మళ్లీ మనుగుడే!
* పరిహారం పరిహాసమేనా
* రైతులకు పంట నష్ట పరిహారం చెల్లింపులో సర్కారు నిర్లక్ష్యం
* 2009 నుంచి 2013 వరకు పలుమార్లు ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించినా రూపాయి కూడా ఇవ్వని వైనం
* రూ.700 కోట్ల మేరకు బకాయిలు
* పంట నష్ట పరిహారాన్ని గణనీయంగా తగ్గించేస్తున్న వైనం
* నీలం తుపాను నష్టం అంచనా 1,600 కోట్లు కాగా రూ.428 కోట్లకు తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: పంట నష్ట పరిహారం పేరుతో రెతులతో పరిహాసమాడటానికి ప్రభుత్వం మరోమారు సిద్ధమవుతోంది. వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టాన్ని తీరికగా పరిశీలించడం, తర్వాత పంట నష్టం అంచనాలను సగానికి సగం తగ్గించి నివేదికలు తయారు చేయడం సర్కారుకు పరిపాటి అయ్యింది. తగ్గించిన మేరకైనా పరిహారం వెంటనే ఇస్తున్నారా..? అంటే అదీ లేదు. 2010, 2011 సంవత్సరాలకు సంబంధించిన పంట నష్ట పరిహార మే ఇప్పటివరకు అందలేదంటే రైతు సంక్షేమంపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.
గత ఏడాది ‘నీలం’ తుపానుతో రూ.1,600 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాల మేరకు ప్రభుత్వం పేర్కొంది. అయితే తుది నివేదికలో ఈ నష్టాన్ని రూ.428 కోట్లకు కుదించేశారు. కుదించిన మేరకైనా మొత్తం రైతులకు ఇవ్వలేదు. ఇప్పటికీ రూ.56 కోట్లు చెల్లించలేదని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ఈ విధంగా రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ఇప్పటికే సుమారు రూ.700 కోట్లకు చేరుకున్నాయి.
ఇక పై-లీన్, ఆ వెనువెంటనే కురిసిన కుండపోత వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 28.43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్వయసాయ శాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించింది. తీరిగ్గా బాధితుల పరామర్శకు, రైతులు నష్టపోయిన పంటల పరిశీలనకు వస్తున్న ప్రభుత్వాధినేతలు ప్రతి రైతుకూ పరిహారం అందిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే తుది నివేదికలు తయారయ్యేటప్పటికి నష్టం అంచనాను ఎంత మేరకు కుదిస్తారో? ఎంత పరిహారం ఎన్నేళ్లకు ఇస్తారో? అని గత అనుభవాల దృష్ట్యా రైతుల్లో నిరాశానిస్పృహలు వ్యక్తమవుతున్నాయి.
నెరవేరని లక్ష్యం
ఊహించని ప్రకృతి వైపరీత్యాల కారణంగా సాగు చేసిన పంట నష్టపోతే, మళ్లీ పంట సాగు చేసే సామర్థ్యం బడుగు రైతుకు ఉండదు. అలా అని రైతు కాడీ-మేడీ కిందపడేస్తే దేశానికి పూట గడవదు. ‘ఆహార భద్రత’ వంటి తాజా పథకాలకూ భద్రత కరువవుతుంది. ఈ కారణంగానే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతుకు ‘ఇన్-పుట్ సబ్సిడీ’ పేరుతో ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తాయి. ఒక పంట నష్టపోయిన రైతుకు వెంటనే మళ్లీ రెండో పంట సాగు కోసం ఆసరా కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఇన్‌పుట్ సబ్సిడీ (పరిహారం).. ప్రకటించిన తర్వాత ఏళ్లు గడుస్తున్నా రైతుకు అందని పరిస్థితుల్లో.. ‘పంట నష్టపరిహారం’లోని అసలు లక్ష్యమే నెరవేరకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిహారంపై ప్రగల్భాలు... నష్టం అంచనాలో కోతలు!
రైతుకు పంటనష్ట పరిహారాన్ని హెక్టారుకు రూ.10 వేలకు పెంచిన ఘనత తమదే అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి వంటివారు గొప్పగా చెప్పుకుంటున్నారు. 2012 నీలం తుపాను సమయంలో పంట పరిహారాన్ని హెక్టారుకు రూ.10 వేలకు ప్రభుత్వం పెంచింది.
అయితే ఇదే సమయంలో నీలం తుపాను పంట నష్టం అంచనాలను మూడొంతులు తగ్గించి వేసింది. రూ.1600 కోట్ల పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తే తుది నివేదిక వచ్చేసరికి నష్టం అంచనా గణనీయంగా రూ.428 కోట్లకు తగ్గిపోయింది.
వరంగల్, నల్గొండ లాంటి జిల్లాల్లో నీలం దెబ్బకు వేల ఎకరాల్లో పత్తిపైరుదెబ్బ తిన్నా తుది అంచనాల్లో ‘పత్తి’ నష్టం ఊసు లేనేలేదు.
పంటనష్టం చెల్లింపును రూ.10 వేలకు పెంచామని చెప్పుకుంటూ మరోవైపు నష్టం అంచనాలను మూడొంతులు తగ్గించేసిన ప్రభుత్వం పంట నష్టం చెల్లింపులను పెంచినట్టా? తగ్గించినట్లా? అని పలు రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఏటా బయటపడుతున్న ప్రభుత్వ ‘రంగు’
తుపానులు, భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ పంట నష్టం పరిహారంతో పాటు ప్రభుత్వం ఇచ్చే హామీ మరోటి ఉంది. అది ‘తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం’ అని. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రంగుమారిన ధాన్యాన్ని కొన్న సందర్భం ఒక్కటి కూడా కనిపించదు.
గత నీలం తుపాను సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పౌర సరఫరాల మంత్రి శ్రీధర్ బాబు రైతుల వద్ద ఉన్న రంగుమారిన ధాన్యం, పత్తి కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. 2010లో ‘జల్’ తుపాను సందర్భంగా కూడా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యం రంగుమారిందని అధికారులు అంచనా వేశారు. చివరకు ప్రభుత్వం కొన్నది కేవలం 23వేల టన్నుల ధాన్యం మాత్రమే.
నీలం తుపాను కారణంగా రంగు మారిన పత్తిని ఒక్క క్వింటాలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. పెపైచ్చు మంచి పత్తికి కూడా కనీస మద్దతు ధర లభించని పరిస్థితుల్లో రైతులను ప్రైవేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు ప్రభుత్వం వదిలేసింది.
నోటితో పలుకరించి...నొసటితో వెక్కిరించడమే..
పంట నష్ట పరిహారాన్ని రూ.10 వేలకు పెంచామని ఒక వైపు చెప్పుకుంటూ, మరో వైపు నష్టం అంచనాలను తగ్గించడం, ప్రకటించిన పరిహారాన్ని సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు ఇవ్వకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం రైతులను ‘నోటితో పలుకరించి.. నొసటితో వెక్కిరిస్తోంది’ అని అనిపిస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిహారం ఎప్పటికప్పుడు చెల్లించేవారు. ఆయన మరణించిన 2009 నుంచి ఈ పంట నష్టం బకాయిలు పేరుకు పోతున్నాయి.
- వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి