ఏపీకి 18.5, తెలంగాణకు 17.5 | Krishna management board water allocations to AP, TS for Khareef | Sakshi
Sakshi News home page

ఏపీకి 18.5, తెలంగాణకు 17.5

Published Wed, Oct 5 2016 8:40 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

ఏపీకి 18.5, తెలంగాణకు 17.5 - Sakshi

ఏపీకి 18.5, తెలంగాణకు 17.5

-ఇరు రాష్ట్రాల ఖరీఫ్ అవసరాల దృష్ట్యా నీటి విడుదలకు బోర్డు నిర్ణయం
-ఎడమ కాల్వ కింద లెలంగాణకు 15 టీఎంసీ, హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 2.5టీఎంసీ
-పోతిరెడ్డిపాడు కింది అవసరాలకు 11 టీఎంసీ
-ఇందులో చెన్నై తాగునీటికి 3 టీఎంసీ
-ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు

సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు, తాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం చేసింది. అక్టోబర్ అవసరాలకు గానూ తెలంగాణకు 17.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం చేసింది. ఈ మేరకు నీటి కేటాయింపులపై తన నిర్ణయాన్ని తెలియజేస్తూ బుధవారం ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు రాసింది. సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ కోసం 30.20 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.10టీఎంసీలు కలిపి మొత్తంగా 40.30టీఎంసీలు అవసరం ఉంటాయని ఆగస్టు నెలలో తెలంగాణ బోర్డును కోరింది. ఇందులో 15 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు గతంలోనే అనుమతులిచ్చింది. అనంతరం మళ్లీ తెలంగాణ సాగర్ ఎడమ కాల్వ కింద జోన్-1, జోన్-2లోని ఖరీఫ్ సాగు అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించాలని మరో లేఖ రాసింది. ఇదే సమయంలో టగత 28, 30 తేదీల్లో ఏపీ తనకు పోతిరెడ్డిపాడు కింద 11 టీఎంసీలు, హంద్రీనీవా కింద 5 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద మరో 2.50 టీఎంసీలు కావాలని విన్నవించింది. ఈ వినతులను పరిశీలించిన బోర్డు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుధ్దంగా ఇరు రాష్ట్రాలు నీటిని విడుదల చేశారో తెలుపుతూనే, ప్రస్తుత కేటాయింపులు జరిపింది.

మూడు చోట్ల వాటాకు మించి వినియోగం..
కృష్ణా బేసిన్‌లో ఇప్పటివరకు తెలంగాణ ఏఎంఆర్‌పీ కింద 10.21టీఎంసీ, ఎడమ కాల్వ కింద 5.131టీఎంసీ, కల్వకుర్తి కింద 1.745 టీఎంసీలు కలిపి మొత్తంగా 17.087టీఎంసీ వినియోగించుకోగా, ఏపీ పోతిరెడ్డిపాడు కింద 23.79టీఎంసీ, సాగర్ కుడి కాల్వ కింద 9.989, కృష్ణా డెల్టా సిస్టమ్ కింద 20.413, హంద్రీనీవా కింద 9.33టీఎంసీలు కలిపి మొత్తంగా 63.524 టీఎంసీలు వినియోగించారని బోర్డు లేఖలో వివరించింది. గత ఆగస్టులో ఇచ్చిన ఆదేశాలకు విరుధ్దంగా పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఏఎంఆర్‌పీ కింద వాటాకు మించి వినియోగం చేశారని లేఖలో పేర్కొంది.

అధికం వాడుంటే వీటిని వాడరాదు..
ప్రస్తుత రాష్ట్రాల వినతులను దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవాకు 5 టీఎంసీ, చెన్నై తాగునీటికి 3, ఎస్‌ఆర్‌బీసీ 3, తెలుగుగంగ ప్రాజెక్టు 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.50 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏపీకి 18.50 టీఎంసీలు విడుదలకు బోర్డు అంగీకారం తెలిపింది. ఇక తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీ, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.50టీఎంసీలు కలిపి 17.50 టీఎంసీల వినియోగానికి అంగీకారం తెలిపింది. ప్రస్తుతం జరిపిన కేటాయింపులు గత ఆగస్టు నెలలో పేర్కొన్న నీటి కేటాయింపులకు అదనమని, అప్పటి ఆదేశాల్లో పేర్కొన్న దాని కంటే అధికంగా వినియోగం చేసుంటే ప్రస్తుత నీటిని వాడటానికి అవసకాశం ఉండదని, తక్కువగా వినియోగించి ఉంటే మిగిలిన నీటిని వినియోగించుకోవచ్చని లేఖలో స్పష్టం చేసింది. ఏ రాష్ట్రమైనా అధికంగా నీటిని వాడుకొని ఉంటే ఆ రాష్ట్రం త్రిసభ్య కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించింది. ప్రస్తుతం చేసిన కేటాయింపులను ఆయా రాష్ట్రాలు అదే అవసరాలకు వాడుతున్నాయా? లేక ఇతర ప్రాధాన్యాత అవసరాలకు వాడకుంటున్నాయా? అన్నది ఆయా రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు గమనిస్తూ ఉండాలని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement