టీఎస్ వర్సెస్ ఏపీ | TS V/S AP | Sakshi
Sakshi News home page

టీఎస్ వర్సెస్ ఏపీ

Published Wed, Mar 9 2016 10:24 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

టీఎస్ వర్సెస్ ఏపీ - Sakshi

టీఎస్ వర్సెస్ ఏపీ

 ఆర్టీసీ బస్టాండ్లలో ప్లాట్ ఫాంల గొడవ
  ఆంధ్రా బస్సులను ప్లాట్‌ఫాంపైకి రాకుండా అడ్డగింత
  విజయవాడలో తమను రానివ్వడం లేదని ఆరోపణ
  కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడలో అడ్డుకునేందుకు ప్రత్యేక సిబ్బంది

 
 కోదాడటౌన్ : ఆర్టీసీలో తెలంగాణ- ఆంధ్ర వివాదం ముదిరి పాకాన పడింది. బస్టాండ్లలో ప్లాట్ ఫాంలపైకి రాకుండా అక్కడి బస్సులను ఇక్కడి వారు.. ఇక్కడి బస్సులను అక్కడి వారు అడ్డుకుంటున్నారు. జాతీయ రహదారిపై ఉన్న కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి బస్టాండ్లతో పాటు ఆంధ్ర బస్సులు ఎక్కువగా వచ్చే మిర్యాలగూడెం, మల్లేపల్లి బస్టాండ్లలో ఆంధ్ర బస్సులకు ఒక్క ప్లాట్ ఫాం మాత్రమే కేటాయించారు. వారు అక్కడ తప్పా మిగతా ఫ్లాట్‌ఫాంలపై బస్సులను నిలపకుండా ప్రతి బస్టాండ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించి అడ్డుకుంటున్నారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి టీఎస్ ఆర్టీసీ సిబ్బందికి బస్టాండ్లలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
 
 వివాదం ఏంటంటే..
 ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బస్టాండ్ నుంచి కోదాడతో పాటు నల్లగొండ, మిర్యాలగూడకు నిత్యం బస్సుల రాక పోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి తెలంగాణ బస్సులు హైదరాబాద్‌కు కూడా సర్వీస్‌లు కొనసాగి స్తున్నారు. అయితే తెలంగాణ బస్సుల్లో చార్జీలు ఆంధ్ర బస్సుల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులను ఎక్కుతున్నారని తమకు తీవ్ర నష్టం వస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ బస్టాండ్‌లో 80 ప్లాట్‌ఫాంలు ఉండగా తెలంగాణ బస్సులన్నింటికి కలిపి ఒక్క ప్లాట్ పాం మాత్రమే ఇచ్చారు. బస్సులు బయట నిలపడానికి అవకాశం లేక, ప్లాట్‌ఫాం మీదకు వెళ్లనీయకపోవడంతో తెలంగాణ బస్సులు కొద్ది రోజులుగా అక్కడి నుంచి ఖాళీగా రావాల్సి వస్తుంది. నల్లగొండ నుంచి కాకినాడకు వెళ్లే బస్సుకు, పరకాల నుంచి గుంటూరు వెళ్లే బస్సులకు కూడా అక్కడ ఇదే పరిస్థితి ఎదురవుతుంది.
 
 మేమేం తక్కువ...
 కోదాడ డిపో నుంచి విజయవాడకు నిత్యం నడిచే బస్సుల సిబ్బంది దీనిపై తీవ్రంగా స్పందించారు. కోదాడ బస్టాండ్‌లో మొత్తం 10 ప్లాట్ ఫాంలు ఉండగా బస్టాండ్ చివరి ప్లాట్ ఫాం ఒక్క దానిని మాత్రమే వారికి కేటాయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్  వెళ్లే బస్సులు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులన్నీ ఆ ఒక్క ప్లాట్ ఫాం మీద మాత్రమే ఆగాలి. దీంతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్టీసీ ఆర్డినరీ బస్సులు, విజయవాడ-కోదాడ షటిల్ బస్సులన్నింటికి ఇది ఒక్కటే కేటాయించారు.
 
 ఈ ప్లాట్‌ఫాం ఖాళీ లేకపోతే  దూరంగా చెట్ల కింద ప్రయాణికులను దింపి అక్కడి నుంచి అటే వెళ్లాల్సి వస్తుంది. ఇతర ప్లాట్ ఫాంలు ఖాళీగా ఉన్నా వీరి బస్సులను మాత్రం అక్కడ నిలపనీయకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఈ విధంగా ఆంధ్ర బస్సుల తాకిడి ఎక్కువగా ఉండే సూర్యాపేట, మిర్యాలగూడ, మల్లేపల్లి బస్టాండ్లలో ఆంధ్ర బస్సులకు ప్లాట్‌ఫాంల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. దీంతో ఇరు రాష్ట్రాల సిబ్బంది నిత్యం ప్లాట్‌ఫాంల విషయంలో గొడవ పడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆంధ్రా బస్సులకు ఒక ప్లాట్‌ఫాం కేటాయించాం
 కోదాడ బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంల కొరత ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కొన్ని బస్సులు వచ్చి ప్లాట్‌ఫాంలపై ఎక్కువ సమయం నిలపడం వల్ల కోదాడ డిపో బస్సులకు ప్లాట్‌ఫాం దొరకడం లే దు. వారి బస్సులు ఖాళీ ఉన్నప్పుడే బస్టాండ్‌కు వస్తున్నారు. నిండుగా ఉంటే బైపాస్‌లో వెళ్తున్నారు. ఈ సమస్యల వల్ల వారికి ఒక్క ప్లాట్ పాం కేటాయించాం. వారు అక్కడే నిలపాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడుపుతాం.
   - శ్రీనివాసరావు,కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement