వాషింగ్టన్: రెండు అగ్రరాజ్యాల అధ్యక్షులు జో బైడెన్, జిన్‌పింగ్ బుధవారం భేటీ అయ్యారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అనంతరం బయటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని నియంతగానే విశ్వసిస్తున్నానని చెప్పారు. చైనా ప్రభుత్వం, తమ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుందని అన్నారు. జిన్‌పింగ్‌ను నియంతలాగే చూస్తున్నారా..? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో బైడెన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లోనూ బైడెన్ ఇదే మాట మాట్లాడారు. అప్పట్లోనే బైడెన్ తీరును చైనా ఖండించింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది.
కాగా.. కాలిఫోర్నియాలోని ఒక విశాలమైన భవనంలో ఈ సమ్మిట్ ముగిసింది. రెండు దేశాల మధ్య విబేధాలు సమసిపోయేలా, దౌత్య సంబంధాలు తప్పదోవపట్టకుండా కృషి చేయడానికి అధ్యక్షులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో-పసిఫిక్, ఆర్థిక సమస్యలు, కృత్రిమ మేధస్సు, మాదక ద్రవ్యాల సరఫరా, వాతావరణం వంటి ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. అమెరికాలో అక్రమ మాదక ద్రవ్యాల వాణిజ్యం చేపడుతున్న చైనా సంస్థలపై చర్యలు తీసుకుంటానని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు.
అమెరికాను ఇరుకున పెట్టాలనే ఉద్దేశం లేదని జిన్‌పింగ్ స్పష్టంగా తెలియజేశారు. అలాగే.. అమెరికా కూడా చైనాను అణగదొక్కే చర్యలకు పాల్పడకూడదని పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు వివాదాలకు దారితీయకుండా చర్యలు తీసుకోవాలని ఇద్దరు అధ్యక్షులు అంగీకారానికి వచ్చారు.
తైవాన్ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు చాలా సున్నితమైన అంశంగా మారిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. తైవాన్ స్వాతంత్య్రానికి అమెరికా మద్దతు ఇవ్వకూడదని కోరుతూ.. ఆయుధ సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment