సీఈఏ వి. అనంత నాగేశ్వరన్ సూచన
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వృద్ధి విషయంలో రాజీపడకుండా దీన్ని సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘ఇంధన పరివర్తన, వాతావరణ పరిరక్షణ లక్ష్యాల సాధన పేరుతో వృద్ధిని పక్కన పడేయకూడదు. వృద్ధి అనేదే లేకపోతే, పర్యావరణ మార్పులను నియంత్రించడం కోసం పెట్టుబడులు పెట్టేందుకు వనరులు కూడా ఉండవు‘ అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ విషయాలు వివరించారు.
పారిశ్రామిక విద్యుత్ ధరలు ఒక్కసారిగా ఎగిసి యూరప్ ఆర్థికంగా సంకట స్థితిలో పడటానికి .. పునరుత్పాదక విద్యుత్, ఇంధన పరివర్తనపైనే పూర్తిగా దృష్టి పెట్టడం కూడా పాక్షికంగా కారణమన్నారు. ఈ అంశం కేవలం రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా పెద్ద సవాలని, భారత్‌తో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధికి నోచుకోని దేశాలపైనా ప్రభావం చూపుతోందని నాగేశ్వరన్ చెప్పారు. దేశీయంగా మందగమనం గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5–7 శాతం వృద్ధిని సాధించే దిశగా పురోగమిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment