![Sakshi Editorial On Joe Biden departure in USA Politics](/styles/webp/s3/article_images/2024/07/23/biden.jpg.webp?itok=VR1KIVzq)
అందరూ అనుమానిస్తున్నట్టే జరిగింది. చెప్పాలంటే అనివార్యమైనదే అయింది. మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్నాయనగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు చేస్తున్న ప్రచారం నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ పక్కకు తప్పుకున్నారు. వైట్‌హౌస్ పీఠానికి రేసు నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం ఆయన ఆకస్మికంగా చేసిన ప్రకటన ఒక విధంగా సంచలనమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఇలా అర్ధంతరంగా బరిలో నుంచి వైదొలగిన ఘటన మునుపెన్నడూ జరగనిదే.
అలాగని కొద్ది వారాలుగా అమెరికాలో జరుగుతున్న పరిణామాల రీత్యా బైడెన్ ప్రకటన మరీ అనూహ్యమేమీ కాదు. ఎన్నికల్లో పోటీ పడకున్నా, పదవీకాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటించిన ఆయన తన స్థానంలో పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ప్రస్తావించడం, ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి డెమోక్రాట్లు బలపరుస్తుండడంతో అమెరికా ఎన్నికల కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇటీవలే ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్న ఘటనతో అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్న వేళ డెమోక్రాటిక్ పార్టీకి ఇది కొత్త ఊపిరి పోస్తోంది. మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది.
ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో జో బైడెన్ జాతీయస్థాయి రాజకీయ జీవితం ప్రారంభించారు. రిపబ్లికన్ సెనెటర్‌ను ఓడించడం ద్వారా 1972లో ఆయన కెరీర్ మొదలైంది. సరిగ్గా 52 ఏళ్ళ తర్వాత అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడైన ఆయన యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేయాల్సి వచ్చింది. నెలన్నర క్రితం కూడా బరిలో నుంచి తప్పుకొనేది లేదని బల్లగుద్ది చెప్పిన బైడెన్ ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారంటే... ఒక రకంగా అది ఆయన స్వయంకృతం. మరోరకంగా క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల పెరిగిన అవగాహన అని చెప్పక తప్పదు. ఆయనలో ఈ ప్రాప్తకాలజ్ఞతకు చాలా కారణాలే దోహదపడ్డాయి.
ట్రంప్‌తో తొలి చర్చలోనే తడబడడం దగ్గర నుంచి నడకలో, నడతలో, మాటలో మార్పు తెచ్చిన వయోభారం, అభ్యర్థిని మార్చాలంటూ సొంత పార్టీ వారి నుంచే కొంతకాలంగా పెరుగుతున్న ఒత్తిడి వరకు ఇలా అనేకం అందులో ఉన్నాయి. అలాగే, ఆరునూరైనా సరే ముందనుకున్నదే చేసి తీరాలన్న మంకుపట్టు కన్నా రాజకీయాల్లో పట్టువిడుపులు ముఖ్యమనీ, కళ్ళెదుటి వాస్తవాలను బట్టి విజయం కోసం ఆట తీరు మార్చడం కీలకమనీ డెమోక్రాటిక్ పార్టీ అర్థం చేసుకుంది. అందుకే, బైడెన్ పోటీ ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వాగతించాల్సిందే తప్ప తప్పుబట్టడానికి లేదు.
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవికి డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు 59 ఏళ్ళ కమలా హ్యారిస్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. భారతీయ మూలాలున్న ఈ లాయర్ మొదట అటార్నీ జనరల్‌గా ఎదిగి, ఆ పైన సెనెటరయ్యారు. నిజానికి, అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్, తొలి దక్షిణాసియా అమెరికన్ ఆమే! ఉపాధ్యక్షు రాలిగా ఆమె అద్భుతాలు చేయకపోయినా, చిందరవందరైన డెమోక్రాటిక్ పార్టీని మళ్ళీ చక్కదిద్ది గాడిన పెట్టగలరని ఆశ. ఇప్పుడు ఆమె ముందున్న అసలు సవాలదే. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడానికి డెమోక్రాట్లు జాగు చేయకపోవచ్చు.
అదే జరిగాక... ఎంతైనా స్త్రీ అనీ, ఆమె జాతి ఫలానా అనీ ప్రత్యర్థి ట్రంప్ బృందం ప్రచార దాడులు ప్రారంభించడం ఖాయం. అయితే, గతంలో ఇలానే బరాక్ ఒబామాపై ప్రచారాలు సాగినా, అవేవీ ఓటర్లు పట్టించుకోలేదు. అధ్యక్షుడిగా ఆయన రెండు సార్లు గెలిచారన్నది గమనార్హం. ధాటిగా మాట్లాడుతూ, ప్రచారం చేసే సత్తా ఉన్న కమల ఎన్నికల్లో అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ట్రంప్‌కు అడ్డుకట్ట వేయలేకున్నా, కనీసం ఆయన తలతిక్క నిర్ణయాలు తీసుకొనే వీలు లేని రీతిలో అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికయ్యేలా చేయగలరని విశ్లేషణ.
పునర్వైభవం కోసం డెమోక్రాట్లు అంతా ఏకమవుతున్న వేళ సొంత నియోజకవర్గమంటూ లేని కమల ముందుగా భాగస్వాముల్ని, సమర్థకుల్ని, సహాయకుల్ని, అనుభవజ్ఞులూ – ప్రతిభావంతులైన బృందాన్నీ సమకూర్చుకోవాలి. కీలక రాష్ట్రాల్లో వారే ఆమెకు అండ. నిజానికి, పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నాయకత్వ కొరత పీడిస్తున్నట్టుంది. ఇటు డెమోక్రాట్లు, అటు రిపబ్లికన్లు – ఇరు పక్షాల్లోనూ ప్రజాదరణతో పాటు నేర్పు, ఓర్పున్న సమర్థులైన నాయకులెవరూ కనిపించడం లేదు.
ఎవరూ రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని చేపట్టరాదన్న అమెరికా రాజ్యాంగం ఒబామా లాంటి వారి పునఃప్రతిష్ఠకు అడ్డంకిగా మారింది. అది లోటే అయినా, ఆ నిబంధనలోని విస్తృత ప్రజాస్వామ్యస్ఫూర్తి, దూరాలోచన అర్థం చేసుకోదగినవే. అనుభవం లేనంత మాత్రాన అధ్యక్షబాధ్యతల్లో విఫలమవుతారనీ లేదు. మునుపటి అధ్యక్షులు చాలామంది అందుకు ఉదాహరణ. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఏ కొత్త బాధ్యతా కష్టం కాదు. పైగా, ట్రంప్‌కు మళ్ళీ పట్టం కట్టడానికి సుతరామూ ఇష్టం లేని అమెరికన్లకు ఇప్పుడు కమల మినహా ప్రత్యామ్నాయం లేదు. అదీ ఆమెకు కలిసిరావచ్చు.
అయితే, హత్యాయత్నం తర్వాత పిడికిలి పైకెత్తి, పోరాటానికి నినదించి హీరో స్థాయికి పెరిగిన ట్రంప్ ప్రాచుర్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లను ఆకర్షించడం కోసం ఉపాధ్యక్ష పదవికి 39 ఏళ్ళ జె.డి. వాన్స్‌ను ఎంపిక చేసుకొని ట్రంప్ మంచి ఎత్తుగడే వేశారు. మొత్తానికి, రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికా ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే, అయిపోయిందనుకున్న ఆట అసలు ఇప్పుడే మొదలైంది!
Comments
Please login to add a commentAdd a comment