ట్రంప్‌ కోర్టు పోలింగ్‌ బూతేనా? | Sakshi Guest Column On USA Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కోర్టు పోలింగ్‌ బూతేనా?

Published Sat, Jun 8 2024 12:06 AM | Last Updated on Sat, Jun 8 2024 12:06 AM

Sakshi Guest Column On USA Donald Trump

విశ్లేషణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చిన తర్వాత ఆ దేశ రాజకీయాలు మరింత విభజనకు గురయ్యాయి. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్‌ బలహీనతను, అస్థిర ప్రవర్తనను నొక్కిచెప్పింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ జరిగితే అది ఆయన విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్‌ అమెరికా. విషయాలు అక్కడ భిన్నంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే తన దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ట్రంప్‌తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ, గత మూడేళ్లలో జరుగుతున్నట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి మాత్రం ఆయన హయాంలో జరగలేదు.

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ను తప్పుడు వ్యాపార రికార్డులపై 34 అంశాల్లో న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన తర్వాత అమెరికా మరింతగా విభజనకు గురయింది. స్వభావ రీత్యా, ఈ కేసు చిన్నదే. కానీ న్యాయప్రక్రియను అపహాస్యం చేయడం ద్వారా, ప్రాసిక్యూటర్‌లపై, న్యాయమూర్తిపై కూడా ఎదురుదాడికి దిగుతూ కేసును ఎదుర్కొనాలని ట్రంప్‌ బృందం తీసుకున్న నిర్ణయం ఈ కేసును విషపూరితం చేసింది. 

ట్రంప్‌ ఇప్పుడు దీనిపై అప్పీల్‌ చేయనున్నారు. అయితే దీనిపై విచారణ జరగడానికి సంవత్సరాలు కాకపోయినా, నెలల సమయం పడుతుంది. ఒకవేళ తాను ఓడిపోయి, ఆ తర్వాత కేసు తారుమారైతే, అది అమెరికా న్యాయ వ్యవస్థ విచ్ఛిన్నమైనదనే ట్రంప్‌ మద్దతుదారుల అభిప్రాయాలను ధ్రువీకరిస్తుంది. మరోవైపు, ఇవన్నీ ఉన్నప్పటికీ ట్రంప్‌ గెలిచినట్లయితే, ఆ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అది వెల్లడిస్తుంది. 

ట్రంప్‌ న్యాయ ప్రక్రియను కొట్టిపడేస్తూ, ‘మనం ఫాసిస్ట్‌ రాజ్యంలో జీవిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ తనను తాను అభివర్ణించుకున్నట్లుగా ‘ఎంతో అమాయకపు వ్యక్తి’పై జరుగుతున్న ఈ విచారణ ఒక బూటకమని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఆయన తనను ’రాజకీయ ఖైదీ’గా చెప్పుకొంటున్నారు. పైగా అవకాశం వచ్చినప్పుడు తన ప్రత్యర్థులందరూ కూడా నేరారోపణలను ఎదుర్కొనే దశలోకి అమెరికా ప్రవేశిస్తోందని ట్రంప్‌ పార్టీ(రిపబ్లికన్‌) హెచ్చరించింది.

ప్రత్యేకించి ఓటర్లలో ఆదరణ లేని ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య జరుగుతున్న విచిత్రమైన రేసులో ఈ తీర్పు ఒక అస్థిరమైన, నాటకీయమైన అంశాన్ని ప్రవేశపెట్టింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ అతని లేదా ఆమె అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్‌ అమెరికా. ఇక్కడ విషయాలు భిన్నంగా జరుగుతున్నాయి. ఈ తీర్పు నిజానికి ఆయనకు రిపబ్లికన్‌ పార్టీ మద్దతును మరింతగా బలపరిచింది. తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్‌ ప్రచారానికి వచ్చిన 52.8 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల రూపంలో ఇది వ్యక్తమయింది.

మరోవైపు డెమోక్రాట్లు తమ ప్రత్యర్థిని, ప్రస్తుతం అగ్రగామిగా ఉన్న వ్యక్తిని న్యాయస్థ్ధానం దోషిగా నిర్ధారించినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ అంశంపై వ్యాఖ్యానించడంలో జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఆయన న్యాయవ్యవస్థను సమర్థించారు. పైగా, తీర్పు తమకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఎవరైనా ప్రశ్నించడం అనేది ‘నిర్లక్ష్యపూరితమైనది, ప్రమాదకరమైనది, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నది’ అని అన్నారు.

ఈ కేసుకి సంబంధించిన అంశాలు చిన్నవిగానే ఉన్నప్పటికీ, ఇది బూటకపు విచారణ కాదు. సమర్పించిన సాక్ష్యాలు చేసిన నేరాలను నిర్ధారిస్తాయి. అవి ట్రంప్‌ జీవించే నీచమైన ప్రపంచానికి చెందిన సంగ్రహావలోకనాన్ని కూడా అందించాయి. ఆయన మద్దతుదారులు ఏం చెప్పినా సరే... జ్యూరీ ఆయన్ని ఏకగ్రీవంగానూ చాలా త్వరితంగానూ మొత్తం 34 అంశాల్లో దోషిగా నిర్ధారించింది. పైగా ఇది ట్రంప్‌ ఎదుర్కొనే ఆరోపణలలో ఒకటి మాత్రమే; మరో మూడు తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ రిపబ్లికన్ల మనస్సులో, ఈ కేసులు ‘న్యాయ వ్యవస్థ ఆయుధీకరణ’ ఫలితం మాత్రమే.

వీటిలో రెండు కేసులు 2020 ఎన్నికల ప్రక్రియకు నష్టం గావించడంలో ట్రంప్‌ పాత్రకు సంబంధించినవి. ఇక మూడవ కేసు, వైట్‌ హౌస్‌ నుండి నిష్క్రమించిన తర్వాత ఉద్దేశపూర్వకంగా రహస్య పత్రాలను ట్రంప్‌ తన వద్ద ఉంచుకున్నట్లు చెబుతోంది. అమెరికా న్యాయ వ్యవస్థలో ఒక భాగం ఇప్పటికీ సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ, అమెరికా సుప్రీంకోర్టుతో సహా ఇతర విభాగాల పక్షపాత దృష్టి కారణంగా ట్రంప్‌పై ఇతర కేసులను అధ్యక్ష ఎన్నికలకు ముందుగా విచారించలేరని న్యూయార్క్‌ కోర్టు తీర్పు సూచించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమైన ‘న్యాయస్థానం’ పోలింగ్‌ బూత్‌ మాత్రమే.

ట్రంప్‌నకు ఉన్మాదపూరితమైన ఓటర్‌ బలం ఉంది. ఇది ఈ తీర్పు ద్వారా మరింత పెరిగింది. కానీ అది మాత్రమే ఆయనకు ఎన్నికల్లో గెలుపును ఇవ్వలేదు. తక్కువ ఉత్సాహవంతులైన, నేరారోపణలను బట్టి దూరం జరిగే వ్యక్తుల మద్దతు ఆయనకు అవసరం. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్‌ బలహీనతను, అస్థిర ప్రవర్తనను, కుంభకోణాలతోపాటు ఆయన అసభ్య ప్రవర్తనను నొక్కిచెప్పింది.

ఈ తీర్పు వెలువడిన వెంటనే నిర్వహించిన ‘యూ–గవ్‌’ పోల్‌లో 27 శాతం మంది ట్రంప్‌నకు ఓటు వేసే అవకాశం తక్కువగా ఉందనీ, 26 శాతం మంది అలా వేసే అవకాశం ఎక్కువగా ఉందనీ, 39 శాతం మంది తీర్పు తమ ఓటు విధానాన్ని ప్రభావితం చేయదనీ చెప్పారు. 

ఇవి పూర్తిగా విభజనకు గురైన అమెరికన్‌ రాజకీయ వ్యవస్థ క్షీణత లోతును పట్టి చూపే భయంకరమైన సంకేతాలు. దేశంలోని సగం మంది మరొకరి అభిప్రాయాలను సహించటానికి ఇష్టపడకపోవటంతో, పెద్ద సంఖ్యలో అమెరికన్లు మూడవ పార్టీలకు ఓటు వేయడం లేదా ఎన్నికలకు దూరంగా ఉండడం కూడా మనం చూడవచ్చు.

ట్రంప్‌ పదవికి పూర్తిగా అనర్హుడన్న విషయం ఈపాటికే స్పష్టం అయింది. అయినా సరే... ఆయన తిరిగి ఎన్నికైతే, తన దేశానికే కాదు, ప్రపంచానికి, భారతదేశానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఉక్రెయిన్, గాజాలో జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పైగా తైవాన్ లో ఒక ప్రమాదం పొంచి ఉన్నందున, అమెరికా నాయకత్వ పాత్ర చాలా ముఖ్యమైనది. చైనాతో తలపడుతున్న భారత్‌ భద్రతకు అమెరికా భాగస్వామ్యం ముఖ్యం.

అధ్యక్షుడు బైడెన్‌ హయాంలో... దక్షిణ కొరియా, జపాన్‌లతో మాత్రమే కాకుండా ఫిలిప్పీన్స్‌, భారతదేశంతో కూడా పొత్తులు పెట్టుకోవడం ద్వారా అమెరికా తన ఇండో–పసిఫిక్‌ ముఖచిత్రాన్ని భారీగా బలోపేతం చేసింది. ఈశాన్య ఆసియాలో బైడెన్‌ ముఖ్యంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాతో కూడిన త్రైపాక్షిక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ట్రంప్‌ హయాంలో అమెరికా, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.

ముఖ్యంగా, ఆయన ‘ఆకస్‌’(ఏయూకేయూఎస్‌–ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌) సైనిక కూటమిని రూపొందించడానికి కూడా చొరవ తీసుకున్నారు. ఇది భారత్‌ సభ్యురాలిగా ఉన్న క్వాడ్‌ సంస్థకు భిన్నం. ఇది ఇప్పుడు ప్రధానంగా ఆరోగ్య భద్రత, సరఫరా గొలుసు స్థితిస్థాపకత, వాతావరణ మార్పులు, క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, సైబర్‌ భద్రత, సముద్ర భద్రత వంటివాటిపై దృష్టి సారిస్తోంది. 

2023 జూన్‌లో, బైడెన్‌ ఇండో–పసిఫిక్‌ ప్రాంతం మరొక అంచులో యూఎస్‌–ఇండియా రక్షణ, భద్రతా సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకుపోయే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు. ట్రంప్‌తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ గత మూడేళ్లలో జరిగినట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి జరగలేదు.

మనోజ్‌ జోషి
వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో డిస్టింగ్విష్డ్‌ ఫెలో (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement