న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్‌నర్స్, ఇతర ఇన్వెస్టర్లు తాజాగా అదానీ పవర్‌లో 8.1 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఇందుకోసం 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,000 కోట్లు) వెచ్చించాయి. సెకండరీ మార్కెట్‌లో అత్యంత భారీ ఈక్విటీ డీల్స్‌లో ఇది కూడా ఒకటని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం.. 31.2 కోట్ల షేర్లను ప్రమోటర్ అదానీ కుటుంబం విక్రయించగా, సగటున షేరుకు రూ. 279.17 రేటుతో జీక్యూజీ పార్టనర్స్, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.
జీక్యూజీ ఇప్పటికే అదానీ గ్రూప్‌నకు చెందిన పలు సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఒక ఇన్వెస్టరు, ప్రమోటరు గ్రూప్ మధ్య ఈ తరహా లావాదేవీ జరగడం భారత్‌లో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు వివరించాయి.. అదానీ గ్రూప్ వ్యాపార ప్రమాణాలను, బలాన్ని ఇది సూచిస్తోందని తెలిపాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బతో అదానీ గ్రూప్ అతలాకుతలం అయిన పరిస్థితుల్లో, ఈ ఏడాది మార్చి నుంచి ఆ గ్రూప్ సంస్థల్లో జీక్యూజీ క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 5.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 6.54%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది.
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలోనూ..
మరో స్టాక్ మార్కెట్ డీల్‌లో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ 1.27 శాతం వాటాలను రూ. 717.57 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా జీక్యూజీ పార్ట్‌నర్స్, వాషింగ్టన్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ తదితర సంస్థలు కొనుగోలు చేశాయి. జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్‌మెంట్స్.. షేరు ఒక్కింటికి రూ. 341.7 రేటు చొప్పున 2.10 కోట్ల షేర్లను విక్రయించింది. డీల్ అనంతరం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ వాటా 20.22 శాతం నుంచి 18.95 శాతానికి తగ్గింది. ఇటీవలే జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జీక్యూజీ పార్ట్‌నర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ రూ. 411 కోట్లతో 1.19 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment