Phailin Cylone
-
పకడ్బందీగా పంట నష్టాల గణన
కలెక్టర్లతో సీఎం కిరణ్ వీడియో కాన్ఫరెన్స్ అర్హుల్లో ఒక్కరికీ అన్యాయం జరగరాదని ఆదేశం పెట్టుబడి రాయితీ బకాయిలు రూ. 437 కోట్లు విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలవల్ల కలిగిన నష్టాలపై తప్పులకు ఏమాత్రం అవకాశం లేకుండా పకడ్బందీగా నష్టాల గణన చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పై-లీన్, హెలెన్ తుపానులతో నష్టాలు, సహాయ కార్యక్రమాలపై సీఎం శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. వారం రోజుల్లోగా నష్టాల లెక్కింపు పూర్తి చేసి తుది నివేదిక పంపించాలని, పంట నష్టపోయిన ఒక్క రైతు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ‘విపత్తుల వల్ల చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు అన్నింటికీ పరిహారం ఇవ్వాలి. రైతుల వారీగా, పంటల వారీగా నష్టాల నివేదిక తయారీలో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వరాదు. బాధితుల పేర్లలో పది శాతాన్ని సీనియర్ అధికారులతో తనిఖీ చేయించండి. నివేదికలు రూపొందించిన వారు, తనిఖీ చేసిన అధికారుల పేర్లను కూడా పొందుపరచండి. ఎక్కడైనా తప్పు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులనే బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకోండి. మార్పు చేర్పులకు అవకాశం ఉండదు. ఒకేసారి పక్కాగా పరిశీలించి నష్టాలపై బాధితుల జాబితాతో నివేదికలు సమర్పించండి. మత్స్యకారులకు పరిహారం బకాయిలను తక్షణమే విడుదల చేస్తాం. నీలం తుపాను, కరువుకు సంబంధించి పెండింగులో ఉన్న పెట్టుబడి రాయితీ బకాయిలు రూ. 437 కోట్లు తక్షణమే తక్షణమే విడుదల చేస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. కాగా, నష్టాల మదింపు త్వరగా పూర్తి చేసి రైతులకు కావాల్సిన విత్తనాలపై నివేదికలు ఇస్తే సరఫరాకు కార్యాచరణ రూపొందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అటవీ దోపిడీపై కఠిన కేసులు: సీఎం కిరణ్ అమూల్యమైన అటవీసంపదను దోచేవారిపై, చెట్లను నరికేవారిపై హత్యకేసు(302 సెక్షన్) కన్నా పటిష్టమైన కేసులు పెట్టాలని, ఇందుకు అవసరమైతే చట్టాలు కూడా మార్చుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర అటవీశాఖ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ‘అటవీ ప్రాంతాల్లోని అసాంఘిక శక్తులు, నేరగాళ్ల ముఠాలు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపండి. ప్రభుత్వం తగినంత సాయం చేస్తుంది’ అని ఆయన అధికారులకు హామీ ఇచ్చారు. అటవీ సంపద విధ్వంసాన్ని నివారించేందుకు అధికారులు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించా రు. అడవుల్లో నివసించే వారికి, అధికారుల మధ్య, అటవీ ఉత్పత్తుల విషయమై ఏర్పడే వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అటవీ నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాలని, అవసరమైన మార్పులు తీసుకురావాలని అటవీశాఖ మంత్రి శత్రుచర్ల సూచించారు. -
మళ్లీ వాయు‘గండం’!
సాక్షి, విశాఖపట్నం : పై-లీన్ తుపాను గండం మరువకముందే మరో గండం వచ్చి పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఆగ్నేయ/నైరుతి బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైంది. రానున్న 48 గంటల్లో అది మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు తూర్పు ఆగ్నేయ దిశగా నెల్లూరు ప్రాంతానికి 680 కి.మీ. దూరంలో, చెన్నైకు కూడా అదే దిశలో 600కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. అది క్రమంగా పశ్చిమ దిశగా దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా మారి ఈనెల 16వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు తీరం వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. -
మళ్లీ మనుగుడే!
* పరిహారం పరిహాసమేనా * రైతులకు పంట నష్ట పరిహారం చెల్లింపులో సర్కారు నిర్లక్ష్యం * 2009 నుంచి 2013 వరకు పలుమార్లు ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించినా రూపాయి కూడా ఇవ్వని వైనం * రూ.700 కోట్ల మేరకు బకాయిలు * పంట నష్ట పరిహారాన్ని గణనీయంగా తగ్గించేస్తున్న వైనం * నీలం తుపాను నష్టం అంచనా 1,600 కోట్లు కాగా రూ.428 కోట్లకు తగ్గింపు! సాక్షి, హైదరాబాద్: పంట నష్ట పరిహారం పేరుతో రెతులతో పరిహాసమాడటానికి ప్రభుత్వం మరోమారు సిద్ధమవుతోంది. వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టాన్ని తీరికగా పరిశీలించడం, తర్వాత పంట నష్టం అంచనాలను సగానికి సగం తగ్గించి నివేదికలు తయారు చేయడం సర్కారుకు పరిపాటి అయ్యింది. తగ్గించిన మేరకైనా పరిహారం వెంటనే ఇస్తున్నారా..? అంటే అదీ లేదు. 2010, 2011 సంవత్సరాలకు సంబంధించిన పంట నష్ట పరిహార మే ఇప్పటివరకు అందలేదంటే రైతు సంక్షేమంపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. గత ఏడాది ‘నీలం’ తుపానుతో రూ.1,600 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాల మేరకు ప్రభుత్వం పేర్కొంది. అయితే తుది నివేదికలో ఈ నష్టాన్ని రూ.428 కోట్లకు కుదించేశారు. కుదించిన మేరకైనా మొత్తం రైతులకు ఇవ్వలేదు. ఇప్పటికీ రూ.56 కోట్లు చెల్లించలేదని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ఈ విధంగా రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇప్పటికే సుమారు రూ.700 కోట్లకు చేరుకున్నాయి. ఇక పై-లీన్, ఆ వెనువెంటనే కురిసిన కుండపోత వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 28.43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్వయసాయ శాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించింది. తీరిగ్గా బాధితుల పరామర్శకు, రైతులు నష్టపోయిన పంటల పరిశీలనకు వస్తున్న ప్రభుత్వాధినేతలు ప్రతి రైతుకూ పరిహారం అందిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే తుది నివేదికలు తయారయ్యేటప్పటికి నష్టం అంచనాను ఎంత మేరకు కుదిస్తారో? ఎంత పరిహారం ఎన్నేళ్లకు ఇస్తారో? అని గత అనుభవాల దృష్ట్యా రైతుల్లో నిరాశానిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. నెరవేరని లక్ష్యం ఊహించని ప్రకృతి వైపరీత్యాల కారణంగా సాగు చేసిన పంట నష్టపోతే, మళ్లీ పంట సాగు చేసే సామర్థ్యం బడుగు రైతుకు ఉండదు. అలా అని రైతు కాడీ-మేడీ కిందపడేస్తే దేశానికి పూట గడవదు. ‘ఆహార భద్రత’ వంటి తాజా పథకాలకూ భద్రత కరువవుతుంది. ఈ కారణంగానే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతుకు ‘ఇన్-పుట్ సబ్సిడీ’ పేరుతో ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తాయి. ఒక పంట నష్టపోయిన రైతుకు వెంటనే మళ్లీ రెండో పంట సాగు కోసం ఆసరా కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఇన్పుట్ సబ్సిడీ (పరిహారం).. ప్రకటించిన తర్వాత ఏళ్లు గడుస్తున్నా రైతుకు అందని పరిస్థితుల్లో.. ‘పంట నష్టపరిహారం’లోని అసలు లక్ష్యమే నెరవేరకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిహారంపై ప్రగల్భాలు... నష్టం అంచనాలో కోతలు! రైతుకు పంటనష్ట పరిహారాన్ని హెక్టారుకు రూ.10 వేలకు పెంచిన ఘనత తమదే అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి వంటివారు గొప్పగా చెప్పుకుంటున్నారు. 2012 నీలం తుపాను సమయంలో పంట పరిహారాన్ని హెక్టారుకు రూ.10 వేలకు ప్రభుత్వం పెంచింది. అయితే ఇదే సమయంలో నీలం తుపాను పంట నష్టం అంచనాలను మూడొంతులు తగ్గించి వేసింది. రూ.1600 కోట్ల పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తే తుది నివేదిక వచ్చేసరికి నష్టం అంచనా గణనీయంగా రూ.428 కోట్లకు తగ్గిపోయింది. వరంగల్, నల్గొండ లాంటి జిల్లాల్లో నీలం దెబ్బకు వేల ఎకరాల్లో పత్తిపైరుదెబ్బ తిన్నా తుది అంచనాల్లో ‘పత్తి’ నష్టం ఊసు లేనేలేదు. పంటనష్టం చెల్లింపును రూ.10 వేలకు పెంచామని చెప్పుకుంటూ మరోవైపు నష్టం అంచనాలను మూడొంతులు తగ్గించేసిన ప్రభుత్వం పంట నష్టం చెల్లింపులను పెంచినట్టా? తగ్గించినట్లా? అని పలు రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏటా బయటపడుతున్న ప్రభుత్వ ‘రంగు’ తుపానులు, భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ పంట నష్టం పరిహారంతో పాటు ప్రభుత్వం ఇచ్చే హామీ మరోటి ఉంది. అది ‘తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం’ అని. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రంగుమారిన ధాన్యాన్ని కొన్న సందర్భం ఒక్కటి కూడా కనిపించదు. గత నీలం తుపాను సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పౌర సరఫరాల మంత్రి శ్రీధర్ బాబు రైతుల వద్ద ఉన్న రంగుమారిన ధాన్యం, పత్తి కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. 2010లో ‘జల్’ తుపాను సందర్భంగా కూడా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యం రంగుమారిందని అధికారులు అంచనా వేశారు. చివరకు ప్రభుత్వం కొన్నది కేవలం 23వేల టన్నుల ధాన్యం మాత్రమే. నీలం తుపాను కారణంగా రంగు మారిన పత్తిని ఒక్క క్వింటాలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. పెపైచ్చు మంచి పత్తికి కూడా కనీస మద్దతు ధర లభించని పరిస్థితుల్లో రైతులను ప్రైవేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు ప్రభుత్వం వదిలేసింది. నోటితో పలుకరించి...నొసటితో వెక్కిరించడమే.. పంట నష్ట పరిహారాన్ని రూ.10 వేలకు పెంచామని ఒక వైపు చెప్పుకుంటూ, మరో వైపు నష్టం అంచనాలను తగ్గించడం, ప్రకటించిన పరిహారాన్ని సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు ఇవ్వకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం రైతులను ‘నోటితో పలుకరించి.. నొసటితో వెక్కిరిస్తోంది’ అని అనిపిస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిహారం ఎప్పటికప్పుడు చెల్లించేవారు. ఆయన మరణించిన 2009 నుంచి ఈ పంట నష్టం బకాయిలు పేరుకు పోతున్నాయి. - వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి -
అన్నదాతపై తుపాను దెబ్బ
వజ్రపుకొత్తూరు, న్యూస్‌లైన్: పై-లీన్, అల్పపీడనంతో కురిసిన వర్షాలకు రైతులు మరో ఐదేళ్లపాటు తేరుకోలేరని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కణితి విశ్వనాథం అన్నారు. మండలంలోని వజ్రపుకొత్తూరు, కిడిసింగి, నువ్వలరేవు, తాడివాడ, నగరంపల్లి గ్రామాలలో ఆయన శుక్రవారం పర్యటించి పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంపల్లి, గల్లి, బెండి, మహదేవుపురం, బట్టుపాడు, అనంతగిరి, వెంకటాపురం, గుల్లలపాడు, పూడిలంక తదితర గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయని, వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఆయా పంచాయతీల సర్పంచ్‌లు దువ్వాడ విజయలక్ష్మి, నర్తు చినబాబు, బెహరా ధర్మారావు, దువ్వాడ శార్వాణి, పోతనపల్లి లక్ష్మీకాంతంలతో పాటు గ్రామాలలోని రైతులు కలిసి పంట నష్టాలను వివరించారు. కార్యక్రమంలో బమ్మిడి కృష్ణారావు, కంచరాన బుజ్జి, పైల నరసింహామూర్తి, తమ్మినాన విఘ్నేశం, దువాడ ఉమామహేశ్వరరావులున్నారు.