సాక్షి, హైదరాబాద్: వేగవంతమైన పట్టణీకర నేపథ్యంలో భూమి లభ్యత అనేది అత్యంత కీలకంగా మారింది. కరోనా నేపథ్యంలో ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలో స్థల లావాదేవీలు జరిగాయి. గతేడాది జులై – సెప్టెంబర్ (క్యూ3) నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1,757 ఎకరాలలో 45 భూ ఒప్పందాలు జరిగాయని అనరాక్ డేటా తెలిపింది. ఇందులో 69 శాతం వాటా 1,205 ఎకరాలు బహుళ నివాస సముదాయాల అభివృద్ధి కోసమే జరిగాయని.. వీటిల్లో సుమారు 4.5 నుంచి 5 కోట్ల చ.అ. విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లుంటాయని వెల్లడించింది.
ఫస్ట్ ముంబై
దేశంలోని 7 ప్రధాన నగరాలలో గత ఏడాది కాలంలో 1,205 ఎకరాలలో రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేకంగా 28 భూ ఒప్పందాలు జరిగాయి. అత్యధికంగా 64 శాతం వాటాతో ముంబైలో 11 డీల్స్‌లో 768 ఎకరాల లావాదేవీలు జరిగాయి. 12 శాతం వాటాతో 4 డీల్స్‌లో ఎన్‌సీఆర్‌లో 150 ఎకరాల ఒప్పందాలున్నాయి. ఇందులో గుర్గావ్‌లో 77 ఎకరాలలో మూడు డీల్స్, నోయిడాలో 73 ఎకరాల ఒక డీల్ జరిగింది. కోల్‌కతాలో జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) ప్రాతిపదికన 92 ఎకరాలలో రెండు ఒప్పందాలు జరిగాయి. రెండు భూ ఒప్పందాలలో 78 ఎకరాల లావాదేవీలతో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బెంగళూరులో ఐదు డీల్స్‌లో 59 ఎకరాలు, పుణేలో మూడు డీల్స్‌లో 42 ఎకరాలు, చెన్నైలో ఒక డీల్‌లో 16 ఎకరాల లావాదేవీలు జరిగాయి.
ఏ డెవలపర్లంటే..
గోద్రెజ్ ప్రాపర్టీస్, సన్‌టెక్ రియాల్టీ, ఆషియానా హౌసింగ్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్, ఎం3ఎం గ్రూప్, రన్వాలా డెవలపర్స్ నివాస సముదాయాల తో పాటూ పారిశ్రామిక, వాణిజ్యం, డేటా సెంటర్లు, రిటైల్ డెవలప్‌మెంట్ కోసం భూ ఒప్పందాలు జరిపారు. ఆర్ధిక స్థోమత ఉన్న చాలా మంది డెవలపర్లు ప్రధాన నగరాలలోని కీలకమైన ప్రాంతాలలో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పరుచుకునేందుకు డీల్స్‌ను జరిపారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లపైనే..
కరోనా, నగదు లేమి కారణంగా గత 7–8 నెలలుగా పరిమిత స్థాయిలో భూ ఒప్పందాలు జరిగాయని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. మరీ ముఖ్యంగా గత 3–4 నెలలుగా పరిశ్రమ స్టాండ్‌స్టిల్ దశకు చేరుకుందని పేర్కొన్నారు. ఏడాది కాలం పాటు డెవలపర్లు రుణాలను తీర్చడం లేదా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికే ఇష్టపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది క్యూ3 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని.. దీంతో గతంలో తమ వద్దే స్థలాలను అట్టిపెట్టుకున్న చాలా మంది భూ యజమానులు తిరిగి విక్రయానికి పెట్టారని పేర్కొన్నారు. దీంతో గతేడాది ధరల కంటే కొంచెం ఎక్కువ లేదా అదే ధరలకు పరిమిత స్థాయిలో భూ ఒప్పందాలు జరిగాయని వివరించారు.
ఏ విభాగంలో ఎన్ని ఒప్పందాలంటే..
► 1,757 ఎకరాలలో 45 భూ ఒప్పందాలు జరగగా.. ఇందులో ఆరు డీల్స్‌లో 411 ఎకరాలలో లాజిస్టిక్స్, పారిశ్రామిక పార్క్‌ల ఒప్పందాలున్నాయి. గుర్గావ్‌లో రెండు డీల్స్ ద్వారా 275 ఎకరాలు, చెన్నైలో 2 డీల్స్‌లో 83 ఎకరాలు, హౌరాలో 31 ఎకరాలలో ఒకటి, ముంబైలో 22 ఎకరాలలో మరో భూ ఒప్పందం జరిగింది.
► 58 ఎకరాలలో మిశ్రమ అభివృద్ధి కోసం మూడు భూ ఒప్పందాలు జరిగాయి. ముంబై, చెన్నై, గుర్గావ్‌లో ఒక్కోటి చొప్పున డీల్స్ జరిగాయి.
► 44 ఎకరాలలో వాణిజ్య అభివృద్ధి కోసం ఐదు ఒప్పందాలు జరిగాయి. ఇందులో బెంగళూరులో మూడు, ముంబైలో రెండు డీల్స్ ఉన్నాయి.
► నవీ ముంబైలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 30 ఎకరాల లావాదేవీలు జరిగాయి. 9 ఎకరాలలో రిటైల్ అభివృద్ధి కోసం రెండు భూ ఒప్పందాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment