Chief Economic Advisor
-
ట్రంప్ హయాంలో భారత్‌కు ఇం‘ధనం’
ముంబై: భారత్‌కు సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి కీలకమైన ఇంధన ధరలు అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పదవీకాలంలో తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) జీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇది దేశ ఎకానమీకి సానుకూల అంశమని విశ్లేషించారు.అయితే ఆహార ద్రవ్యోల్బణంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో 14 నెలల గరిష్ట స్థాయి 6.2 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడంపై ఆయన మాట్లాడుతూ టమోటా, ఉల్లి, ఆలూ ధరల పెరుగుదల దీనికి కారణమని పేర్కొన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వార్షిక బ్యాంకింగ్, ఆర్థిక సదస్సును ఉద్దేశించి సీఈఏ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... » రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం అధిక వేగంతో అభివృద్ధి చెందాలంటే ఇంధన ధరలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. » పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన లక్ష్య సాధనలు ముఖ్యమైనవి అయినప్పటికీ, అంతకుముందు ఆర్థిక వృద్ధిని సృష్టించడం చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు ముందు ఆర్థికవృద్ధి సాధన చాలా కీలకాంశం. » ట్రంప్ పరిపాలనలో అమెరికాకు భారత్ చేసే వస్తు, సేవల ఎగుమతులకు కొన్ని సవాళ్లు తప్పవు. అయితే అమెరికా ఎటువంటి విధానాలు అవలంభించినప్పటికీ పలు మార్కెట్లకు ఎగుమతులు విస్తరిస్తున్నందున భారత్ ఆర్థికాభివృద్ధిలో ఈ విభాగం కీలక పాత్రను పోషిస్తుంది. » అధిక వడ్డీరేట్లు ఎకానమీ వృద్ధికి అవరోధంగా మరతాయన్న ఆందోళన విషయానికి వస్తే, అటువంటి అధ్యయనం ఇంకా చేపట్టవలసి ఉంది. దాని గురించి నేను ఇప్పుడు వ్యాఖ్యానించలేను. (ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పియూష్ గోయెల్‌లు ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను –ప్రస్తుతం 6.5 శాతం– తగ్గించాలని సూచిస్తున్న నేపథ్యంలో నాగేశ్వరన్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం) » 1980 వరకూ ఆధిపత్యం చెలాయించిన ‘‘‘కొరత దశ‘ నుంచి భారత్ కార్పొరేట్ రంగం బయటపడి, ‘మైండ్‌సెట్ షిఫ్ట్‘ చేయడం ద్వారా తమ ఆశయాలను విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది. బలహీన రూపాయితో ప్రయోజనం పొందాలని చూడద్దు: కార్పొరేట్లకు విజ్ఞప్తి కాగా, బలహీన రూపాయిలో ప్రయోజనం పొందాలని చూడవద్దని కార్పొరేట్లకు నాగేశ్వరన్ మరో కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎగుమతుల విషయాన్ని ప్రస్తావిస్తూ, బలహీన రూపాయి ఎగుమతుల రంగానికి మంచిదే కావచ్చుకానీ, ఇదే కారణంగా ఈ విభాగం పురోగతిని ఆశించడం తగదని ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ (ఐఎస్ఐడీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు.అభివృద్ధి అనేది విధానపరమైన అంశంగా ఉండాలన్నారు. ఉత్పాదకత, పరిశోధన, అభివృద్ధి, నాణ్యత, పెట్టుబడి వంటి అంశాలు విధానపరమైన పురోగతిలో భాగంగా ఉండాలి తప్ప, ‘రూపాయి బలహీనత’ వంటి ప్రత్యామ్నాయ అంశాలపై ఆధారపడి ఉండరాదని స్పష్టం చేశారు. -
వర్ధమాన దేశాలపై కార్బన్ ట్యాక్స్ సరికాదు - సీఈఏ కీలక వ్యాఖ్యలు
వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
దశాబ్దం పాటు 6.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలం పాటు భారత్ 6.5 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి నుంచి ఎగుమతులు అన్నవి కొంత నిదానంగా ఉండొచ్చని, ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, వృద్ధిపై మన ఎగుమతులు ఆధారపడి ఉంటాయన్నారు. వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆర్థిక, రుణ, పెట్టుబడుల సైకిల్ పునరుద్ధరణతో రానున్న పదేళ్ల పాటు సగటున 6.5 శాతం వృద్ధి సాధ్యమేనని నాగేశ్వరన్ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి నిదానించడం అన్నది కరోనాకి ముందే, సహజంగానే మొదలైనట్టు అంగీకరించారు. బ్యాంక్ బ్యాలన్స్ షీట్ల ప్రస్తావన, ఆ తర్వాత కరోనా మమహ్మారి రూపంలో, ఆ తర్వాత కమోడిటీల ధరల పెరుగుదల రూపంలో సవాళ్లు ఎదురైనట్టు చెప్పారు. సహజంగానే ఇవి ప్రైవేటు ఇన్వెస్టర్లలో అనిశ్చితికి దారితీస్తాయన్నారు. -
పరిస్థితులు బాలేవు.. ఆర్థిక క్రమశిక్షణ అవసరం
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవలి పరిణామాల తర్వాత ప్రపంచ అనిశ్చితి పెరుగుతోందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యక్తులు తమతమ ఆర్థిక, కార్పొరేట్, పొదుపు ఖాతా ప్రణాళికలో ’భద్రత మార్జిన్లను’ జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) జనవరిలో ఇచ్చిన అంచనాలు పాతవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన, గత వారంలో అమెరికాలో జరిగిన పరిణామాలు ఆర్థిక విశ్వాసం, బ్యాంకింగ్ రుణాల వృద్ధి, సంబంధిత సరఫరాల వ్యవస్థలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయం తాజాగా తేలాల్సి ఉందని అన్నారు. ప్రపంచ వృద్ధికి మరింత విఘాతంగా ఆయా పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు (సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్) మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితుల పై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన క్రిసిల్ ఇండియా అవుట్‌లుక్ సెమినార్‌ను ఉద్దేశించి అనంత నాగేశ్వరన్ ప్రసంగిస్తూ.. ప్రపంచ, భారత్ ఎకానమీ అంశాలను చర్చించారు. ఆయ న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అనిశ్చితి పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. గత వారంలో కొన్ని తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావారణం ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఆయా తీవ్ర పరిణామాలను దేశాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ► గత వారంలో జరిగిన పరిణామాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును ఆపాల్సిన పరిస్థితిని, అవసరాన్ని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో అమెరికాలో వడ్డీ రేట్ల పరిస్థితి ఏమిటి? డాలర్ల దారి ఎటు అన్న అంశంపై మీమాంస నెలకొంది. ► తాజా పరిణామాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఎలాంటి చిక్కులను కలిగిస్తాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి. ఒక కోణంలో ఆయా దేశాలకు సంబంధించి కరెన్సీలపై ఒత్తిడి తగ్గుతుందని, ఇది సానుకూల అంశమని నేను విశ్వసిస్తున్నాను. వడ్డీరేట్ల పెంపుకే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కట్టుబడితే, ప్రపంచంలోని పలు దేశాలకు ఇది ఒక సవాలునే సృష్టిస్తుంది. ► ఈ తరుణంలో భారతదేశం వంటి దేశాలపై ఈ పరిణామాల ప్రభావాన్ని లెక్కించడం ప్రస్తుతం కొంత క్లిష్టమైన అంశమే. ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులను భారత్ తట్టుకోగలదని విశ్వసిస్తున్నాను. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 7 శాతం స్థూల దేశీయోత్పత్తిని సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత పరిధులలో ఉష్ణోగ్రతలు భారత్‌లో కొనసాగితే, (ముందుగా విత్తడం వల్ల) గోధుమ పంటకు సంబంధించి మనం సానుకూల ఫలితాన్ని పొందుతాయి. ఈ అంశాలు చక్కటి పంట దిగుబడికి, ద్రవ్యోల్బణం కట్టడి కి, సరళతర ద్రవ్య పరపతి విధానాలకు తద్వా రా ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ఆయా అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ కనీసం 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. ► ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, భారత్‌లో దాదా పు అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థితి కి చేరుకున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో వినియోగం వాటా కూడా పెరుగుతోంది. ► ప్రస్తుత అనిశ్చితి వాతావరణంలో 8–9 శాతం జీడీపీ వృద్ధిరేటు గురించి ఎక్కువగా ఆశాజనకంగా ఉండకూడదు. వచ్చే 7–8 సంవత్సరాలలో 6.4 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి సాధించగలిగినా అది మనం మంచి ఫలితం సాధించినట్లే. 2023–24లో 6 శాతం వృద్ధి: క్రిసిల్ భారత్ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతం వృద్ధిని సాధించవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేసింది. ప్రైవేట్ రంగంలో పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పలు సంస్థల 6.5%–7% అంచనాలకన్నా క్రిసిల్ లెక్క మరింత తక్కువగా ఉండ డం గమనార్హం. కాగా, వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ ఎకానమీ సగటున 6.8% వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న అంచనాలను క్రిసిల్ తన వార్షిక నివేదిక వెలువరించింది. ఈ సందర్భంగా క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి మాట్లాడుతూ, 2022–23లో ఆర్బీఐ రెపో రేటుకు ప్రాతిపదిక అయి న రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా నమోదవుతుందని అన్నా రు. అయితే ప్రధానంగా బేస్ ఎఫెక్ట్‌తోపాటు క్రూడ్, కమోడిటీ ధరల తగ్గుదల కారణంగా 2023– 24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5%కి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మంచి రబీ దిగుబడి కూడా ద్రవ్యోల్బణం కట్టడికి దోహ దపడుతుందని అంచనావేశారు. 2023–24లో కార్పొరేట్ రంగం రెవెన్యూ వసూళ్లు రెండంకెల్లో ఉంటాయని కూడా జోషి అభిప్రాయపడ్డారు. మార్కెట్ల సంక్షోభాన్ని సులువుగా దాటేయగలం ► చౌక క్రూడాయిల్ దేశానికి సానుకూలం ► అంతర్జాతీయ అనిశ్చితిపై ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల సంక్షోభాన్ని భారత్ సులువుగా దాటేయగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. ముడి చమురు రేట్లు తగ్గడం, కరెంటు అకౌంటు లోటు తగ్గుతుండటం మొదలైనవి దేశానికి సానుకూలాంశాలని గురువారం ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభం కొనసాగుతోంది. అదే సమయంలో, భారత్‌కు సంబంధించి స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 2.5% లోపు ఉండవచ్చని అంచనాలు నెలకొన్నా యి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, మనం చెప్పేది చేసి, జాగ్రత్తగా వ్యవç ßæరిస్తే ఈ సంక్షోభం నుంచి సులువుగానే బైటపడవచ్చు‘ అని కొటక్ పేర్కొన్నారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటంతో మార్కె ట్లు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆయ న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఐఎంఎఫ్ అంచనాలకు మించి భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలు 6.8 శాతం మించి నమోదవుతుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు తమ విశ్వాసానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ వరుసగా రెండోసారి తగ్గించింది. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను ఈ నెల మొదట్లో మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఈ నేపథ్యం అనంత నాగేశ్వరన్ సోమవారం చేసిన ఒక ప్రకటనలో తన తాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► భారతదేశ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బహుశా ఒక కీలక మైలురాయిని దాటింది. ఇది పటిష్ట ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతోపాటు అధిక వృద్ధికి కూడా దోహదపడే అంశం. ► ఆర్థిక, ద్రవ్య విధానలు సాధారణంగా ఒకదానికి మరోటి అనుసంధానమై ఉంటాయి. ఒకదానికొకటి సమతుల్యత కలిగి ఉంటాయి. ► దేశీయ రుణం– జీడీపీ నిష్పత్తి విషయంలో ఆందోళన లేదు. అసెట్ మానిటైజేషన్ (నిరర్ధక ఆస్తుల నుంచి ఆర్థిక ప్రయోజనం) ఈ నిష్పత్తి మరింత తగ్గుతుంది. క్రెడిట్ రేటింగ్ పెరుగుదల విషయంలోనూ ఇది సానుకూల అంశం. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, తయారీ, నిర్మాణంసహా అన్ని కీలక రంగాలూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి. -
చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌కి ఏపీతోనూ అనుబంధం!
కేంద్ర బడ్జెట్ 2022 ముందు అనూహ్యంగా డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్‌ను చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (CEA)గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీకాలం గత డిసెంబర్లోనే ముగియగా.. ఇప్పుడు అనంత నాగేశ్వరన్‌ను ఆ స్థానంలో నియమించారు. ఈ నేపథ్యంలో ఈయన నేపథ్యంపై ఓ లుక్కేద్దాం. అనంత నాగేశ్వరన్ ఆర్థిక మేధావి మాత్రమే కాదు.. రచయిత, టీచర్, ఎకనమిక్ కన్సల్టెంట్ కూడా. ప్రధాని నేతృత్వంలోని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్లో 2019-2021 మధ్య పార్ట్‌టైం మెంబర్‌గా ఈయన ఉన్నారు. గతంలో క్రెడిట్ సుయిస్సె గ్రూప్ ఏజీ, జూలియస్ బాయిర్ గ్రూప్‌ల్లోనూ ఈయన ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. అంతకు ముందు బిజినెస్ స్కూల్స్, భారత్‌లోని కొన్ని మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్స్‌లో, సింగపూర్‌లో పని చేశారు. ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్తుత సీఈఏకు ఆంధ్రప్రదేశ్‌తోనూ అనుబంధం ఉంది. క్రి(క్రె)యా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గానూ కొంతకాలం ఈయన పని చేశారు. తమిళనాడు మధురైలో స్కూలింగ్, కాలేజీ చదువులు పూర్తి చేసుకున్న నాగేశ్వరన్.. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్నారు. 1994లో మస్సాషుసెట్స్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్‌లో(empirical behaviour of exchange rates మీద) డాక్టరేట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే ఎనకమిక్ సర్వే అనేది సాధారణంగా సీఈఏ ప్రిపేర్ చేస్తారు. కానీ, బడ్జెట్‌కు ముందు ఆ స్థానం ఖాళీగా ఉండడంతో ప్రిన్స్‌పల్ ఎకనమిక్ అడ్వైజర్, ఇతర అధికారులు సర్వే నివేదికను రూపొందించడం గమనార్హం. అంటే.. ఈ దఫా సర్వేలో సీఈఏ లేకుండానే రూపొందగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం దానిని ప్రవేశపెట్టారు. సంబంధిత వార్త: బడ్జెట్‌కు ముందే నాగేశ్వరన్ ఎంపిక.. ఎందుకు? -
బడ్జెట్‌కి ముందు కేంద్రం అనూహ్య నిర్ణయం.. తెరపైకి కొత్త ఆర్థిక సలహాదారు!
బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం అనూహ్యం నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా (సీఈఏ) ప్రముఖ కన్సల్టెంట్, రచయిత, అకాడమీషియన్ అనంత నాగేశ్వరన్‌ను నియమించింది. ఇప్పటి వరకు సీఈఏగా కొనసాగుతున్న కే సుబ్రమనియన్ స్థానంలో నాగేశ్వరన్‌ను నియామకం చేపట్టింది. బడ్జెట్ తయారీ పనుల్లో కేంద్రం నిమగ్నమైంది. గురువారమే బడ్జెట్ తయారీలో పాలు పంచుకునే ఆర్థికవేత్తలు, అధికారులు, సిబ్బందిని నార్త్ బ్లాక్‌లో లాక్‌ఇన్‌లోకి గురువారం పంపింది. లాక్ఇన్ మొదలైన తర్వాత 24 గంటల్లోపే ప్రస్తుతం ఉన్న ముఖ్య ఆర్థిక సలహాదారుని తప్పించి కొత్త వారిని నియమించడం ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాగేశ్వర్‌ను ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రకటన వెలువడింది. అయితే కొత్త సీఈవో పదవీ బాధ్యతలు వెంటనే తీసుకుని బడ్జెట్ తయారీలో చేయి వేస్తారా ? లేక తర్వాత రంగంలోకి దిగుతారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే సీఈఏగా నాగేశ్వర్ నియామకం పట్ల సోషల్ మీడియాలో సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. చదవండి: రహస్యంగా బడ్జెట్ తయారీ.. అజ్ఞాతంలోకి ‘బడ్జెట్’ ఉద్యోగులు -
చైనాను వెనక్కి నెట్టిన భారత్
ముంబై: ప్రజలందరికీ ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యం (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) విషయంలో చైనాను భారత్ అధిగమించిందని ఒక నివేదిక పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ ఈ మేరకు రాసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... - భారత్‌లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల సంఖ్య 2015లో వెయ్యి మందికి 183. 2020లో ఈ సంఖ్య 13,615కు చేరింది. ఇక బ్యాంక్ శాఖల సంఖ్య లక్ష మంది పెద్దలకు 13.6 ఉంటే, ఇది 2020 నాటికి 14.7కు ఎగసింది. ఈ గణాంకాలు జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికా కంటే ఎక్కువ. - ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం, బ్యాంకు ఖాతాల విషయంలో ముందున్న రాష్ట్రాల్లో మద్యం, పొగాకు వినియోగం గణనీయంగా తగ్గాయి. నేరాలూ తగ్గుముఖం పట్టాయి. ఆర్థికాభివృద్ధి విషయంలో ఆయా రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలకంటే ముందుండడం గమనార్హం. - జన్ ధన్ వంటి నో–ఫ్రిల్స్ (చార్జీలు లేని) ఖాతాల పథకం కింద, బ్యాంకుల వద్ద డిపాజిట్ ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తోటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే పరిస్థితి పూర్తి సానుకూలంగా ఉంది. ఆర్థిక అక్షరాస్యత గణనీయంగా మెరుగుపడుతోంది. -డిజిటల్ చెల్లింపుల వినియోగం పరంగా కూడా చెప్పుకోదగ్గ పురోగతి ఉంది. అందరికీ ఆర్థిక వ్యవస్థలో భాగంగా గత ఏడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే, 2021 అక్టోబర్ 20వ తేదీ నాటికి డిపాజిట్ల పరిమాణం రూ. 1.46 లక్షల కోట్లకు చేరగా, నో–ఫ్రిల్స్ బ్యాంక్ ఖాతాల సంఖ్య 43.7 కోట్లకు ఎగసింది. వీటిలో దాదాపు మూడింట రెండు వంతులు గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలు ఉండడం గమనార్హం. అలాగే ఖాతాల్లో 78 శాతానికి పైగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్నాయి. 18.2 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నాయి. కేవలం మూడు శాతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం కీలక భూమికను పోషిస్తోంది. - గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల సంఖ్య 2010 మార్చిలో 33,378. 