ఆత్యయిక పరిస్థితుల్లో నిర్ణయాధికారం పోలీసులదే
దర్యాప్తులో శాస్త్రీయత, నిపుణతకు పెద్దపీట
పోలీసు కస్టడీ ఇకపై 15 రోజులకు పెంపు
హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల ఖైదు
చైన్ స్నాచింగ్, ఉగ్రవాదం, మూకదాడులకు ప్రత్యేక సెక్షన్లు
పెట్టీ కేసుల్లో నిందితులకు సామాజిక సేవ శిక్ష
కొత్త చట్టాలపై పోలీసులకు రేపటితో ముగియనున్న శిక్షణ తరగతులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు ఉత్పన్నమైనపుడు, పరిస్థితులను తమ ఆ«దీనంలోకి తెచ్చుకునేందుకు పోలీసులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారాలను కొత్త నేర న్యాయ చట్టాలు కల్పించనున్నాయి. గతంలో ఇలాంటి మెజిస్టీరియల్ పవర్స్ కేవలం జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోల చేతిలో ఉండేవి. ఉదాహరణకు 144 సెక్షన్ అమలు చేయాలన్నా వారి అనుమతి తప్పనిసరి.
కానీ, ఇప్పుడు ఆ అధికారాలను జిల్లాల్లో ఎస్పీలకు, నగరాల్లో డీసీపీ ర్యాంకు అధికారులకు కల్పిస్తూ కొత్త న్యాయ నేర చట్టాలను రూపొందించారు. ఈ చట్టాలు దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి పూర్తిస్థాయిలో అమలుకానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు యూనిట్లలో కొత్త చట్టాలపై రేపటితో శిక్షణ కార్యక్రమాలు ముగియనున్నాయి.
కానిస్టేబుళ్ల నుంచి ఇన్‌స్పెక్టర్ ర్యాంకు ఆఫీసర్ల వరకు సంబంధిత యూనిట్ పరిధిలో శిక్షణ ఇస్తున్నారు. ఏసీపీ ఆపై ర్యాంకు అధికారులకు మాత్రం తెలంగాణ పోలీసు అకాడమీ (టీజీపీఏ)లో ట్రైనింగ్ ఇచ్చారు.
కొత్తగా ఏ మార్పులు రానున్నాయి?
జూలై 1 నుంచి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లన్నీ కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా అధియాం (బీఎస్‌ఏ)లు రాబోతున్నాయి.
బ్రిటిష్ కాలంలో రూపొందించిన ఈ చట్టాలను మరింత బలోపేతం చేయడం, శాస్త్రీయ పద్ధతిలో మెరుగైన విధానంలో దర్యాప్తు జరపడం, నేరాలకు కఠిన శిక్షలు విధించడం, సెక్షన్లు లేని కొన్ని రకాల నేరాలకు ప్రత్యేక సెక్షన్లు తీసుకురావడం, దర్యాప్తు కాలానికి నిర్దేశిత కాలపరిమితి విధించడం, వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేకూర్చడం వంటి లక్ష్యాలతో కొత్త నేర న్యాయ చట్టాలకు అంకురార్పణ జరిగింది.
పెట్టీ నేరాలకు కమ్యూనిటీ సర్విస్..
కొత్త నేర న్యాయ చట్టాల ప్రకారం.. ఇకపై చిన్నతరహా (పెట్టీ క్రైమ్స్) నేరాలకు సమాజ సేవ చేసేలా శిక్షలు రూపొందించారు. ఉదాహరణకు న్యూసెన్స్, ఈవ్ టీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, కొట్లాటలు తదితర చిన్న నేరాలకు గతంలో జైలు, జరిమానాలు ఉండేవి. కొత్త చట్టాల ప్రకారం.. కమ్యూనిటీ సర్విస్ (సమాజసేవ) చేసేలా తీర్పులు రానున్నాయి.
మనిషి మానసికంగా పరివర్తన చెందేలా ఈ శిక్షలు ఉండనున్నాయి. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి తాగి నడిపితే జరిగే నష్టాలపై ప్రచారం, ఈవ్ టీజింగ్ చేస్తే మహిళల ఔన్నత్యం తెలియజేసేలా నిందితుల్లో సామాజిక, మానసిక మార్పునకు దారి తీసేలా తీర్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు.
కొత్త సెక్షన్లు.. భారీ శిక్షలు
గతంలో అనేక నేరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక సెక్షన్లు ఉండేవి కావు. ఉదాహరణకు గొలుసు దొంగతనాలు, మూకదాడులు, హిట్ అండ్ రన్, ఉగ్రవాద కార్యకలాపాల్లో సరిగ్గా సరిపోయే సెక్షన్లు ఉండేవి కావు. కానీ, జూలై 1 నుంచి ఇలాంటి నేరాలకు తగిన సెక్షన్లు రాబోతున్నాయి. వాటి ఆధారంగా గతంలో విధించిన జైలు శిక్ష కంటే రెట్టింపు కూడా ఉండనుంది. ఉదాహరణకు గతంలో హిట్ అండ్ రన్ కేసుల్లో గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడేది. తాజా చట్టాలతో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడనుంది.
» పోలీసు కస్టడీ కూడా మరింత పెరగనుంది. గరిష్టంగా 15 రోజుల వరకు నిందితులను రిమాండ్‌లోకి తీసుకోవచ్చు. రిమాండ్ అయిన 60 రోజుల్లోగా ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు పోలీసులకు కలగనుంది.
» దర్యాప్తులో శాస్త్రీయ, నిపుణులు ఇచ్చే రిపోర్టులకు పెద్దపీట వేయనున్నారు.
» కేసు దర్యాప్తును కూడా నిర్దేశిత కాలంలో పూర్తి చేయనున్నారు. ఉదాహణకు పోక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి. మిగిలిన కేసుల్లో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిïÙటు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకపరిస్థితుల్లో మాత్రం ఈ కాలపరిమితికి మినహాయింపు దక్కనుంది.
»ఇక స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడ నుంచైనా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు, ఆన్‌లైన్‌లో వారంట్ జారీ
» పిల్లలు, వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యం ఉన్న వారు స్టేషన్ హాజరు నుంచి మినహాయింపు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment