ముంబై: భారత్‌కు సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి కీలకమైన ఇంధన ధరలు అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పదవీకాలంలో తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) జీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇది దేశ ఎకానమీకి సానుకూల అంశమని విశ్లేషించారు.
అయితే ఆహార ద్రవ్యోల్బణంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో 14 నెలల గరిష్ట స్థాయి 6.2 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడంపై ఆయన మాట్లాడుతూ టమోటా, ఉల్లి, ఆలూ ధరల పెరుగుదల దీనికి కారణమని పేర్కొన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వార్షిక బ్యాంకింగ్, ఆర్థిక సదస్సును ఉద్దేశించి సీఈఏ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...
» రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం అధిక వేగంతో అభివృద్ధి చెందాలంటే ఇంధన ధరలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది.
» పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన లక్ష్య సాధనలు ముఖ్యమైనవి అయినప్పటికీ, అంతకుముందు ఆర్థిక వృద్ధిని సృష్టించడం చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు ముందు ఆర్థికవృద్ధి సాధన చాలా కీలకాంశం.
» ట్రంప్ పరిపాలనలో అమెరికాకు భారత్ చేసే వస్తు, సేవల ఎగుమతులకు కొన్ని సవాళ్లు తప్పవు. అయితే అమెరికా ఎటువంటి విధానాలు అవలంభించినప్పటికీ పలు మార్కెట్లకు ఎగుమతులు విస్తరిస్తున్నందున భారత్ ఆర్థికాభివృద్ధిలో ఈ విభాగం కీలక పాత్రను పోషిస్తుంది.
» అధిక వడ్డీరేట్లు ఎకానమీ వృద్ధికి అవరోధంగా మరతాయన్న ఆందోళన విషయానికి వస్తే, అటువంటి అధ్యయనం ఇంకా చేపట్టవలసి ఉంది. దాని గురించి నేను ఇప్పుడు వ్యాఖ్యానించలేను. (ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పియూష్ గోయెల్‌లు ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను –ప్రస్తుతం 6.5 శాతం– తగ్గించాలని సూచిస్తున్న నేపథ్యంలో నాగేశ్వరన్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం)
» 1980 వరకూ ఆధిపత్యం చెలాయించిన ‘‘‘కొరత దశ‘ నుంచి భారత్ కార్పొరేట్ రంగం బయటపడి, ‘మైండ్‌సెట్ షిఫ్ట్‘ చేయడం ద్వారా తమ ఆశయాలను విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది.
బలహీన రూపాయితో ప్రయోజనం పొందాలని చూడద్దు: కార్పొరేట్లకు విజ్ఞప్తి
కాగా, బలహీన రూపాయిలో ప్రయోజనం పొందాలని చూడవద్దని కార్పొరేట్లకు నాగేశ్వరన్ మరో కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎగుమతుల విషయాన్ని ప్రస్తావిస్తూ, బలహీన రూపాయి ఎగుమతుల రంగానికి మంచిదే కావచ్చుకానీ, ఇదే కారణంగా ఈ విభాగం పురోగతిని ఆశించడం తగదని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌ఐడీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి అనేది విధానపరమైన అంశంగా ఉండాలన్నారు. ఉత్పాదకత, పరిశోధన, అభివృద్ధి, నాణ్యత, పెట్టుబడి వంటి అంశాలు విధానపరమైన పురోగతిలో భాగంగా ఉండాలి తప్ప, ‘రూపాయి బలహీనత’ వంటి ప్రత్యామ్నాయ అంశాలపై ఆధారపడి ఉండరాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment