దీపావళికి పెట్రోల్ ధరలు డౌన్
అమృత్‌సర్: అమృత్‌సర్: ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ధరల ప్రభావంతో పాటు దేశీయంగా పన్నుల బాదుడుతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పైకి ఎగుస్తున్నాయి. అయితే రాబోతున్న దీపావళి పండుగకు వాహనదారులకు ఈ ధరల నుంచి కొంత ఊరట లభించనుంది. పైపైకి ఎగుస్తున్న ఇంధన ధరలు, దీపావళి నాటికి కిందకి దిగొస్తాయని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వచ్చే నెలలో ఈ ధరలు తగ్గుతాయన్నారు. ఇంధన ధరలు భారీగా పెరగడంపై ప్రతిపక్షాలు, ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రోజువారీ ఇంధన ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచే ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడుతున్నాయి.
అయితే రోజువారీ ఇంధన ధరల సమీక్ష చాలా పారదర్శకంగా ఉందని మంత్రి చెప్పారు. అమెరికాలో వచ్చిన ఇర్మా, హార్వే కారణంతో అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్‌పుట్ 13 శాతం పడిపోయిందని మంత్రి తెలిపారు. ఈ ప్రభావంతో రిఫైనరీ ఆయిల్ ధరలు పైకి ఎగుస్తున్నాయన్నారు. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంశంపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో కస్టమర్లకు అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాన్ చెప్పారు.