం వల్ల వారితో పాటు పాదచారులకు భద్రత లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment