కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పై-లీన్ చేసిన గాయం నుంచి తేరుకోకముందే హెలెన్ తుపాన్ అన్నదాతలను వణికిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యంతోపాటు కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవడంతో రైతన్నకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.75 లక్షల హెక్టార్లలో వరిపంట సాగయింది. ఇప్పటివరకు 45 శాతం కోతలు మాత్రమే పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 20 లక్షల క్వింటాళ్ల ధాన్యం దెబ్బతిన్నది.
అందులో ఆరబెట్టుకున్న ధాన్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. రైతులు నేరుగా మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకే వచ్చి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. జిల్లాలో ఇంకా 55 శాతం వరికోతలు జరగాల్సి ఉంది. ఆలస్యంగా నాటుకున్న దాదాపు 80వేల హెక్టార్లలో వరికోతలు జరగాలి. దాదాపు 47 లక్షల క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు రావాల్సి ఉంది. పొలాల్లో యంత్రాల హార్వెస్టర్లు తిరిగే పరిస్థితి లేదు. ఈ క్రమంలో చైన్ హార్వెస్టర్లకు డిమాండ్ పెరిగింది. అవి తక్కువగా ఉండడం.. కోతలకు ఆలస్యం కావడంతోపాటు ఖర్చులు పెరుగుతున్నాయి. కోతకు వచ్చిన వరిధాన్యం తడిసి రంగుమారే అవకాశముంది.
610 కేంద్రాలు ఎక్కడ?
ఖరీఫ్‌లో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో 610 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 345 ఐకేపీ కేంద్రాలు, 191 పీఏసీఎస్‌లు కేంద్రాలు.. మొత్తం 536 కేంద్రాలను ప్రారంభించారు. 9.40 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ.39 కోట్లు చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నారుు. ప్రభుత్వ సంస్థల కంటే రెండురెట్లు ఎక్కువగా దళారులే కొనుగోలు చేశారు.
మార్కెట్ యార్డులతోపాటు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు చేస్తున్న ధాన్యం ఎగుమతికి నోచుకోకపోవడంతో ఎక్కడికక్కడే నిల్వలు పేరుకుపోతున్నాయి. తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో అవసరం మేరకు టార్పాలిన్లు లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే ధాన్యం తడిసిపోతోంది. ఇదే అదునుగా వ్యాపారులు ధర తగ్గించి రైతులను దోచుకుంటున్నారు.
మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం
శనివారం కురిసిన వర్షాలకు కరీంనగర్ మార్కెట్ యార్డులో వరిధాన్యం తడిసింది. నాలుగు వేల క్వింటాళ్ల వరకు మార్కెట్ యార్డుకు ధాన్యం వచ్చింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో రైతులు ముందస్తుగా టార్పాలిన్లు తెచ్చుకుని కుప్పలపై కప్పుకున్నారు. పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయించారు. వర్షసూచన నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేని స్థితిలో వ్యాపారుల చెప్పిన ధరకే విక్రయించారు. వరి ధాన్యం మద్దతు ధర కంటే రూ.100-రూ.250వరకు కోతలు పెట్టారు.