2020 డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 55,073కి పెరిగింది. గ్రామీణ బ్యాంకింగ్ శాఖలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల (బీసీ) సంఖ్య 2010 మార్చిలో 34,174. 2020 డిసెంబర్ నాటికి 12.4 లక్షలకు పెరిగింది. - ఈ కాలంలో లక్ష మంది పెద్దలకు వాణిజ్య బ్యాంకు శాఖల సంఖ్య 13.5 నుండి 14.7కి పెరిగింది. వెయ్యి మంది పెద్దలకు బ్యాంకుల్లో డిపాజిట్ ఖాతాల సంఖ్య 1,536 నుంచి 2,031కి ఎగసింది. రుణ ఖాతాల సంఖ్య 154 నుంచి 267కి పెరిగాయి. మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల సంఖ్య 183 నుంచి 13,615కి పెరిగాయి. - మొత్తం 44 కోట్ల నో–ఫ్రిల్స్ ఖాతాలలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటా 34 కోట్లు. ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా కేవలం 1.3 కోట్లు. చదవండి: కదులుతున్న చైనా పునాదులు, రియాలిటీ రంగంలో మరో దెబ్బ -
ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష్యం దిశగా పెట్టుబడుల ఉపసంహరణ
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సోమవారం ఆన్లైన్ వేదికగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు బ్యాంకులు, ఒక బీమా కంపెనీతోసహా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా 2021–22లో రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ‘వరుసగా ఎనమిది నెలలుగా ప్రతి నెలా రూ.లక్ష కోట్లకుపైగా జీఎస్టీ వసూలవుతోంది. వినియోగం పెరుగుతోందనడానికి ఇదే ఉదాహరణ. వృద్ధికి ఇది సానుకూల సంకేతం. కోవిడ్–19 తొలి దశతో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉంది. ఈ సంవత్సరం లక్ష్యాలను సాధించడానికి చాలా ప్రాధాన్యత ఉంది. రూ.1.75 లక్షల కోట్లలో పెద్ద మొత్తం ఎల్ఐసీ ఐపీవోతోపాటు భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) ప్రైవేటీకరణ ద్వారా సమకూరనుంది. ప్రైవేటీకరణ కోసం 2021–22 గుర్తుండిపోయే సంవత్సరంగా భావిస్తున్నాను. మాకు ఇంకా తొమ్మిది నెలలు ఉన్నాయి. లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం ఉంది. ఉచితాల కోసం ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థకు కేవలం రూ.0.98 మాత్రమే సమకూరుస్తుంది.. అదే మూలధన వ్యయానికి ఉపయోగించినప్పుడు ఇది రూ.4.50లుగా ఉంది’ అని వివరించారు. చదవండి: బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఎస్బీఐ డిప్యూటీ ఎండీ -
భారత్‌కు ఇంకాస్త మంచి రేటింగ్ ఇవ్వొచ్చు
న్యూఢిల్లీ: భారత్‌కు మరింత మంచి రేటింగ్ ఇవ్వవచ్చని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్‌లోటు, రుణ భారం వంటి పలు భారత ఆర్థిక ప్రాథమిక అంశాలు రేటింగ్ పెంపునకు తగిన విధమైన పటిష్టతతో ఉన్నాయని గురువారం విలేకరులతో అన్నారు. జూన్ ప్రారంభంలోనే భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ (సావరిన్ రేటింగ్) రేటింగ్ ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’ కి మూడీస్ తగించడం, ఇక బుధవారం మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఎస్అండ్పీ భారత్ రేటింగ్‌ను ‘బీబీబీ–’గానే (రెండు సంస్థల రేటింగ్– ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి జంక్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ) కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం వంటి అంశాలు సీఈఏ ప్రకటన నేపథ్యం. రేటింగ్‌ల విషయంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నిర్ణయాల తర్వాత ఇందుకు సంబంధించి ప్రభుత్వంలో కీలక అధికార స్థాయి నుంచి వచ్చిన స్పందన ఇది. సుబ్రమణ్యన్ అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► రుణ పునః చెల్లింపులకు సంబంధించి భారత్ సామర్థ్యం ఎంతో పటిష్టంగా ఉంది. ► భారత్ ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలను అందిస్తాయని సూచిస్తాయని రేటింగ్ సంస్థలు, భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ అధిక వృద్ధి బాటకు మళ్లుతుందని అంచనాలు వేస్తున్న సంగతి గమనార్హం. ► భారత్ ‘ఠి’ (వీ షేప్డ్– వేగవంతమైన ఆర్థిక రికవరీకి సంకేతం) నమూనా రికవరీ సాధిస్తుందనడంలో సందేహం లేదు. స్పానిష్ ఫ్లూ తరువాత ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ► ఆర్థిక వ్యవస్థలో రికవరీపై ఈ ఏడాది వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది రెండవ భాగం నుంచైనా రికవరీ ఉంటుందా? లేదా వచ్చే ఏడాదే ఇక ఇది సాధ్యమవుతుందా? అన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. ► అయితే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తగిన అన్ని చర్యలూ తీసుకోవడంపై ఆర్థిక వ్యవస్థ కసరత్తు చేస్తోంది. అలాగే ద్రవ్యలోటు కట్టడికీ ప్రయత్నిస్తుంది. ► ప్రైవేటైజేషన్ విధానం విషయంలో బ్యాంకింగ్ వ్యూహాత్మక రంగంగా ఉంది. ► మొండిబకాయిల పరిష్కారానికి ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు అంతగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. -
కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారుతో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుబ్రహ్మణ్యన్‌తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. దేశ ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. పారిశ్రామిక రంగం పురోగతి, పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను కేటీఆర్ వివరించారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక విజయాలు నమోదు చేసిందన్నారు. కేంద్రం విధానపరంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ కోరారు. గతంలో హైదరాబాద్ ఐఎస్బీలో పనిచేస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యన్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం
ముంబై: దేశం అభివృద్ధి చెందాలంటే వ్యాపార విధానాలను మరింత సులభతరం చేయాలని ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ తెలిపారు. శనివారం ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ ఆశిస్తున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవ్వాలంటే సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రో క్రోనీ క్యాపిటలిజం ద్వారా కేవలం వ్యాపార వర్గాల వారికి, అధికారంలో ఉన్నవారికే లబ్ది చేకూరుతుందన్నారు. దేశంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రో బిజినెస్ పాలసీలు తోడ్పడుతాయని, అంతేకాకుండా వ్యాపార వర్గాల్లో పోటీ తత్వాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేవలం ప్రస్తుత ఆర్థిక నిపుణులపైనే ఆధారపడకుండా, బహుళ ప్రాచుర్యం పొందిన ప్రాచీన అర్థశాస్త్రం లాంటి గ్రంథాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. సంపద సృష్టించే మెళుకువలను ప్రాచీన కాలం నాటి అర్థశాస్త్రంలో చక్కగా వివరించారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్లో సూచించినట్టుగా దేశంలోనే ముడిసరుకుల ఉత్పత్తి వల్ల భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశం దూసుకెళ్లాలంటే ఎక్కువ స్థాయిలో ముడిసరుకులను ఎగుమతి చేయాలని తెలిపారు. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాయని పేర్కొన్నారు. దేశంలోకి ప్రో బిజినెస్ పాలసీలు అమలు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. చదవండి: అపుడు దోసానామిక్స్, ఇపుడు థాలినామిక్స్ -
అపుడు దోసానామిక్స్, ఇపుడు థాలినామిక్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఎకనామిక్ సర్వే 2019-20లో ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తన గురువు, ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ రాజన్ ఫాలో అయ్యారు. గతంలో రాఘురామ రాజన్ దోసానిమిక్స్ (2016 బడ్జెట్ , ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు)లో ద్రవ్యోల్బణం సైలెంట్ కిల్లర్ అని చెబితే.. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ కేవీ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ఆర్థిక సర్వేలో థాలినోమిక్స్ డిన్నర్ టేబుల్‌పై ఆహారం ఆర్థికశాస్త్రం ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచెప్పడానికి ప్రయత్నించింది. గత13 ఏళ్లలో వెజిటేరియన్-నాన్వెజిటేరియన్ కొనుగోలు శక్తి ఎంత పెరిగిందో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సర్వేలో వివరించారు 'థాలినామిక్స్: ది ఎకనమిక్స్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా' పేరుతో దీనిని ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా పేర్కొంది. దీని ఆధారంగా పై కొనుగోలు శక్తిని తెలిపింది. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 80 కేంద్రాల్లో వినియోగదారుల ధరల సూచిక నుండి వచ్చిన డేటాను ‘థాలి’ ఖర్చుతో ఏప్రిల్ 2006 నుంచి అక్టోబర్ 2019 మధ్య కొనుగోలు వివరాలను ఈ సర్వే విశ్లేషించింది. భారతదేశం అంతటా ఒక థాలి (ఒక భోజనం) కోసం ఒక సాధారణ వ్యక్తి చెల్లించే మొత్తాన్ని లెక్కించే ప్రయత్నమని ఎకనామిక్ సర్వే పేర్కొంది. థాలి రేట్ల ఆధారంగా ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిదుడుకులపై అంచనా వేస్తూ 2006-07 నుంచి 2019-20 మధ్య వెజిటేరియన్ థాలి రేటులో 29 శాతం పెరుగుదల, నాన్ వెజిటేరియన్ థాలిలో 18 శాతం పెరుగుదల నమోదయినట్లు ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం రోజుకు రెండుసార్లు వెజిటేరియన్ థాలీ తీసుకునే ఐదుగురు వ్యక్తులు కలిగిన ఓ కుటుంబం ఏడాదిలో సగటున రూ.10,887 సంపాదిస్తోందనీ, నాన్ వెజిటేరియన్ కుటుంబం రూ.11,787గా ఉందని పేర్కొంది. సగటున పారిశ్రామిక కార్మికుడి వార్షిక ఆదాయాన్ని బట్టి చూస్తే 2006-07 నుంచి 2019-20 మధ్య శాఖాహార థాలి కొనుగోలు శక్తి 29 శాతం, మాంసాహార థాలి శక్తి 18 శాతం మెరుగుపడింది. వెజిటేరియన్ థాలిలో తృణధాన్యాలు, సబ్జీ, పప్పు వడ్డిస్తారు. నాన్ వెజిటేరియన్ థాలీలో తృణధాన్యాలు, సబ్జీ, మాంసాహారం వడ్డిస్తారు. భారత్‌లోని నాలుగు ప్రాంతాలు... ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ప్రాంతాల్లో 2015-16 నుంచి వెజిటేరియన్ థాలీ ధరలు క్రమంగా తగ్గాయి. కానీ 2019లో మాత్రం పెరిగాయి. ఇటీవలికాలంలో భోజనం ధరను తెలుసుకోవడానికి సర్వే ప్రయత్నించడం ఇదే మొదటిసారి. #EcoSurvey2020 #WealthCreation: Despite the rise in prices this year, thalis have become more affordable in India compared to 2006-07. (3/3) #Thalinomics @FinMinIndia @PIB_India @nsitharamanoffc pic.twitter.com/eT3u4nPb7U — K V Subramanian (@SubramanianKri) January 31, 2020 -
హోటల్ కంటే.. తుపాకీ కొనడం సులువు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2020 ఆర్థిక వృద్ధిని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 6-6.5 శాతంగా అంచనా వేసింది.2020సంవత్సరానికి ఇది 5 శాతంగా ఉంది. లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాలకు అధ్యక్షుడు రామనాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తరువాత 2019-2020 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనతరం సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సభ ముందు ఉంచనున్నారు. మరోవైపు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి వి సుబ్రమణియన్ ఎకనామిక్ సర్వే వివరాలను మీడియాకు వివరించారు. రుపాయి నోటు భారత సంపదకు చిహ్నం. అందుకే, సర్వే కవర్ పేజీని వంద రూపాయల నోటు పాత, కొత్త రంగుల మేళవింపుతో వంకాయ రంగులో రూపొందించినట్టు చెప్పారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టికి మార్కెట్ అదృశ్య హస్తం, విశ్వాసం అనేవి రెండు స్తంభాలని సుబ్రమణియన్ అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన మార్కెట్ అదృశ్య హస్తం, నమ్మకంతో మద్దతు ఇవ్వడంపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. భారతదేశం చైనా మధ్య ఎగుమతి పనితీరులో వ్యత్యాసాన్ని స్పెషలైజేషన్ ద్వారా వివరించాలని సుబ్రమణియన్ చెప్పారు. చైనా శ్రమతో కూడిన కారకాలలో ప్రత్యేకత కలిగి ఉంది. భారతదేశం కూడా దీన్ని అనుసరించాల్సిన అవసరం వుంది. దేశంలో ఒక హోటల్‌ను ప్రారంభించడం కంటే, ఒక తుపాకీ లైసెన్సు సంపాదించడం చాలా సులువు అని సర్వే పేర్కొంది. ఒక పిస్తోల్ కలిగి వుండేందుకు కావల్సిన పత్రాల కంటే ఢిల్లీలో ఒక హోటెల్ తెరవాలంటే ఎక్కువ డాక్యుమెంట్లు కావాలని తెలిపింది. ఎకనామిక్ సర్వే 2020 అంచనాలు ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం ప్రభావం మనదేశంపై పడిందని, దానివల్లే పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల ఆర్థిక రంగంలో తిరోగమన సంకేతాలు కనిపించాయని, దశాబ్ద కాలం నాటి పరిస్థితులు ఆర్థిక రంగంలో చోటు చేసుకున్నాయని అంచనా వేసింది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ మందగించిందనే విషయాన్ని కేంద్రం అంగీకరించింది. ఆరేళ్ల తరువాత తొలిసారిగా 4.5 శాతానికి క్షీణించిందని పేర్కొంది. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి ఆర్థిక అంతర లక్ష్యాన్ని సడలించాల్సిన అవసరం ఉందని ఎకనామిక్ సర్వే 2020 తెలిపింది. ప్రస్తుత సంవత్సరానికి ఆర్థిక లోటు లక్ష్యాన్ని సడలించాల్సి ఉంటుందని తెలిపింది. సంపద సృష్టిని పెంచడానికి,మార్కెట్లకు మేలు చేసే ఆర్థిక సర్వేలో పది కొత్త ఆలోచనలను సూచించింది. వచ్చే ఏడాది వృద్ది పుంజుకోవాలంటే సంస్కరణల సరళిని బలంగా అనుసరించాలని సూచించింది. సంపద పంచాలంటే ముందు సంపద సృష్టి జరగాలని తెలిపింది. ఉల్లిపాయల్లాంటి కమోడిటీల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రయోజనం ఇవ్వలేదని తెలిపింది. వృద్ధికి ఊతమివ్వాలంటే ‘‘అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్’’ సూత్రాన్ని పాటించాలని, తద్వారా నూతన ఉద్యోగాలను సృష్టించాలని సూచించింది. పెట్టుబడుల కోసం విస్తృత అవకాశాలను కల్పిస్తామని తెలిపింది. మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలను కల్పించడం ద్వారా జీడీపీ రేటును పెంచాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ప్రధానంగా వ్యవసాయ, ఉత్పాదక, సేవ రంగాల పరిధిని విస్తృతం చేస్తామని, ఫలితంగా జీడీపీలో వాటి వాటాను పెంచడానికి అవసరమైన చర్యలను చేపట్టబోతున్నట్టు తెలిపింది. ఆటోమొబైల్ వంటి ఉత్పాదక రంగాల్లో నెలకొన్న మందగమనానికి చెక్ పెట్టడంతోపాటు, వాటి పునరుజ్జీవన దిశగా తమ చర్యలు ఉండబోతున్నాయని సర్వే పేర్కొంది. ఉత్పాదక, పారిశ్రామిక రంగాల్లో నెలకొన్న రెడ్ టేపిజాన్ని తొలగించడానికి పూర్తిస్థాయి చర్యలు చేపడతామని కేంద్రం వెల్లడించింది. పెట్టుబడులను ఆహ్వానించడానికి అవసరమైన అడ్డంకులను నివారిస్తామని, భారత్ పెట్టుబడులు పెట్టడాన్ని, భారత్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని తమ ఆర్థిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తామని, పబ్లిక్ రంగంలో కొనసాగుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. #EcoSurvey2020 #WealthCreation: Pro-business policies to strengthen the invisible hand: (iii) enable trade for job creation (iv) efficiently scale up the banking sector to be proportionate to the size of the Indian economy. (5/5) @FinMinIndia @PIB_India @nsitharamanoffc pic.twitter.com/LSIvbWGS3B — K V Subramanian (@SubramanianKri) January 31, 2020 -
ఆర్థిక సర్వే-2019 : చాలా ఉత్సాహంగా ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ (47) ట్వీట్ చేశారు. ఎన్డీఏ సర్కారు రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ మొట్టమొదటి ఆర్థిక సర్వే -2019ను ప్రవేశపెట్టనున్నామని మంగళవారం ట్వీట్ చేశారు కాగా కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌కు కూడా తొలి మహిళా ఆర్థికమంత్రిగా కేంద్ర ప్రభుత్వ మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూన్ 5వ శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయిదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ, 45 కనిష్టానికి పతనమైన నిరుద్యోగం లాంటి దేశీయ ఆర్థిక పరిస్థతులకు తోడు, అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితి, ముదురు తున్న ట్రేడ్ వార్ అందోళన నడుము సీతారామన్ బడ్జెట్ కీలకంగా మారనుంది. అరవింద్ సుబ్రమణియన్ పదవీకాలం ముగిసిన దాదాపు ఆరు నెలల తరువాత, కృష్ణమూర్తి సుబ్రమణియన్ గత ఏడాది డిసెంబరులో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. Looking forward with excitement to table my first - and the new Government's first - Economic Survey in Parliament on Thursday. #EcoSurvey2019 — K V Subramanian (@SubramanianKri) July 2, 2019 -
ఆర్థిక సలహాదారు రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కుటుంబంతో కలిసి ఉండేందుకు ఆయన తిరిగి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్ పోస్ట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో అరవింద్ సుబ్రమణియన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో దానికి ఆమోదం తెలపడం మినహా మరో మార్గం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. పలు కీలక ఆర్థిక నిర్ణయాల్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణియన్ చురుకైన పాత్ర పోషించారు. కాగా 2014 అక్టోబర్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణియన్ నియమితులయ్యారు. ఆర్థిక సలహాదారు పదవి కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం మాత్రమే కాదని కీలక నిర్ణయాల ప్రభావం, పర్యవసానాలనూ అంచనా వేయగలగాలని, ఇవన్నీ అరవింద్ సుబ్రమణియన్‌లో పుష్కలంగా ఉన్నాయని జైట్లీ ప్రశంసించారు. -
ఆర్థిక శాఖ సలహాదారుగా సంజీవ్ సన్యాల్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సంజీవ్ సన్యాల్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్(ఏసీసీ) ఆమోదించిందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయన వేతన స్కేలు రూ.67,000–79,000 అని పేర్కొన్నారు. సంజీవ్ సన్యాల్.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఆక్స్ఫర్డ్,సెయింట్ జాన్స్ కాలేజ్‌ల్లో విద్యనభ్యసించారు. గతంలో సంజీవ్ సన్యాల్ డాషే బ్యాంక్ ఎండీగా పనిచేశారు.పలు పుస్తకాలను ఆయన రచించారు. ల్యాండ్ ఆఫ్ ద సెవెన్ రివర్స్: ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ జియోగ్రఫీ, ద ఇండియన్ రినైసెన్స్: ఇండియాస్ రైజ్ ఆఫ్టర్ ఏ ధౌజండ్ ఇయర్స్ ఆఫ్ డిక్లైన్, ద ఇన్క్రెడిబుల్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ జియోగ్రఫీ తదితర పుస్తకాలను ఆయన రచించారు. రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ(లండన్) ఫెలోగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. పట్టణ అంశాలపై ఆయన చేసిన కృషికి గాను 2007లో ఐసెన్‌హోవర్ ఫెలోషిప్ లభించింది. 2014 వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో సింగపూర్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. -
తదుపరి టార్గెట్ ఎవరు?
రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌ను పంపేసిన తర్వాత.. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి తదుపరి టార్గెట్ ఎవరో తెలుసా..? ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం. ఆ పదవి నుంచి సుబ్రమణ్యంను తొలగించాలంటూ స్వామి సంచలన ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు. ‘‘అమెరికా ఫార్మా ప్రయోజనాలను కాపాడాలంటే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్‌కు 2013లో చెప్పింది ఎవరు.. అరవింద్ సుబ్రమణ్యం ఎంఓఎఫ్.. ఆయనను వెంటనే తొలగించండి’’ అని స్వామి తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్టీ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి చెప్పింది కూడా అరవింద్ సుబ్రమణ్యమేనని ఆయన అన్నారు. అరవింద్ సుబ్రమణ్యం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి రఘురామ్ రాజన్ తర్వాత అరవింద్ సుబ్రమణ్యమే రిజర్వు బ్యాంకు గవర్నర్ అవుతారన్న కథనాలు వినిపించాయి. కానీ, ఆయన కూడా కాంగ్రెస్ ఏజెంటుగానే వ్యవహరిస్తున్నారన్నది స్వామి వాదన. అందుకే ఆయనను టార్గెట్ చేసి, ముందు ఆర్థిక సలహాదారు పదవి నుంచే పంపేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. Who said to US Cong on 13/3/13 the US should act against India to defend US Pharmaceuticals interests? Arvind Subramanian MoF !! Sack him!!! — Subramanian Swamy (@Swamy39) 22 June 2016 Guess who encouraged Congi to become rigid on GST clauses ? Jaitely's economic adviser Arvind Subramanian of Washington DC — Subramanian Swamy (@Swamy39) 22 June 2016 -
రాజన్ చేతికి ఆర్బీఐ పగ్గాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి అత్యున్నత నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో కొత్త సారథి కొలువుదీరనున్నారు. ప్రపంచ విఖ్యాత ఆర్థిక రంగ నిపుణుడు రఘురామ్ గోవింద్ రాజన్.. ఆర్బీఐ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టనున్నారు. వచ్చే నెల 4న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత గవర్నర్ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రాజన్ నియామకానికి పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం 2008లో ప్రపంచదేశాలను అల్లాడించిన ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన రాజన్... ఎంతోమంది నిపుణులు, విశ్లేషకులను నివ్వెరపరిచారు. ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన ఎలాంటి విధానాలను అమలుచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రూపాయి కనీవినీఎరుగని రీతిలో పాతాళానికి పడిపోవడం, విలవిల్లాడుతున్న స్టాక్ మార్కెట్లు... ఆర్థిక మందగమనం వంటివి దేశాన్ని కుదిపేస్తున్నాయి. దీనికితోడు అధిక వడ్డీరేట్లు, ధరల మంటల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలిగిస్తారో వేచిచూడాల్సిందే. న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురామ్ జి. రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. 50 సంవత్సరాల రాజన్, మూడేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4వ తేదీన పదవీ విరమణ చేయనున్న దువ్వూరి సుబ్బారావు స్థానంలో రాజన్ బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రేట్ల వైఖరిపై సర్వత్రా ఆసక్తి! ద్రవ్యోల్బణంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధి రేటుకూ సైతం ఆర్బీఐ ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకు అనుగుణంగా పాలసీరేట్లను సైతం తగ్గించాలని కేంద్రం చేస్తున్న సూచనలకు ఇప్పటివరకూ రాజన్ సానుకూల రీతిలో స్పందిస్తూ వచ్చారు. డాలర్ మారకంలో రూపాయి విలువ కిందకు జారిపోవడాన్ని నిలువరించడానికి, ఒడిదుడుకులను నివారించడానికి ఆర్బీఐ ఇటీవల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరమైన కఠిన విధానాన్ని సమర్థిస్తూనే... ఆర్బీఐ రూపాయితోపాటు ఆర్థికాభివృద్ధి రేటుపైనా దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక మందగమనం, తీవ్ర ఆహార ఉత్పత్తుల ధరలు, రూపాయి క్షీణత, తీవ్ర కరెంట్ అకౌంట్ లోటు వంటి సవాళ్లతో కూడిన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో- ద్రవ్యోల్బణం నియంత్రణే ప్రధాన ధ్యేయంగా దువ్వూరి సుబ్బారావు ఇప్పటివరకూ అనుసరిస్తూ వచ్చిన కఠిన విధానాన్ని రాజన్ కూడా కొనసాగిస్తారా...? లేక తనదైన శైలిలో ముందుకు వెళతారా అన్నది ప్రస్తుతం విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చ. మంత్రదండం లేదు... ఆర్బీఐ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే రాజన్ స్పందిస్తూ... ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇబ్బందులను మాయం చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏదీ లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే సవాళ్లను ఎదుర్కొనగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. సర్వోన్నత సమగ్రత, స్వతంత్రత, వృత్తి నిపుణత కలిగిన సంస్థగా ఆర్బీఐని ఆయన అభివర్ణించారు. పాలక, పారిశ్రామిక వర్గాల హర్షం రాజన్ నియామకం పట్ల పాలక, పారిశ్రామిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమయ్యింది. రాజన్ చక్కటి నిర్ణయాలు తీసుకుని బాగా పనిచేయగలరన్న అభిప్రాయాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సి.రంగరాజన్ వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంలో అత్యంత ప్రతిభావంతుడైన రాజన్ నుంచి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధికి తగిన సంకేతాలు, మార్గదర్శకాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా వ్యక్తం చేశారు. గవర్నర్‌గా మంచి నిర్ణయాలు తీసుకోడానికి ఆర్థిక రంగంలో ఆయన అపార అనుభవం దోహదపడుతుందని సీఐఐ మాజీ ప్రెసిడెంట్ ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. రాజన్ లాంటి ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం మనకు అదృష్టమని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ అన్నారు. రాజన్ ఎంపిక ‘చాలా చక్కనిది’ అని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడిలో, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనడంలో ఆయన విజయం సాధించగలరని అసోచామ్ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. చిన్న వయసులోనే.. ఆర్బీఐ గవర్నర్‌గా అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తుల్లో రాజన్ ఒకరు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 5న బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 50 సంవత్సరాల 6 నెలలుగా ఉంటుంది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ 1982లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన తన 50వ పుట్టిన రోజుకు 10 రోజుల దూరంలో ఉన్నారు. 1932 సెప్టెంబర్ 26న జన్మించిన మన్మోహన్, 1982 సెప్టెంబర్ 16న ఆర్బీఐ పగ్గాలు చేపట్టారు. ఆర్బీఐకి అతి చిన్న వయసులో గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రికార్డు ఇప్పటికీ సర్ సీడీ దేశ్‌ముఖ్‌కే దక్కుతుంది. 1943లో కేవలం 47 ఏళ్ల వయస్సులోనే ఆయన ఈ బాధ్యతల్లో నియమితులయ్యారు. 1947లో భారత్ స్వాతంత్య్రం పొందే వరకూ ఆయన కొనసాగారు. ఈ పదవిలో నియమితుడైన మొట్టమొదటి భారతీయుడు కూడా ఆయనే. గత పదేళ్ల కాలంలో నాన్-సివిల్ సర్వెంట్‌గా ఆర్బీఐ గవర్నర్ కుర్చీలోకి రాబోతున్న వ్యక్తి రాజన్. ఇంతక్రితం బిమల్ జలాన్ నాన్-ఐఏఎస్‌గా ఈ బాధ్యతలను నిర్వహించి 2003లో పదవీ విరమణ చేశారు. రచనలు... సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ది క్యాపిటలిస్ట్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ ముప్పుగా పొంచి ఉన్న పెను సవాళ్ల గురించి ఆయన రచించిన ‘ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకం అత్యధిక ప్రాచుర్యం పొందింది. భారత్‌లో ప్రణాళికా సంఘానికి సంబంధించి ఆర్థిక రంగ సంస్కరణలపై నివేదికను రూపొందించడంలో కూడా ఆయన కీలక బాధ్యతలు పోషించారు. అత్యున్నతస్థాయి బాధ్యతలు... గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ ఎకనమి స్ట్‌గా పనిచేసిన రాజన్, గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ)గా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేస్తున్న కౌశిక్ బసు స్థానంలో ఆయన ఆగస్టులో ఈ బాధ్యతలు చేపట్టారు. సీఈఏగా బాధ్యతలను చేపట్టే నాటికి ఆయన షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ప్రధాన మంత్రికి గౌరవ ఆర్థిక సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు. ముందుచూపు... ఆర్థిక అంశాల విశ్లేషణలో తనకంటూ ఒక ప్రత్యేకత. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన అతి కొద్ది మంది ఆర్థికవేత్తల్లో ఒకరిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.