పాసింజర్ వాహన అమ్మకాల్లో స్వల్ప వృద్ధే
ముంబై: దేశీయంగా ప్రయాణికుల వాహనాల అమ్మకాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగానే పెరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. చిన్న కార్లు, యుటిలిటీ వాహనాల సెగ్మెంట్లో డిమాండ్ బలహీనంగా ఉంటుందని పేర్కొంది. ఫలితంగా దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 2-3 శాతం వృద్ధినే సాధిస్తాయని వివరించింది.
ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలు 6-7 శాతం వరకూ క్షీణించవచ్చని అంచనాలున్నాయి.
మొత్తం వాహన అమ్మకాల్లో చిన్న కార్ల అమ్మకాల వాటా 55-60 శాతం వరకూ ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 23 లక్షల ప్రయాణికుల వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలం అమ్మకాలతో పోల్చితే 6 శాతం క్షీణత నమోదైంది. అయితే ఈ కేటగిరీ వాహన అమ్మకాలు 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం, 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం చొప్పున వృద్ధి సాధించాయి.
అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు అధిక స్థాయిల్లో ఉండడం, ఇంధనం ధరలు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల గత మూడేళ్లలో ప్రయాణికుల వాహనాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది.
వాహనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా రానున్న నెలల్లో డిమాండ్ స్వల్పంగా పుంజుకోవచ్చు. సుంకం తగ్గింపు జూన్ 30 వరకూ అమల్లో ఉంటుంది. కాబట్టి అమ్మకాలు కొంచెం పుంజుకోవచ్చు.