పకడ్బందీగా పంట నష్టాల గణన
కలెక్టర్లతో సీఎం కిరణ్ వీడియో కాన్ఫరెన్స్
అర్హుల్లో ఒక్కరికీ అన్యాయం జరగరాదని ఆదేశం
పెట్టుబడి రాయితీ బకాయిలు రూ. 437 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలవల్ల కలిగిన నష్టాలపై తప్పులకు ఏమాత్రం అవకాశం లేకుండా పకడ్బందీగా నష్టాల గణన చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పై-లీన్, హెలెన్ తుపానులతో నష్టాలు, సహాయ కార్యక్రమాలపై సీఎం శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. వారం రోజుల్లోగా నష్టాల లెక్కింపు పూర్తి చేసి తుది నివేదిక పంపించాలని, పంట నష్టపోయిన ఒక్క రైతు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ‘విపత్తుల వల్ల చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు అన్నింటికీ పరిహారం ఇవ్వాలి. రైతుల వారీగా, పంటల వారీగా నష్టాల నివేదిక తయారీలో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వరాదు. బాధితుల పేర్లలో పది శాతాన్ని సీనియర్ అధికారులతో తనిఖీ చేయించండి. నివేదికలు రూపొందించిన వారు, తనిఖీ చేసిన అధికారుల పేర్లను కూడా పొందుపరచండి. ఎక్కడైనా తప్పు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులనే బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకోండి. మార్పు చేర్పులకు అవకాశం ఉండదు. ఒకేసారి పక్కాగా పరిశీలించి నష్టాలపై బాధితుల జాబితాతో నివేదికలు సమర్పించండి. మత్స్యకారులకు పరిహారం బకాయిలను తక్షణమే విడుదల చేస్తాం. నీలం తుపాను, కరువుకు సంబంధించి పెండింగులో ఉన్న పెట్టుబడి రాయితీ బకాయిలు రూ. 437 కోట్లు తక్షణమే తక్షణమే విడుదల చేస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. కాగా, నష్టాల మదింపు త్వరగా పూర్తి చేసి రైతులకు కావాల్సిన విత్తనాలపై నివేదికలు ఇస్తే సరఫరాకు కార్యాచరణ రూపొందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
అటవీ దోపిడీపై కఠిన కేసులు: సీఎం కిరణ్
అమూల్యమైన అటవీసంపదను దోచేవారిపై, చెట్లను నరికేవారిపై హత్యకేసు(302 సెక్షన్) కన్నా పటిష్టమైన కేసులు పెట్టాలని, ఇందుకు అవసరమైతే చట్టాలు కూడా మార్చుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర అటవీశాఖ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ‘అటవీ ప్రాంతాల్లోని అసాంఘిక శక్తులు, నేరగాళ్ల ముఠాలు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపండి. ప్రభుత్వం తగినంత సాయం చేస్తుంది’ అని ఆయన అధికారులకు హామీ ఇచ్చారు. అటవీ సంపద విధ్వంసాన్ని నివారించేందుకు అధికారులు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించా రు. అడవుల్లో నివసించే వారికి, అధికారుల మధ్య, అటవీ ఉత్పత్తుల విషయమై ఏర్పడే వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అటవీ నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాలని, అవసరమైన మార్పులు తీసుకురావాలని అటవీశాఖ మంత్రి శత్రుచర్ల సూచించారు.