వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల అభ్యర్థులుగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ముఖాముఖిలో పాల్గొన్నారు. ట్రంప్, బైడెన్ మధ్య అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఇది మొదటి ప్రత్యక్ష చర్చ. ఈ చర్చలో మొదటి అంశంగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో వచ్చిన ఆరోపణలు, విమర్శలపై మొదటి ప్రశ్నతో ముఖాముఖి ప్రారంభమైంది. అమెరికాలో ఎన్నికలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని బైడెన్ అన్నారు. ఇప్పటికే వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు. ఒబామా కేర్ పాలసీని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ఖండిస్తూ.. గత ఎన్నికల్లో గెలిచాం కాబట్టే సుప్రీంకోర్టు నియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. తనను మూడేళ్ల కోసం ఎన్నుకోలేదని ధీటుగా సమాధానం ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థుల చర్చ వాడివేడిగా కొనసాగుతోంది.
ట్రంప్ తెచ్చిన హెల్త్‌స్కీమ్‌పై ఇరువురి మధ్య చర్చ జరుగుతోంది. ఒబామా కేర్‌కు ప్రత్యామ్నాయం ఎందుకు తీసుకురాలేక పోయారని బైడెన్ సూటిగా ప్రశ్నించారు. ఒబామా కేర్‌ను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన విమర్శించారు. దానికి బదులుగా.. తమ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోందని ట్రంప్ తెలిపారు. మందుల ధరలు గణనీయంగా తగ్గాయని గుర్తు చేశారు. బైడెన్, ట్రంప్ ఎన్నికల చర్చపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 90 నిమిషాల పాటు సాగనున్నది.
కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడంలో ట్రంప్ విఫలమయ్యారని బైడెన్ తీవ్రంగా విమర్శించారు. కోవిడ్ నియంత్రణలో ట్రంప్ విఫలమయ్యారని, వైద్య, ఆరోగ్య విధానంపై ట్రంప్‌కు సమగ్ర ప్రణాళిక లేదని తెలిపారు. దీంతో ట్రంప్ మాట్లాడుతూ.. డెమొక్రటిక్ పార్టీ 47 ఏళ్ల పాలనలో అమెరికాకు చేసిందేమీ లేదన్నారు. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనాతో ఎంతమంది చనిపోయారో బైడెన్‌కు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని బైడెన్ అన్నారు. ట్రంప్ మట్లాడుతూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోందని తెలిపారు. తాము అన్ని పారదర్శక విధానాలే అవలంబిస్తున్నామని చెప్పారు. తాము ప్రజలకు కరోనా విషయంలో మెరుగైన వైద్యం అందించామని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా: అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి
Published Wed, Sep 30 2020 6:51 AM | Last Updated on Wed, Sep 30 2020 8:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment