మారుతున్న టీఎస్‌ఎస్పీ కానిస్టేబుళ్ల లీవ్ మాన్యువల్
నవంబర్ 1 నుంచి అమలుకు డిపార్ట్‌మెంట్ ఆదేశాలు
ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇదే కష్టంగా ఉందనుకుంటే మళ్లీ అమల్లోకి పాత పద్ధతి!
మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్న కానిస్టేబుళ్ల భార్యలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ)లో లీవ్ (సెలవు) మాన్యువల్ మరోసారి చర్చనీయాంశం కానుంది. గతంలో 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటమే ఇందుకు కారణం. వచ్చే నవంబర్ 1 నుంచి కొత్త మాన్యువల్ అమలు కానుండగా, తాజా నిబంధనలపై కానిస్టేబుళ్లలో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వారి కుటుంబాలు ప్రభుత్వం, అధికార వర్గా లపై మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ శ్రమ దోపి డీయేనని, బ్రిటిష్ కాలంనాటి చట్టాలను సవరించాల్సిందిపోయి, ఒత్తిడి మరింత పెంచేలా కొత్త విధానా లకు శ్రీకారం చుట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మళ్లీ పాత విధానం!
హైదరాబాద్‌తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 13 టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు ఉన్నాయి. దాదాపు 8 వేల మంది పోలీసులు వివిధ ర్యాంకుల్లో పనిచేస్తున్నారు. బెటాలియన్లలోని ప్రతి 12 మందిని ఒక ప్లటూన్ లేదా సెక్షన్ అని పిలుస్తారు. వీరిలో నలుగురు హెడ్‌క్వార్టర్‌కు అందుబాటులో ఉంటారు. మిగిలిన 8 మందికి ఈ లీవ్ మాన్యువల్ వర్తిస్తుంది. ఒకరు సెలవు తీసుకుంటే ఏడుగురు కచ్చితంగా విధుల్లో ఉండాలి. ఈ ఏడుగురు ఒకరి తర్వాత మరొకరు నాలుగు రోజుల చొప్పున సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 నుంచి 7వ కానిస్టేబుల్ వరకు నాలుగు రోజుల చొప్పున లీవు తీసుకున్నాక 8వ కానిస్టేబుల్‌కు అవకాశం వస్తుందన్నమాట. అంటే 28 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజుల సెలవు దొరుకు తుందన్నమాట. అంటే ప్రతి కానిస్టే బుల్ 28 రోజులకు ఒకసారి ఇంటికి వెళతారన్నమాట.
ఒక వేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే ఈ క్రమం దెబ్బతిని తదుపరి వ్యక్తి తీసుకోవాల్సిన సెలవు మరింత ఆల స్యం అవుతుంది. 2012 వరకు ఇలాంటి నిబంధనలే ఉండేవి. అయితే 2012 ఆగస్టు 5వ తేదీన తమ భర్తలు ఇంటికి రావడం లేదంటూ కొండాపూర్ బెటాలియన్ ఎదుట కానిస్టే బుళ్ల భార్యాపిల్లలు భారీయెత్తున ధర్నా నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లకు లీవుల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాన్యువల్‌లో మార్పులు చేసి ఒకసారి ఒక్కరిని కాకుండా ముగ్గురికి అవకా శం ఇవ్వడం ప్రారంభించారు. ఫలితంగా ప్రతి నెలా రెండుసార్లు అంటే 15 రోజులకు ఒకసారి ఇంట్లో వారిని చూసే అవకాశం కానిస్టేబుళ్లకు దక్కేది.
అగచాట్లు తప్పవా?
⇒ దాదాపుగా పాత పద్ధతి తరహాలోనే ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటంతో కానిస్టేబుళ్లతో పాటు వారి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వారాలకు వారాలు భర్తలు తమకు, పిల్లలకు దూరంగా ఉండేలా చేస్తు న్న నిబంధనలపై భార్యలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కాపురాల్లో కలహాలకు కారణమై విడాకుల వరకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే కుటుంబసభ్యులు అనా రోగ్యంతో బాధ పడుతున్నా ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉంటున్నామని కానిస్టే బుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా ఆదేశాలు అమలైతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అంటున్నారు. ఇంకోవైపు వీరికి స్థిరంగా విధులు ఎక్కడా ఉండక పోవడం కూడా వారిలో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రతి వారానికి లేదా 15 రోజులకు అప్పుడప్పుడూ ప్రతి రోజూ మారతాయి. ఇక సాధారణ ఎన్నికలు, విపత్తులు, అల్లర్లు చెలరేగినపుడు వీరంతా సెలవులు రద్దు చేసుకుని మరీ బందోబస్తు విధుల్లో కొనసాగాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త మాన్యువల్‌పై కానిస్టేబుళ్ల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్రిటిష్ కాలంలో రూపొందించిన చట్టాలను మార్చాలంటూ మరోసారి కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకోవాలి
⇒ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ బాధల్ని అసెంబ్లీ వేదికంగా లోకానికి చాటిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం సీఎం, హోంమంత్రిగా ఉన్నారని, ఆయన గతాన్ని గుర్తుచేసుకుని తమ విషయంలో పెద్దమనసు చేసుకో వాలని వారు కోరుతున్నారు. 26 రోజులకు ఒకసారి లీవు విధానం అమలు చేయకుండా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని, టీఎస్‌ఎస్‌పీ, సివిల్, ఏఆర్ బెటాలియన్లను కలిపి తమిళనాడు, కర్ణాటక తరహాలో ‘ఏక్ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేయాలని, కుటుంబాలతో ఒకేచోట 3 నుంచి ఐదేళ్లపాటు కలిసి ఉండే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment