ఖరీఫ్‌పై నీలినీడలు!
ఖరీఫ్‌పై నీలినీడలు!
Published Sun, Jul 17 2016 11:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– వర్షాలు కనుమరుగవడంతో రైతుల్లో కలవరం
– జూలైలో కురువాల్సిన వర్షపాతం 117.2 మి.మీ
– ఇప్పటి వరకు నమోదైంది 13.9 మి.మీ మాత్రమే
– ఎండుతున్న పంటలు..మట్టిపాలవుతున్న పెట్టుబడి
కర్నూలు (అగ్రికల్చర్):
మొదట్లో మురిపించిన వర్షాలు ఆ తరువాత మొండికేశాయి. ఖరీఫ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో రైతుల్లో కలవరం రేగుతోంది. జూలై నెల సాధారణ వర్షపాతం 117.2 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 13.9మి.మీ. మాత్రమే నమో దైంది. వానలు లేకపోవడంతో మొక్కజొన్న, వేరుశనగ, పత్తి వంటి పంటలు వాడుపడుతున్నాయి. వరస కరువులతో ఇప్పటికే రైతులు అల్లాడుతున్నారు. ఈ ఏడాది అదే పరిస్థితులు కనిపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
ఆశాజనకంగా పంటల సాగు..
జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 2.10 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. పత్తి 75 వేల హెక్టార్లు, వేరుశనగ 58 వేల హెక్టార్లు, కంది 45వేల హెక్టార్లు, మొక్కజొన్న 25 వేల హెక్టార్లలో సాగు చేశారు. బ్యాంకులుపంట రుణాలు ఇవ్వకపోయినా రైతులు అప్పులు తెచ్చి విత్తనాలు.. ఎరువులు తదితర వాటికి ఎకరాకు సగటున రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టారు. మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు కురువకపోతే ఇదంతా మట్టి పాలు అయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటలకు జూలై నెల కీలకమైంది. ఈ నెలలో జిల్లా మొత్తం మీద రోజుకు సగటున 3.9 మిమీ వర్షం కురువాల్సి ఉంది. అపుడే వ్యవసాయం అశాజనకంగా ఉంటుంది. అయితే ఈ నెలలో వర్షపాతం చాలా తక్కువగా ఉంది. జూన్ నెలలో అన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు వెనక్కి వెళ్లి పోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. మొక్కజొన్న పంట 15 రోజుల కంటే ఎక్కువ రోజులను బెట్టకు తట్టుకోలేదు. అయితే 18 రోజులుగా వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న పంట దెబ్బతింటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కూరగాయలు తదితర పంటలను కాపాడుకోవడంలో రైతులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇటీవలి వరకు విత్తనం పనులు ముమ్మరంగా జరిగినా వర్షాలు లేకపోవడం వల్ల విత్తనం పనులు కూడా నిలిచిపోయాయి. ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల వరకు ఉండటం, గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే 98 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో ఖరీప్ ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులకు జూలై నెలలో వర్షాలు కనుమరుగు కావడంతో రైతులు ఆందోళనకు గురువుతున్నారు.
అధిక డ్రై స్పెల్ ఇది..
వర్షానికి, వర్షానికి ఉన్న వ్యత్యాసాన్ని డ్రై స్పెల్‌గా భావిస్తారు. డ్రై స్పెల్ పది రోజులు వరకు ఉంటే ఇబ్బంది లేదు. నల్లరేగడి నేలల్లో వేసిన పంటలు అయితే కొన్ని రోజులు బెట్టను తట్టుకుంటాయి, జిల్లాలోని ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్‌లలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉండటం వల్ల పది రోజులు వర్షాలు లేకపోతే పంటలు తట్టుకోలేవు. ప్రస్తుతం వర్షానికి, వర్షానికి వ్యత్యాసం దాదాపు 20 రోజలు ఉండటంతో ఖరీఫ్ గట్టెక్కేనా... అనే అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి.
Advertisement