అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణలను సడలించారు.ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం పదేళ్లే కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు. ఇక ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఆయనకు రాజకీయంగా లాభిస్తుందనేది సుస్పష్టం. అలాగే ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నదీ రహస్యం కాదు. ఆయన ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి సంబంధించిన రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అవి ఆయనకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. తనపై జరిగిన దాడి పట్ల ట్రంప్ సహజమైన, పోరాట ప్రతిస్పందనలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆయనను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టుముట్టినప్పుడు, తన ముఖం మీద రక్తపు చారలతో, తన కుడి పిడికిలిని పైకెత్తి, ‘ఫైట్, ఫైట్, ఫైట్’(పోరాడు) అంటూ గర్జించారు. రక్తసిక్తమైన, ఆగ్రహోదగ్రుడైన ట్రంప్ పిడికిలి బిగించి ఉండగా, ఆయన వెనుక ఒక అమెరికన్ జెండా రెపరెపలాడుతున్న చిత్రాలు వైరల్‌గా మారాయి. రెండు వారాల క్రితం అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన చర్చలో జో బైడెన్ ప్రదర్శన, సమర్థ వంతమైన ప్రచారాన్ని నిర్వహించగల ఆయన సామర్థ్యం వల్ల అధ్యక్ష పోటీ ఇప్పటికే గందరగోళంలో పడింది.
తనపై ఉన్న కేసుల కారణంగా తనను తాను అమర వీరుడు గానూ, హింసకు గురైన వ్యక్తిగానూ ప్రదర్శించుకోవడం ట్రంప్ విధానం. కాల్పుల ద్వారా మృత్యువుకు సమీపంగా వెళ్లడం అనేది ఆయనకు అమరత్వ భావనను ఆపాదిస్తుంది. అధ్యక్షుల చర్చలో పరాజయం తరువాత డెమోక్రాటిక్ అభ్యర్థిగా బైడెన్‌ను తొలగించా లనే ప్రచారంపై ట్రంప్ మీద హత్యాయత్నం తప్పక ప్రభావం చూపు తుంది. ట్రంప్ వర్గానికి అంతకంటే కావాల్సింది లేదు.
ట్రంప్‌పై కాల్పుల ఘటన బైడెన్ ప్రచారాన్ని క్లిష్టతరం చేస్తుంది. ఇప్పుడు నేరుగా ట్రంప్‌పై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు గత వారంలో అన్నారు. ట్రంప్‌ను ఓడించడానికి తానే ఉత్తమ అభ్యర్థిగా ఉన్నానని ఆయన అభిప్రాయం. ‘లక్ష్యానికి సంబంధించిన కేంద్ర స్థానంలో ట్రంప్‌ను ఉంచే సమయం వచ్చింది’ అన్న బైడెన్ మాటల్ని, తమ అధ్యక్ష అభ్యర్థిపై హింసకు పిలుపుగా ఇప్పుడు కొంతమంది రిపబ్లికన్లు ఆపాదిస్తున్నారు. ఇది ఒక విడి ఘటన కాదనీ, ట్రంప్ ‘ఏ రకంగానైనా అడ్డుకోవలసిన నిరంకుశ ఫాసిస్ట్’ అనే డెమోక్రాటిక్ పార్టీ వాచాలత్వపు అనివార్య పరిణామమనీ రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ పోస్ట్ చేశారు.
అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణ లను సడలించడం వంటి నిర్ణయాలతో కోర్టులేమీ మేలు చేయలేదు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి దాడి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం కేవలం పదేళ్లపాటు కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ప్రస్తుతం, కొన్ని రాష్ట్రాలు తమ సొంత చట్టాల ద్వారా అటువంటి ఆయుధాలను నిషేధించాయి. కాల్పుల ఘటన జరిగిన పెన్సిల్వే నియా వాటిలో లేదు. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. జూలైలో ఇప్పటికే మరొక కాల్పుల ఘటన, అయిదు మంది మరణాలకు దారితీసింది. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు, దాదాపు 2,500 మంది గాయపడ్డారు. అమెరికన్ సుప్రీంకోర్ట్ సహాయకారిగా లేదని చెప్పడం చిన్న మాటే అవుతుంది.
బైడెన్ గెలుపొందిన ఎన్నికల ఫలితాలను ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న తారుమారు చేయడానికి ప్రయత్నించిన కాపిటల్ అల్లర్ల నుండి, అమెరికా ఎన్నికల ప్రక్రియ హింసకు దారితీసింది. తిరుగుబాటును అణిచివేసేందుకు ముందు రేగిన అల్లకల్లోలంలో తొమ్మిది మంది మరణించారు. దీనివల్లనే ట్రంప్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత అమెరికన్ రాజకీయాలు లోతుగా విభజనకు గుర య్యాయి. ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ పోల్ ప్రకారం, ప్రతి రాజకీయ పక్షంలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది... ఇతర పార్టీలలోని వారు అనైతికులనీ, నిజాయితీ లేనివారనీ, సంకు చిత మనస్తత్వం గలవారనీ నమ్ముతున్నారు.
ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నది రహస్యం కాదు. తాను వచ్చే నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే ‘రక్తపాతం’ ఉంటుందని మార్చ్ నెలలో ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. తరువాత ఒక ర్యాలీలో, ‘ఇప్పుడు నేను ఎన్నిక కాకపోతే... అది దేశానికి రక్తపాత కారకం అవుతుంది’ అని పునరావృతం చేశారు. 2023 మార్చిలో, ట్రంప్ దోషిగా నిర్ధారించబడిన కేసులో మాన్ హట్టన్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది తనపై అభియోగాలు మోపినట్లయితే ‘సంభావ్య మరణం, విధ్వంసం’ జరగొచ్చని మాజీ అధ్యక్షుడు హెచ్చరించారు.
తనకు అన్యాయం జరిగితే ‘వీధుల్లో అల్లర్లు జరుగు తాయి’, ‘దేశంలో అల్లర్లు జరుగుతాయి’ అని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన అనుచరులు మరోవైపున వలసదారులు, విదేశీయులు, శ్వేతజాతీయేతర జాతుల ప్రజలపై హింస గురించి మాట్లాడారు. నిజానికి, వ్యాపార లావాదేవీల్లో 34 నేరాలకు ట్రంప్ పాల్పడ్డారని మే నెలలో న్యాయస్థానం ఆయనను దోషిగా ప్రకటించిన తర్వాత, ట్రంప్ అనుకూల వెబ్‌సైట్లు అల్లర్లు, విప్లవం, హింసాత్మక ప్రతీకారం అనే పిలుపులతో నిండిపోయాయి.
ఇటీవలి సంవత్సరాలలోని హింసలో రాజకీయ నమూనా ఉంది. 2017లో, బేస్‌బాల్ గేమ్‌లో రిపబ్లికన్ హౌస్ మెజారిటీ విప్ అయిన స్టీవ్ స్కలైస్ మీద రిపబ్లికన్ వ్యతిరేక గన్ మ్యాన్ కాల్పులు జరిపాడు (ఆ గన్‌మ్యాన్‌ను అప్పుడే కాల్చి చంపారు). 2018లో, ఫ్లోరిడాకుచెందిన ఒక వ్యక్తి నాటి అధ్యక్షుడు ట్రంప్ విమర్శకులకు పైపు బాంబు లను మెయిల్ చేశాడు. అతడు లక్ష్యంగా చేసుకున్నవారిలో బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, కమలా హారిస్ ఉన్నారు. 2020 ఎన్నికలకు ముందు, మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్‌ను కిడ్నాప్ చేసి, రాజ ద్రోహ నేరం కింద ఆమెను ‘విచారణ’లో నిలబెట్టడానికి ఆరు గురు వ్యక్తులు కుట్ర పన్నారు. 2022లో, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీని లక్ష్యంగా చేసుకున్నారు; దాడిలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు పెలోసీని బందీగా తీసుకోవాలని పథకం వేశాడు.
ఈ పరిస్థితులలో, సగటు అమెరికన్ నిరుత్సాహానికీ, నిరాశకూ గురవుతాడు. రెండు పార్టీలలోని అతివాద శక్తులు అధికారం చేజిక్కించుకుని ఉన్నాయనీ, గతంలో అమెరికన్ రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన ద్వైపాక్షికతకు పెద్దగా చోటు లేకుండా చేశాయనీ సగటు అమెరికన్లు భావిస్తున్నారు.రాబోయే రోజులూ, వారాల్లో బైడెన్ చర్చ వైఫల్యం, దానిపై పొరలుగా, ట్రంప్‌పై హత్యాయత్నం వంటి ఇటీవలి సంఘటనలకు చెందిన పరిణామాల పెరుగుదలను మనం చూస్తాం. చాలామంది సరైన ఆలోచనాపరులు ట్రంప్‌పై కాల్పుల దాడి కలిగించిన షాక్ ప్రభావం ఎంతో కొంత ప్రశాంతతను తెస్తుందని ఆశిస్తున్నప్పటికీ, అలా జరుగుతుందనడానికి ఎటువంటి హామీ లేదు. రష్యన్లు, చైనీయులు తమ వంతు పాత్రను జోడించడంతో ఇప్పటికే తప్పుడు సమాచారం, అతిశయోక్తి, తీవ్రవాదం, జాత్యహంకారం, విభజన, అపనమ్మకం లాంటివి సైబర్ ప్రపంచంలో చెడతిరుగుతున్నాయి.
ట్రంప్ ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది. తనపై హత్యాయత్నాన్ని ఆయన డెమో క్రాట్‌లపై దాడి చేయడానికి, విభజనలను మరింతగా పెంచడానికి ఉపయోగించవచ్చు లేదా నైతికంగా అత్యున్నత మార్గాన్ని చేపట్టి, పక్షపాత చీలికలను నయం చేయడానికి ఎంచుకోవచ్చు. కానీ ఫిర్యా దులు, ప్రతీకారం చాలాకాలంగా ట్రంప్ ఇతివృతాలుగా ఉన్నాయి. ఆయన తక్షణ ప్రతిస్పందన నెమ్మదిగానూ, తెలివిగానూ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ట్రంప్ ఏ దిశలో వెళ్లగలరనే దానిపై అంచనాలు ఊహకందడం లేదు.
- వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లోడిస్టింగ్విష్డ్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
- మనోజ్ జోషి
Comments
Please login to add a commentAdd a comment