పెరిగిన స్లీపర్‌బస్సు చార్జీలు | Sleeper bus charges Increased | Sakshi
Sakshi News home page

పెరిగిన స్లీపర్‌బస్సు చార్జీలు

Published Wed, Oct 30 2013 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

Sleeper bus charges Increased

పింప్రి, న్యూస్‌లైన్: మహారాష్ర్ట రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) ఆకస్మాత్తుగా వోల్వో ఏసీ స్లీపర్ బస్సుల చార్జీలు పెంచడంతో దీపావళికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులపై తీవ్రభారం పడుతోంది. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు డిమాండ్ పెరగడంతో అవి తమ ఇష్టం వచ్చినట్లు చార్జీలను వసూలు చేస్తున్నాయని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై నుంచి చాలా మంది నిత్యం హైదరాబాద్, విజయవాడ, ఔరంగాబాద్, బెల్గావ్, హుబ్లీ, సూరత్, అకోలా, నాగ్‌పూర్‌కు వె ళ్తుంటారు.
 
 వోల్వో బస్సులో అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం రూ.1,000 ఉండగా దానిని ఇప్పుడు రూ.2,500లకు పెంచారు. నాగ్‌పూర్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం రూ.1,100 ఉండగా రూ.2,500లకు పెంచారు. హుబ్లీకి ప్రస్తుత చార్జీ ధర 1,000 ఉండగా రూ.2,000లకు పెంచారు. హైదరాబాద్‌కు ప్రస్తుతం రూ.1,500 ఉండగా రూ.3,000లకు పెంచారు, బెంగుళూరు రూ.1,300 ఉండగా, రూ.2,500లకు పెంచారు. సూరత్‌కు వెళ్లేందుకు ప్రస్తుత చార్జీ రూ.500 ఉండగా రూ.1,000, అకోలాకు రూ.600 ఉండగా, రూ.1,600లకు పెంచారు. బెల్గావ్‌కు ప్రస్తుత చార్జీ రూ.400 కాగా ఇక నుంచి రూ.900 చెల్లించాలి.
 
 ఇక ప్రైవేట్ బస్సుల్లో వేర్వేరు చార్జీలతో టికెట్లు విక్రయించడంతో సామాన్య ప్రజలు దేనిని ఎంచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది తమ ప్రయాణాలనే వాయిదా వేసుకుంటున్నారని బాంద్రాకు చెందిన తెలుగువ్యక్తి ఒకరు అన్నారు. రైళ్లలో వెళ్దామనుకున్నా ఏ బోగీ చూసినా కిక్కిరిసి కనిపిస్తోందని, రోజూ రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల చుట్టూ తిరగలేక ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నామని వివరించారు. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు ఇది వరకే పూర్తి కావడం, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో సెలవులు వృథా అవుతున్నాయని విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అధ్వానంగా ఉంటుందన్నాయని చెబుతున్నారు. రైల్వే పండగ సమయాల్లోనైనా జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement