compensation for crops
-
బీమా లేక రైతు డీలా...
సాక్షి, హైదరాబాద్ : పంటల బీమా లేక రైతులు ఉసూరుమంటున్నారు. పంట నష్టపోయినా.. పరిహారం అందే పరిస్థితి లేక దిగాలు పడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినా పరిహారం దక్కని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ ఏడాది ఆగస్టులో 3.57 లక్షల ఎకరాలు, సెప్టెంబర్‌లో 1.92 లక్షల ఎకరాలు, అక్టోబర్‌లో 7.35 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతుకు అనుకూలంగా లేదన్న భావనతో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల నుంచి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చేసింది. అయితే, దీనికి తగిన ప్రత్యామ్నాయం మాత్రం కరువైంది. దీంతో పంట పండిస్తే ఇక అమ్ముకునే వరకు రైతులు దేవుడిపైనే భారం వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు కేంద్రం అమలు చేసిన బీమా పథకాలు రైతులకు నష్టం చేకూర్చడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చిందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పలు ఇతర రాష్ట్రాలూ ఈ ఏడాది నుంచి ఆ బీమా పథకాల నుంచి బయటకు వచ్చాయని అధికారులు అంటున్నారు. బీమా కంపెనీల దోపిడీ పర్వం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన బీమా పథకం ద్వారా బీమా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడంపైనే దృష్టిసారించాయి. దీంతో తెలంగాణ నుంచి కోట్ల రూపాయల లబ్ధిపొందాయి. లాభాలు గణనీయంగా ఉన్నా బీమా కంపెనీలు ఏటేటా ప్రీమియం రేట్లను భారీగా పెంచాయి. రైతుల నుంచి ప్రీమియం పేరిట భారీగా గుంజుతున్న బీమా కంపెనీలు పరిహారాన్ని మాత్రం అంతంతగానే విదుల్చుతున్నాయి. ఒక్క 2015–16 సంవత్సరం మినహా మిగతా ఏ ఏడాదీ రైతులకు పరిహారం సరిగా అందిన దాఖలాల్లేవు. తెలంగాణలో రబీలో చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు బీమా కంపెనీలను బాగు చేయడానికే అన్నట్లుగా అమలవుతోంది. ప్రైవేటు బీమా సంస్థలకు పంటల బీమా పథకంలో అవకాశం కల్పించడంతో పరిస్థితి మరింత దిగజారింది. పీఎంఎఫ్‌బీవై కింద రైతులు వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రెండు శాతం, పసుపు రైతులు ఐదు శాతం ప్రీమియం చెల్లించారు. పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, మిరప, ఆయిల్‌పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతం ప్రీమియం చెల్లించారు. పైగా జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుండేవి. ఉదాహరణకు 2018లో పెసరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో హెక్టారుకు ప్రీమియం సొమ్ము రూ.24,165, మిరపకు అత్యధికంగా రూ.38,715గా ఖరారు చేశారు. ఇంత దారుణంగా ప్రీమియం రేట్లు ఉండటంతో రైతులు కూడా పంటల బీమాపై విసుగు చెందారు. అలాగే వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనలతో బీమా నష్టపరిహారం పొందడం గగనమైంది. విచిత్రమేంటంటే ఇప్పటికీ గతంలో చెల్లించిన బీమా పరిహారం బకాయిలను కంపెనీలు తీర్చలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. 2018–19, 2019–20 సంవత్సరాలకు రైతులు పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించారు. అందుకోసం ఆ రెండేళ్లకు కలిపి బీమా కంపెనీలు రూ.800 కోట్లు రైతులకు క్లెయిమ్స్ కింద సొమ్ము చెల్లించాల్సి ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నిసార్లు విన్నవించినా ఆ సొమ్ము ఇవ్వడంలో కొర్రీలు పెడుతున్నాయని అంటున్నారు. నష్టపోయిన రైతులు ఆ పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో రైతు యూనిట్‌గా పంటల బీమా? కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న బీమా పథకాలు కంపెనీలను బాగు చేసేవిగా ఉన్నాయన్న అభిప్రాయంతో వ్యవసాయశాఖ వర్గాలున్నాయి. అందువల్ల ఆ పథకాల నుంచి ప్రభుత్వం బయటకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ బీమా పథకాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గతంలో వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. రైతు యూనిట్‌గా దీన్ని తీసుకురావాలని అప్పట్లో భావించినా, ఇప్పటికీ దానికి ఎలాంటి రూపురేఖలూ ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వ్యక్తిగత బీమా పథకాన్ని అమలుచేస్తోంది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా అందేలా ఈ పథకం అమలవుతుంది. ఇది పకడ్బందీగా అమలవుతుండటంతో, పంటల బీమా పథకాన్ని కూడా ప్రవేశపెడితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులెవరూ నోరు మెదపట్లేదు. ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయని అధికారులు అంటున్నారు. ఆ విషయం తెలియదు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకాల నుంచి అనేక రాష్ట్రాలు బయటకు వచ్చాయి. మన రాష్ట్రం సహా పంజాబ్, జార్ఖండ్, గుజరాత్, పశ్చిమబెంగాల్ ఈ ఏడాది నుంచి పీఎంఎఫ్‌బీవై, పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాల నుంచి వైదొలిగాయి. ఈ బీమా పథకాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని రూపొందించాలన్న విషయం నా పరిధిలోనిది కాదు. గతంలో ఎలాంటి కసరత్తు జరిగిందో తెలియదు. – జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయశాఖ -
పరిహారం అందేనా?
ఖమ్మంవ్యవసాయం: అయితే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి..ఇదీ ఈ ఏడాది ఖరీఫ్ పరిస్థితి. సీజన్ ఆరంభంలో మోస్తరుగా కురిసి.. తర్వాత ముఖం చాటేసి, కొన్ని పంటలు ఎదుగుతున్న క్రమంలో, మరికొన్ని పైర్లు చేతికొచ్చే సమయంలో.. ఎడతెరిపి లేకుండా పడిన వానలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ఆగస్టులో జిల్లాలో రోజుల తరబడి సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైంది. పంటలు నీటమునిగి లోతట్టు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటనష్టంపై అంచనా వేసిన వ్యవసాయశాఖ పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోంది. అధికారులు ప్రభుత్వానికి పంటనష్టంపై నివేదిక పంపిన కొన్ని రోజులకే అసెంబ్లీ రద్దు కావడంతో అసలు పరిహారం అందుతుందా? లేదా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. నాడు సంభవించిన అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో జిల్లాలో దాదాపు 20రోజుల పాటు రెట్టింపు వానలు పడ్డాయి. దీంతో వాగులు.... వంకలు పొంగిపొర్లాయి. అంతేగాక చెరువులు, రిజర్వాయర్లు అలుగుపడ్డాయి. ఫలితంగా పల్లపు ప్రాంతాల్లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లాలో ప్రధానంగా సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు జలమయమయ్యా యి. పెసర పంట మాత్రం చేతికొచ్చే సమయంలో పనికిరాకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యానికి పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం స్పందించింది. వెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని ఆదేశించింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా సమగ్రంగా పంటనష్టాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వాగులు, చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతా లతోపాటు వరద తాకిడికి కోతకు గురై.. ఇసుక మేటలకు గురై.. 33శాతం నష్టపోయిన పంటలను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు నివేదికను రూపొందించారు. నెలలు గడుస్తున్నా.. అధికార యంత్రాంగం పంటనష్టంపై నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి నెలలు గడుస్తున్నా.. పరిహారం ఇంకా మంజూరు కాలేదు. నివేదిక అందించిన కొద్దిరోజులకే అసెంబ్లీ రద్దు కావడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా నుంచి వెళ్లిన నివేదికలు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయంలో మూలుగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా కూడా ఈ సమస్యను అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో మండల వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 4,079 హెక్టార్లలో నష్టం.. జిల్లాలో మొత్తం 4,079 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. అధికంగా పెసర దాదాపు 1800 హెక్టార్లు. తిరుమలాయపాలెం మండలంలోనే ఈ పంటకు బాగా నష్టం వాటిల్లింది. నీటి పారుదల కింద సాగు చేసిన వరి 1,000 హెక్టార్లలో, పత్తి 700 హెక్టార్లలో, 600 హెక్టార్లలో మొక్కజొన్న, మినుము పంటలు దెబ్బతిన్నాయి. వరికి హెక్టారుకు రూ.13,500, మొక్కజొన్నకు రూ. 8,333, పత్తికి రూ. 13,500, పెసరకు రూ. 13,500 పరిహారం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. పత్తి నీటమునిగి దెబ్బతింది.. అధిక వర్షాల కారణం గా చెరువు వెంబడి ఉన్న ఎకరం పత్తి 10 రోజులు నీటిలో మునిగి పూర్తిగా దెబ్బతింది. దీంతో పంటను వదిలేశా. అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. కానీ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. పరిహారం ఇస్తారో.. ఇవ్వరో.. అర్థం కావట్లేదు. – చోడపోయిన సంగం, కమలాపురం, ముదిగొండ మండలం పెసర కోతదశలో వర్షాలపాలైంది.. 10 ఎకరాల్లో పెసర పంట వేశా. ఆగస్టులో వచ్చిన వానలకు కోతదశలో నీటిపాలైంది. దీంతో పూర్తిగా పనికి రాకుండా పోయింది. పెట్టుబడి దాదాపు రూ.లక్ష వరకు పెట్టా. అధికారులు వచ్చి పంట నష్టానికి సంబంధించి రాసుకొని వెళ్లారు. ఇంత వరకు పరిహారం ముట్టలేదు. – కొప్పుల రాంరెడ్డి, బీరోలు, తిరుమలాయపాలెం మండలం -
ఎండిన పంటలకు పరిహారం అందించాలి
పంటలను పరిశీలించిన తెలంగాణ రైతు సంఘం జనగామ : వర్షాభావ పరిస్థితుల్లో ఖరీ ఫ్లో రైతులు సాగు చేసిన ఎండిన పం టలకు ప్రభుత్వం పరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంత చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని వడ్లకొండ, గానుగుపహాడ్, మరిగడి, చౌడారం గ్రామాల్లో ఆదివారం రైతు సంఘం బృందం ఎండిన పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, పెసర, సోయ, నువ్వు లు, బొబ్బెర పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. ప్రభుత్వం రెవెన్యూ అధికారులచే ఎండిన పంటలను ఎన్యుమరేషన్ చేయించి, ఎకరాకు రూ.30వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తుందన్నారు. ప్రతిఏటా ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే విధంగా ఉన్న పరిస్థితుల్లో, దిగుమతి చేసుకునే దుస్థితికి దిగజారామన్నారు. మోకు కనకారెడ్డి, సాదం జంపన్న, రమావత్ మిట్యానాయక్, సికిందర్, కొమురయ్య, సత్తెయ్య, రాజు, శ్రీరాములు, బోడరాములు, సిద్దులు, రా ములు, దుర్గాప్రసాద్, ఎల్లయ్య ఉన్నారు. -
మళ్లీ మనుగుడే!
* పరిహారం పరిహాసమేనా * రైతులకు పంట నష్ట పరిహారం చెల్లింపులో సర్కారు నిర్లక్ష్యం * 2009 నుంచి 2013 వరకు పలుమార్లు ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించినా రూపాయి కూడా ఇవ్వని వైనం * రూ.700 కోట్ల మేరకు బకాయిలు * పంట నష్ట పరిహారాన్ని గణనీయంగా తగ్గించేస్తున్న వైనం * నీలం తుపాను నష్టం అంచనా 1,600 కోట్లు కాగా రూ.428 కోట్లకు తగ్గింపు! సాక్షి, హైదరాబాద్: పంట నష్ట పరిహారం పేరుతో రెతులతో పరిహాసమాడటానికి ప్రభుత్వం మరోమారు సిద్ధమవుతోంది. వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టాన్ని తీరికగా పరిశీలించడం, తర్వాత పంట నష్టం అంచనాలను సగానికి సగం తగ్గించి నివేదికలు తయారు చేయడం సర్కారుకు పరిపాటి అయ్యింది. తగ్గించిన మేరకైనా పరిహారం వెంటనే ఇస్తున్నారా..? అంటే అదీ లేదు. 2010, 2011 సంవత్సరాలకు సంబంధించిన పంట నష్ట పరిహార మే ఇప్పటివరకు అందలేదంటే రైతు సంక్షేమంపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. గత ఏడాది ‘నీలం’ తుపానుతో రూ.1,600 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాల మేరకు ప్రభుత్వం పేర్కొంది. అయితే తుది నివేదికలో ఈ నష్టాన్ని రూ.428 కోట్లకు కుదించేశారు. కుదించిన మేరకైనా మొత్తం రైతులకు ఇవ్వలేదు. ఇప్పటికీ రూ.56 కోట్లు చెల్లించలేదని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ఈ విధంగా రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇప్పటికే సుమారు రూ.700 కోట్లకు చేరుకున్నాయి. ఇక పై-లీన్, ఆ వెనువెంటనే కురిసిన కుండపోత వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 28.43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్వయసాయ శాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించింది. తీరిగ్గా బాధితుల పరామర్శకు, రైతులు నష్టపోయిన పంటల పరిశీలనకు వస్తున్న ప్రభుత్వాధినేతలు ప్రతి రైతుకూ పరిహారం అందిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే తుది నివేదికలు తయారయ్యేటప్పటికి నష్టం అంచనాను ఎంత మేరకు కుదిస్తారో? ఎంత పరిహారం ఎన్నేళ్లకు ఇస్తారో? అని గత అనుభవాల దృష్ట్యా రైతుల్లో నిరాశానిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. నెరవేరని లక్ష్యం ఊహించని ప్రకృతి వైపరీత్యాల కారణంగా సాగు చేసిన పంట నష్టపోతే, మళ్లీ పంట సాగు చేసే సామర్థ్యం బడుగు రైతుకు ఉండదు. అలా అని రైతు కాడీ-మేడీ కిందపడేస్తే దేశానికి పూట గడవదు. ‘ఆహార భద్రత’ వంటి తాజా పథకాలకూ భద్రత కరువవుతుంది. ఈ కారణంగానే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతుకు ‘ఇన్-పుట్ సబ్సిడీ’ పేరుతో ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తాయి. ఒక పంట నష్టపోయిన రైతుకు వెంటనే మళ్లీ రెండో పంట సాగు కోసం ఆసరా కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఇన్పుట్ సబ్సిడీ (పరిహారం).. ప్రకటించిన తర్వాత ఏళ్లు గడుస్తున్నా రైతుకు అందని పరిస్థితుల్లో.. ‘పంట నష్టపరిహారం’లోని అసలు లక్ష్యమే నెరవేరకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిహారంపై ప్రగల్భాలు... నష్టం అంచనాలో కోతలు! రైతుకు పంటనష్ట పరిహారాన్ని హెక్టారుకు రూ.10 వేలకు పెంచిన ఘనత తమదే అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి వంటివారు గొప్పగా చెప్పుకుంటున్నారు. 2012 నీలం తుపాను సమయంలో పంట పరిహారాన్ని హెక్టారుకు రూ.10 వేలకు ప్రభుత్వం పెంచింది. అయితే ఇదే సమయంలో నీలం తుపాను పంట నష్టం అంచనాలను మూడొంతులు తగ్గించి వేసింది. రూ.1600 కోట్ల పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తే తుది నివేదిక వచ్చేసరికి నష్టం అంచనా గణనీయంగా రూ.428 కోట్లకు తగ్గిపోయింది. వరంగల్, నల్గొండ లాంటి జిల్లాల్లో నీలం దెబ్బకు వేల ఎకరాల్లో పత్తిపైరుదెబ్బ తిన్నా తుది అంచనాల్లో ‘పత్తి’ నష్టం ఊసు లేనేలేదు. పంటనష్టం చెల్లింపును రూ.10 వేలకు పెంచామని చెప్పుకుంటూ మరోవైపు నష్టం అంచనాలను మూడొంతులు తగ్గించేసిన ప్రభుత్వం పంట నష్టం చెల్లింపులను పెంచినట్టా? తగ్గించినట్లా? అని పలు రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏటా బయటపడుతున్న ప్రభుత్వ ‘రంగు’ తుపానులు, భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ పంట నష్టం పరిహారంతో పాటు ప్రభుత్వం ఇచ్చే హామీ మరోటి ఉంది. అది ‘తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం’ అని. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రంగుమారిన ధాన్యాన్ని కొన్న సందర్భం ఒక్కటి కూడా కనిపించదు. గత నీలం తుపాను సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పౌర సరఫరాల మంత్రి శ్రీధర్ బాబు రైతుల వద్ద ఉన్న రంగుమారిన ధాన్యం, పత్తి కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. 2010లో ‘జల్’ తుపాను సందర్భంగా కూడా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యం రంగుమారిందని అధికారులు అంచనా వేశారు. చివరకు ప్రభుత్వం కొన్నది కేవలం 23వేల టన్నుల ధాన్యం మాత్రమే. నీలం తుపాను కారణంగా రంగు మారిన పత్తిని ఒక్క క్వింటాలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. పెపైచ్చు మంచి పత్తికి కూడా కనీస మద్దతు ధర లభించని పరిస్థితుల్లో రైతులను ప్రైవేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు ప్రభుత్వం వదిలేసింది. నోటితో పలుకరించి...నొసటితో వెక్కిరించడమే.. పంట నష్ట పరిహారాన్ని రూ.10 వేలకు పెంచామని ఒక వైపు చెప్పుకుంటూ, మరో వైపు నష్టం అంచనాలను తగ్గించడం, ప్రకటించిన పరిహారాన్ని సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు ఇవ్వకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం రైతులను ‘నోటితో పలుకరించి.. నొసటితో వెక్కిరిస్తోంది’ అని అనిపిస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిహారం ఎప్పటికప్పుడు చెల్లించేవారు. ఆయన మరణించిన 2009 నుంచి ఈ పంట నష్టం బకాయిలు పేరుకు పోతున్నాయి. - వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి