పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదంటే?
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయాయి. అయినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు అధికంగానే ఉంటున్నాయి? అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర బ్యారెల్‌కు 40 డాలర్ల కన్నా తక్కువే ఉంది. గత 11 ఏళ్లలో ఇదే అత్యల్ప ధర అయినా దేశీయంగా పెట్రోల్ వినియోగదారులకు ఆ మేరకు ఎందుకు ఊరట లభించడం లేదు? ఈ విషయంలోని లోగుట్టును కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం వివరించే ప్రయత్నం చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నా.. వాటిపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం పెరుగుతుండటంతో ఆ లబ్ధి వినియోగదారులకు అందడం లేదు. చమురు అమ్మకం విషయమై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో 42శాతం వరకు రాష్ట్రాలకే వెళుతున్నదని, మిగతాది అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళుతున్నదని అరుణ్‌జైట్లీ వివరించారు. 'ఎక్సైజ్ సుంకంలోని కొంత భాగం జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతోంది. తమ కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్ తో ఆ రోడ్లపైనే వాహనదారులు తమ వెహికిల్స్ నడుపుతున్నందున ఇందుకు వారు చెల్లించాల్సిందే' అని ఆయన చెప్పారు.
పెట్రోల్, డీజిల్ ధరల్లో అధికపాత్ర పోషించే వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) రాష్ట్రాలకే వెళుతున్నదని, దానిలో నాలుగోవంతు రుసుం మాత్రం చమురు కంపెనీలు తీసుకుంటున్నాయని, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా అవి భారీ నష్టాలను చవిచూస్తున్నాయని జైట్లీ తెలిపారు. చమురు కంపెనీలు 80 డాలర్లకు కొనుగోలు చేస్తే.. అమ్మే సమయానికి 60 డాలర్లకు ధర పడిపోతున్నదని, ఈ పరిస్థితితో అవి ఒకానొక సమయంలో రూ. 40వేల కోట్ల వరకు నష్టాలను చవిచూశాయని ఆయన చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెటరీ కోతలు లేకుండానే ద్రవ్యలోటు (జీడీపీలో 3.9శాతం) ను ఈ సంవత్సరం పూడ్చుకునే అవకాశముందని ఆయన చెప్పారు.