సోమాలియా రాజధాని మొగదిషులో గత ఏడాది(2022) ఆగస్టులో జరిగిన ఉగ్రదాడి భారత్‌లో జరిగిన 26/11 ముంబై దాడిని పోలివుందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. సోమాలియాలోని హయత్ హోటల్‌పై ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్‌కు చెందిన ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో 15 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రపంచ ప్రజలను కంటతడి పెట్టించిన 8 భారీ ఉగ్రదాడులను ఒకసారి గుర్తుచేసుకుందాం.
9/11 ఉగ్రదాడి (అమెరికా)
2001, సెప్టెంబర్ 11న అమెరికాపై అల్ ఖైదా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో సుమారు మూడువేల మంది మరణించారు. 8,900 మంది గాయపడ్డారు. దీనిని ప్రపంచ చరిత్రలో అతిపెద్ద, అత్యంత పాశవికమైన ఉగ్రదాడిగా పరిగణిస్తారు.
26/11 ముంబై దాడి
26/11 ముంబై దాడి భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా గుర్తుండిపోతుంది. ఆ రోజున 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు అరేబియా సముద్రం గుండా ముంబైలోకి ప్రవేశించి, ఏకకాలంలో 10 వేర్వేరు ప్రదేశాలలో దాడులకు తెగబడ్డారు. ‘తాజ్ హోటల్’పైన కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 200 మంది మరణించగా, 600 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.
ఇరాక్: యాజిదీ కమ్యూనిటీపై దాడి
2007, ఆగస్టు 14న ఇరాక్‌లో భారీ తీవ్రవాద దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో ఉగ్రవాదులు కారును ఉపయోగించారు. ఈ దాడిలో 756 మంది మరణించగా, 1,500 మందికి పైగా జనం గాయపడ్డారు. యాజిదీ కమ్యూనిటీ ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగింది.
పెషావర్: పాఠశాలపై దాడి
పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలోని సైనిక పాఠశాలపై తాలిబన్లు జరిపిన దాడిలో 132 మంది చిన్నారులతో సహా 140 మంది మరణించారు. తాలిబానీ ఉగ్రవాదులు.. పాఠశాల సరిహద్దు గోడ లోపలికి ప్రవేశించి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
రష్యా: బెస్లాన్ స్కూల్ ఊచకోత
2004 సెప్టెంబరులో రష్యాలోని బెస్లాన్ పాఠశాలలోకి చొరబడిన ఉగ్రవాదులు 1000 మందిని బందించారు. ఈ దాడిలో 330 మంది మృతిచెందారు. వీరిలో గరిష్ట సంఖ్యలో పిల్లలు ఉన్నారు. ఈ ఘాతుకానికి చెచెన్ ఉగ్రవాదులు పాల్పడ్డారు.
ముంబై లోకల్ రైళ్లలో బాంబు పేలుళ్లు
2006, జూలై 11న ముంబైలోని మంతూగా రోడ్, మహిమ్, బాంద్రా, ఖోర్ రోడ్, జోగేశ్వరి, బోరివలితో సహా పలు ప్రాంతాల్లోకి చొరబడిన ఉగ్రవాదులు ముంబై లోకల్ రైళ్లల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. బాంబులను ప్రెషర్ కుక్కర్లలో ఉంచి పేల్చారు. ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించగా, 700 మంది గాయపడ్డారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్-182
1985, జూన్ 23న ఎయిరిండియా విమానం కనిష్క-182 టొరంటో నుండి బయలుదేరి లండన్ మీదుగా న్యూఢిల్లీ చేరుకోనుండగా ఉగ్రదాడికి గురయ్యింది. ఈ విమానం యూరప్ సరిహద్దులోకి ప్రవేశించి, 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 329 మంది మృత్యువాత పడ్డారు.
ఫ్రాన్స్: కాన్సర్ట్ హాలులో కాల్పులు
నవంబర్ 14, 2015న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని నేషనల్ స్టేడియం వెలుపల రెస్టారెంట్, కాన్సర్ట్ హాల్‌లో కాల్పులు, పేలుళ్లలో 120 మందికి పైగా జనం మరణించారు. సాయుధ ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. ఈ దాడికి ఐఎస్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది.
ఇది కూడా చదవండి: సంతోషంగా పార్టీ.. అందరూ చూస్తుండగా కళ్ల ముందే ఘోర ప్రమాదం!
Comments
Please login to add a commentAdd a comment