కీవ్: అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఆదివారం పశ్చిమ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ముందస్తు ప్రకటన లేకుండానే ఆమె ఇక్కడికి రావడం గమనార్హం. స్లొవేకియాలోని చిట్టచివరి గ్రామం వద్ద సరిహద్దును దాటి 10 నిమిషాలపాటు వాహనంలో ప్రయాణించి ఉక్రెయిన్‌లోని ఉజ్‌హొరోత్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ రెండు గంటలపాటు గడిపారు. ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలు ఒలెనా జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు.
మాతృ దినోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న క్రూరమైన యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉంటారని పునరుద్ఘాటించారు. జిల్ బైడెన్, ఒలెనా జెలెన్‌స్కీ ఓ పాఠశాలలో కలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషించారు.
యుద్ధం వల్ల తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలు వివరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని జిల్ బైడెన్ ఓదార్చారు. అనంతరం జిల్ బైడెన్, ఒలెనా మీడియాతో మాట్లాడారు. యుద్ధ సమయంలో జిల్ రాక సాహసోపేతమైన చర్య అని ఒలెనా కొనియాడారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్‌బెల్ బాస్ కూడా ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు.
కెనడా ప్రధాని కూడా...
రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల అధినేతలు నైతిక మద్దతునిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం ఉక్రెయిన్‌లోని ఇర్పిన్ పట్టణాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. రష్యా దాడుల్లో ఈ పట్టణం ఇప్పటికే చాలావరకు ధ్వంసమయ్యింది. జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment