హోటల్‌ కంటే.. తుపాకీ కొనడం సులువు | Economic Survey 2020 in India, buying a pistol is much easier than opening an eatery | Sakshi
Sakshi News home page

హోటల్‌ కంటే.. తుపాకీ కొనడం సులువు

Published Fri, Jan 31 2020 3:49 PM | Last Updated on Fri, Jan 31 2020 5:20 PM

 Economic Survey 2020 in India, buying a pistol is much easier than opening an eatery - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2020 ఆర్థిక వృద్ధిని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 6-6.5 శాతంగా అంచనా వేసింది.2020సంవత్సరానికి  ఇది 5 శాతంగా ఉంది. లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాలకు అధ్యక్షుడు రామనాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తరువాత 2019-2020 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనతరం సభ రేపటికి వాయిదా పడింది.  రేపు  ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సభ ముందు ఉంచనున్నారు.

మరోవైపు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి వి సుబ్రమణియన్‌ ఎకనామిక్ సర్వే వివరాలను మీడియాకు వివరించారు. రుపాయి నోటు భారత సంపదకు చిహ్నం. అందుకే, సర్వే కవర్‌ పేజీని వంద రూపాయల నోటు పాత, కొత్త  రంగుల మేళవింపుతో వంకాయ రంగులో రూపొందించినట్టు చెప్పారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టికి మార్కెట్ అదృశ్య హస్తం, విశ్వాసం అనేవి రెండు స్తంభాలని సుబ్రమణియన్ అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన మార్కెట్ అదృశ్య హస్తం, నమ్మకంతో మద్దతు ఇవ్వడంపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. భారతదేశం  చైనా మధ్య ఎగుమతి పనితీరులో వ్యత్యాసాన్ని స్పెషలైజేషన్ ద్వారా వివరించాలని సుబ్రమణియన్ చెప్పారు. చైనా శ్రమతో కూడిన కారకాలలో ప్రత్యేకత కలిగి ఉంది. భారతదేశం కూడా దీన్ని అనుసరించాల్సిన అవసరం వుంది. దేశంలో ఒక హోటల్‌ను  ప్రారంభించడం కంటే, ఒక తుపాకీ లైసెన్సు సంపాదించడం చాలా సులువు అని సర్వే పేర్కొంది. ఒక పిస్తోల్‌ కలిగి వుండేందుకు కావల్సిన పత్రాల కంటే ఢిల్లీలో ఒక హోటెల్‌ తెరవాలంటే ఎక్కువ  డాక్యుమెంట్లు కావాలని తెలిపింది.

ఎకనామిక్ సర్వే 2020  అంచనాలు
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం ప్రభావం మనదేశంపై పడిందని, దానివల్లే పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల ఆర్థిక రంగంలో తిరోగమన సంకేతాలు కనిపించాయని, దశాబ్ద కాలం నాటి పరిస్థితులు ఆర్థిక రంగంలో చోటు చేసుకున్నాయని అంచనా వేసింది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ మందగించిందనే విషయాన్ని కేంద్రం అంగీకరించింది. ఆరేళ్ల తరువాత తొలిసారిగా 4.5 శాతానికి క్షీణించిందని పేర్కొంది. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి ఆర్థిక అంతర లక్ష్యాన్ని సడలించాల్సిన అవసరం ఉందని ఎకనామిక్ సర్వే 2020 తెలిపింది.  ప్రస్తుత సంవత్సరానికి ఆర్థిక లోటు లక్ష్యాన్ని సడలించాల్సి ఉంటుందని తెలిపింది.

సంపద సృష్టిని పెంచడానికి,మార్కెట్లకు మేలు చేసే ఆర్థిక సర్వేలో పది కొత్త ఆలోచనలను సూచించింది. వచ్చే ఏడాది వృద్ది పుంజుకోవాలంటే సంస్కరణల సరళిని బలంగా అనుసరించాలని సూచించింది. సంపద పంచాలంటే ముందు సంపద సృష్టి జరగాలని తెలిపింది. ఉల్లిపాయల్లాంటి కమోడిటీల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రయోజనం ఇవ్వలేదని తెలిపింది. వృద్ధికి ఊతమివ్వాలంటే ‘‘అసెంబుల్‌ ఇన్‌ ఇండియా ఫర్‌ ద వరల్డ్‌’’ సూత్రాన్ని పాటించాలని, తద్వారా నూతన ఉద్యోగాలను సృష్టించాలని సూచించింది. 

పెట్టుబడుల కోసం విస్తృత అవకాశాలను కల్పిస్తామని తెలిపింది. మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలను కల్పించడం ద్వారా  జీడీపీ రేటును పెంచాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది.  ప్రధానంగా వ్యవసాయ, ఉత్పాదక, సేవ రంగాల పరిధిని విస్తృతం చేస్తామని, ఫలితంగా జీడీపీలో వాటి వాటాను పెంచడానికి అవసరమైన చర్యలను చేపట్టబోతున్నట్టు తెలిపింది. ఆటోమొబైల్ వంటి ఉత్పాదక రంగాల్లో నెలకొన్న మందగమనానికి చెక్‌ పెట్టడంతోపాటు, వాటి పునరుజ్జీవన దిశగా తమ చర్యలు ఉండబోతున్నాయని సర్వే పేర్కొంది. ఉత్పాదక, పారిశ్రామిక రంగాల్లో నెలకొన్న రెడ్ టేపిజాన్ని తొలగించడానికి పూర్తిస్థాయి చర్యలు చేపడతామని కేంద్రం వెల్లడించింది. పెట్టుబడులను ఆహ్వానించడానికి అవసరమైన అడ్డంకులను నివారిస్తామని, భారత్‌ పెట్టుబడులు పెట్టడాన్ని, భారత్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని తమ ఆర్థిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తామని, పబ్లిక్ రంగంలో కొనసాగుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని  ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement