లాంగ్‌రేంజ్ క్షిపణులు
ప్రయోగించడానికి అనుమతి
రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లనున్న ఉక్రెయిన్ సైన్యం
బ్రెజీలియా: ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి వేలాది మంది సైనికులను రష్యా దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విరుగుడుగా ఉక్రెయిన్, దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహానికి తెరతీశాయి. ఉక్రెయిన్‌కు అందజేసిన లాంగ్‌రేంజ్ మిస్సైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతి ఇచ్చారు.
అమెరికా అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. బైడెన్ నుంచి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎం)ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం వాటిల్లే్ల అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రుదేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడుతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమదేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ జో బైడెన్‌పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అగ్నికి బైడెన్ ఆజ్యం పోస్తున్నారు: రష్యా
అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ బైడెన్‌పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకో వాలని హెచ్చరించాయి. అయితే, ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment