ఈ ఏడాది విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ అప్ | M&A deals value at USD 16.3 bn in January-May this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ అప్

Published Mon, Jun 16 2014 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

ఈ ఏడాది విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ అప్ - Sakshi

ఈ ఏడాది విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ అప్

న్యూఢిల్లీ: ఈ ఏడాది(2014) తొలి ఐదు నెలల్లో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్‌ఏ) డీల్స్ భారీగా పుంజుకున్నాయి. వెరసి జనవరి నుంచి మే వరకూ 16.37 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఇందుకు ఒక్క మే నెలలోనే 4.4 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ జరగడం దోహదపడింది. మేలో మొత్తం 52 లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో అంటే 2013 మే నెలలో 1.7 బిలియన్ డాలర్ల విలువైన 44 లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి. కాగా, జనవరి-మే కాలంలో అత్యధికంగా 230 డీల్స్ జరిగాయి. 2013 ఇదే కాలంలో 216 లావాదేవీలు నమోదుకాగా, వీటి విలువ 8.71 బిలియన్ డాలర్లు మాత్రమే. గ్రాంట్ థార్న్‌టన్ ఇండియా పార్టనర్  నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
 
100 మిలియన్ డాలర్ల డీల్స్: మే నెలలో 100 మిలియన్ డాలర్ల డీల్స్ 8 జరిగాయి. వీటిలో ఒక్కొక్కటీ 500 మిలియన్ డాలర్ల విలువైన  మూడు డీల్స్ ఉన్నాయి. కాగా, ఈ విభాగంలో మరోవైపు దేశీ కంపెనీల విదేశీ లావాదేవీలు సైతం పుంజుకోవడం గమనార్హం. మే నెలలో ప్రధానంగా అదానీ పోర్ట్స్ డీల్ చెప్పుకోదగ్గది. ధామ్రా పోర్ట్‌ను 932 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. యునెటైడ్ స్పిరిట్స్‌కు చెందిన వైట్ అండ్ మెకేను ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎంపెరేడర్ 725 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఇక రిలయన్స్-నెట్‌వర్క్18 మధ్య జరిగిన డీల్ విలువ 678 మిలియన్ డాలర్లుకాగా, టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన నియోటెల్‌లో 68% వాటాను వొడాకామ్ కొనుగోలు చేసింది. ఇందుకు 455 మిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇదే విధంగా వదీనర్ పవర్‌లో 74% వాటాను ఎస్సార్ ఆయిల్ 356 మిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement