నంబర్లు మారవు...
సిరీస్, జిల్లా కోడ్ మార్పు మాత్రం తప్పనిసరి!
పాత వాహనాలకు ఏపీ స్థానంలో టీఎస్
రవాణా శాఖతో సీఎం కేసీఆర్ సమీక్ష, గందరగోళానికి తెర
73 లక్షల వాహనాల నంబర్లు మార్చడం అసాధ్యమన్న అధికారులు
తొందరపాటు ప్రకటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల విషయంలో రాష్ర్ట ప్రభుత్వం నాలుక్కరుచుకుంది. ప్రస్తుతం ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల పాత వాహనాలకూ కొత్తగా టీఎస్ సిరీస్‌తో కొత్త నంబర్లు పొందాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కొత్త రాష్ట్రానికి కేటాయించిన టీఎస్ సిరీస్ నంబర్లను లక్షల సంఖ్యలో ఉన్న పాత వాహనాలకు అమలు చేయడం అసాధ్యమని రవాణా శాఖ అధికారులు గురువారం తేల్చి చెప్పడంతో సర్కారు పెద్దలు పునరాలోచన చేశారు. పాత వాహనాలకు కొత్త జిల్లా కోడ్‌తో పాటు ఏపీ బదులు టీఎస్ అని మార్చాల్సి ఉంటుందని, నంబర్ మాత్రం అదే కొనసాగుతుందని నిర్ధారించారు. 4 నెలల్లో పాత వాహనాలన్నింటికీ నంబర్లు మార్చాల్సిందేనని రవాణా శాఖ మంత్రి బుధవారం చేసిన ప్రకటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. సిరీస్‌తో పాటు నంబర్లూ మార్చుకోవడమేంటని, అందుకు తాము మళ్లీ జేబులు గుల్ల చేసుకోవడమేంటని వాహనదారులు నొసలు చిట్లించడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. అసలు దీన్ని అమలు చేయడమే కష్టమని అధికారులూ చెప్పడంతో ఈ విషయంలో నెలకొన్న గందరగోళానికి సీఎం తెరదించే ప్రయత్నం చేశారు. గురువారం సాయంత్రం ఆయన రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆ శాఖ కమిషనర్ జగదీశ్వర్, సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్లుతో సమీక్ష జరిపారు.
పాత వాహనాల నెంబర్ల నూ మార్చుకోవాలని ప్రకటించడమేంటని మంత్రి మహేందర్ రెడ్డిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే అధికారులు అందజేసిన సమాచారం మేరకే ప్రకటించాల్సి వచ్చిందని రవాణా మంత్రి చెప్పినట్టు సమాచారం. దీంతో అధికారులను కూడా కేసీఆర్ మందలించినట్టు తెలిసింది. కీలక విషయాలను ప్రకటించే సమయంలో ముం దస్తు కసరత్తు అవసరమని, లేదంటే ఇలాంటి గందరగోళ పరిస్థితులే నెలకొంటాయని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇకపై కొత్త వాహనాలకే టీఎస్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయాలని, పాత వాటికి కేవలం టీఎస్‌తో పాటు జిల్లా కోడ్‌ను మార్చితే సరిపోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. భారీ రుసుము చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, భారీ సంఖ్యలో ఉన్న పాత వాహనాల నంబర్ల మార్పు అంత సులభం కాదని, భారీ కసరత్తుతో కూడుకున్న వ్యవహారమని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. మరి అలాం టప్పుడు వాటిని మార్చుకోవాలని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిం దని కేసీఆర్ ప్రశ్నించడంతో అధికారులు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. కాగా, పాత జిల్లా కోడ్‌లనే కొనసాగించాలని అధికారులు సూచించినప్పటికీ సీఎం అంగీకరించనట్లు తెలిసిం ది. కొత్త రాష్ట్రంలో కొత్త కోడ్‌లు కేటాయిస్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని పై కసరత్తు ప్రారంభించామని ఈ భేటీ అనంతరం అధికారులు వెల్లడించారు. అయితే జిల్లాల పేర్ల ప్ర కారం అక్షర క్రమం ఆధారంగా కోడ్‌ను కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున ఏదో ఒక కోడ్ ఇవ్వడమే మేలని భావిస్తున్నట్లు తెలిపారు. కొత్త కోడ్‌లను 2రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామన్నారు.