శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో చంద్రలోకానికి చేరినా.. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. బానిస బతుకుల్లో మాత్రం వెలుగులు కనిపించడం లేదు. ఎన్ని ప్రతిపాదనలు చేసినా, ప్రత్యేక చట్టాలు తెచ్చినా కార్మికుల శ్రమ దోపిడీ ఆగడం లేదు. నేటికీ కడుపు కాలే కష్టజీవులు బానిసత్వం మాటున దుర్భర జీవితాలను గడుపుతున్నారనడానికి తాజా సర్వేలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తక్కువ వేతనానికి కార్మికులను నియమించుకొని, వారి శ్రమను దోపిడీ చేయడంతోపాటు, బానిసలుగా చూడటంలో ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో ఉంది. థర్డ్ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ పేరిట నిర్వహించిన తాజా సర్వే ఈ నిజాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.6 కోట్లమంది ప్రజలు ఇంకా బానిస జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు సర్వే తేల్చి చెప్పింది. కేవలం భారత దేశంలోనే 1,83,54,700 మంది ఇంకా బానిసలుగా ఉండటమే కాక, వారి పిల్లలను సైతం సెక్స్ వర్కర్లుగా మార్చి వారికి దుర్భర జీవితాన్ని అంటగట్టడమో, లేదంటే కూలీలుగా ఉపయోగించుకోవడమో చేస్తున్నారని సర్వే వెల్లడించింది.
హ్యూమన్ రైట్స్ గ్రూప్ వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో 2016 గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ప్రకారం బానిసత్వాన్ని అమలు చేయడంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. 2014 లో ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్లకు పైగా ఉన్న సంఖ్య... రెండేళ్ళలో 2016 నాటికి నాలుగు కోట్లకు పైగా చేరి సుమారు 30 శాతం బానిసత్వం పెరిగిందని తెలిపింది. భారత్ తో పాటు, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో కూడ శ్రమ దోపిడీ భారీగానే జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 167 దేశాల్లో చేపట్టిన సర్వేలో భారత్ లోనే అత్యధికంగా బానిస బతుకులు గడుపుతున్నవారు ఉన్నట్లుగా తేటతెల్లం చేసింది.
ఆధునిక కాలంలో బానిసత్వ విధానమే మారిపోయిందని, అక్రమ పరిశ్రమల్లో అత్యధికంగా బానిసత్వం కనిపిస్తోందని, అత్యంత లాభదాయక నేర పరిశ్రమల్లో మూడో స్థానంలో యునైటెడ్ నేషన్స్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఆయుధ, ఔషధ పరిశ్రమలు నిలుస్తున్నట్లు తాజా సర్వేలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ ఓ) 21 మిలియన్లమంది ప్రజలు నిర్బంధిత కార్మికులుగా, ఇతర ఆధునిక బానిసత్వ చట్రంలోనూ చిక్కుకున్నారని అంచనా వేస్తోంది.
బానిసత్వంలో భారత్ ది నాలుగో స్థానం!
Published Sat, Jun 4 2016 2:21 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
Advertisement
Advertisement