ఇంధన బిల్లులు తగ్గిస్తానన్న ట్రంప్ హామీపై కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఉచితాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గిస్తానంటూ అక్కడి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో ప్రస్తావించారు. ట్రంప్ ట్వీట్‌ను ఆయన రీ ట్వీట్ చేస్తూ.. ‘విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ పేర్కొన్నారు.
కేజ్రీవాల్ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. విద్యుత్, వైద్యం, విద్య ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు కేజ్రీవాల్‌పై మండిపడుతుండటం తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైతే 12 నెలల్లో కరెంట్ బిల్లులతో పాటు ఇంధన బిల్లులను 50 శాతానికి తగ్గిస్తానని, దీనివల్ల అమెరికాలో వ్యాపారావకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్వీట్ చేశారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పర్యావరణ అనుమతులను వేగవంతం చేస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment