ఎస్టేట్ వద్ద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడాలోని మార్–ఎ–లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. ట్రంప్ హయాంలో మాయమైన కీలకమైన, రహస్య పత్రాల కోసం గాలింపు చేపట్టినట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది. సోదాల సమయంలో ట్రంప్ న్యూయార్క్‌లో ఉన్నారు. దీనిని విచారణార్హమైన దుశ్చర్యగా ట్రంప్ సోమవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరో దఫా పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఎఫ్‌బీఐని ఆయుధంగా వాడుకుంటున్నారంటూ బైడెన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ఎస్టేట్‌ను ఎఫ్‌బీఐ ఏజెంట్లు ముట్టడించారు. నా లాకర్‌ను పగులగొట్టారు.
సమాచారం ఇవ్వకుండా అనవసరంగా దాడులు జరపడం సరైన చర్య కాదు. అమెరికా అధ్యక్షులెవరికీ గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. ఇలాంటివి అస్థిర ప్రభుత్వాలుండే మూడో ప్రపంచ దేశాల్లోనే జరుగుతాయి’అని తీవ్ర ఆరోపణలు చేశారు. సోదాలపై వ్యాఖ్యానించేందుకు దేశ న్యాయశాఖ, ఎఫ్‌బీఐ నిరాకరించాయి. 2020లో అధ్యక్షభవనం వీడే సమయంలో రహస్య పత్రాలను ట్రంప్ తన ఫ్లోరిడా నివాసానికి తరలించి ఉంటారనే విషయమై న్యాయశాఖ దర్యాప్తు జరుపుతోంది.
ట్రంప్ హయాంలో వైట్‌హౌస్‌లో రికార్డుల నిర్వహణపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా నేషనల్ ఆర్కైవ్స్ విభాగం ఫిబ్రవరిలో న్యాయశాఖను కోరింది. మార్–ఎ–లాగో ఎస్టేట్ నుంచి గతంలో కొన్ని రహస్య పత్రాలు సహా వైట్‌హౌస్ రికార్డులున్న 15 బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ ఆర్కైవ్స్ విభాగం తెలిపింది. కొందరు దర్యాప్తు అధికారులు జూన్‌లోనూ మార్–ఎ–లాగోకు వెళ్లి రహస్య పత్రాల గురించి వాకబు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment