అన్నదాతపై ప్రకృతి కక్ష కట్టినట్టే కనిపిస్తోంది.. ఒక దెబ్బ నుంచి కోలుకోక ముందే, మరో దెబ్బ పడుతోంది. ఆయకట్టు, ఆయకట్టేతర అన్న తేడా లేకుండా మొన్నటి పై-లీన్ తుపాను పంటలను నాశనం చేసింది. ఉన్న కొద్దో గొప్పో పంట చేతికి వస్తుందని ఆశిస్తే తాజా ‘హెలెన్’ తుపాను పూర్తిగా తుడిచి పెట్టేసింది. అసలింత వరకు ‘పై-లీన్’ నష్టం అంచనాలే పూర్తి కాలేదు.. ఈ లోగా ‘హెలెన్’ రూపంలో ప్రకృతి కన్నెర్ర చేసింది..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఈ సారి తిండి గింజలకూ కొరత ఏర్పడేలా ఉంది. తుపానుల రూపంలో ఉన్న పంటంతా ఊడ్చి పెట్టుకు పోయింది. గత నెల జిల్లాను వణికించి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన పై-లీన్ తుపాను దెబ్బకే పత్తి పంట పూర్తిగా కోల్పోయిన రైతులు, నాన్ ఆయకట్టులో బావుల, బోర్ల కింద సాగు చేసిన వరి పంటనూ నష్టపోయారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని వరి పంట చేతికి వస్తుందిలే అనుకున్న వారి ఆశలపై తాజా ‘హెలెన్’ వరద కుమ్మరిస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన తుపాను వర్షం కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో వరి పంటను పూర్తిగా దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా శనివారం 17.8మి.మీ సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధిక వర్షపాతం నమోదైన తొలి నాలుగు మండలాలు కోదాడ నియోజకవర్గం పరిధిలోని నడిగూడెం (72.6 మి.మీ), మునగాల (70.4మి.మీ), కోదాడ (68.3మి.మీ), చిలుకూరు (65.4మి.మీ) కావడం గమనార్హం. సహజంగానే ఈ మండలాల్లోనే వరి పంటకు ఎక్కువ నష్టం జరిగింది.
మరోవైపు పత్తి చేలలో పత్తి విచ్చుకుని తెంపడానికి సిద్ధంగా ఉంది. ఈ దశలో ముసురు పడడంతో ఆయకట్టేతర ప్రాంతాల్లో ఇక పత్తి దిగుబడి నామమాత్రంగా కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. కాగా, బొమ్మలరామారం, మోత్కూరు, వలిగొండ, చింతపల్లి, పీఏపల్లి మండలాల్లో వర్షపాతం నమోదు కాలే దు. అత్యల్పంగా పెద్దవూర మండలంలో 2మి.మీ వర్షం కురిసింది. ఈ సారి వర్షానికి ఆయకట్టు మండలాలే ఎక్కువగా నష్టపోయాయి. మిగిల్చిన నష్టం లెక్కలతో అధికార యంత్రాంగం కుస్తీ పడుతున్న సమయంలోనే ‘హెలెన్’ దెబ్బకొట్టింది.
నష్టం జరిగింది ఇలా...
కోదాడ నియోజకవర్గంలోని ఆయకట్టు మండలాలైన చిలుకూరు, మునగాల, కోదాడ, నడిగూడెంలో పంట నష్టం ఎక్కువగానే ఉంది. కోతకు వచ్చిన వరి పైరుకు ఎక్కువ నష్టం జరిగింది. కోదాడ మండలంలో 600 ఎకరాల్లో పంట నేలకొరిగింది. చిమిర్యాలలో ఒక పెంకుటిల్లు కూలిపోయింది. చిలుకూరు, మునగాల మండలాల్లో రెండువేల ఎకరాల్లో , నడిగూడెం మండలంలో 500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
సూర్యాపేట మండలంలో చేతికొచ్చిన వరి పొలాలు వర్షాలకు తడిచి ముద్దయ్యాయి. పలు గ్రామాల్లో వరిపొలాలు నీట మునిగాయి. ఆత్మకూర్.ఎస్ మండలంలో కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. వరి మెదలు తడిసిపోయాయి. చివ్వెంల మండలంలో 100 ఎకరాల్లో కోసిన వరిమెద నీటి పాలయ్యింది. 300 ఎకరాల్లో పత్తి తడిసి పనికి రాకుండా అయ్యింది. వేరుశనగ పంట నీట మునిగింది. మండల పరిధిలోని వల్లభాపురంలో చర్చి పైకప్పు కూలిపోయింది. పెన్‌పహాడ్ మండలంలో నుర్జాహాన్‌పేట, అనంతారం. పొట్లపహాడ్ తదితర గ్రామాల్లో వడ్లరాసులు తడిచాయి. మెదలు నీట మునిగాయి.
మిర్యాలగూడ నియోజవవర్గంలో వరి పంటలు బాగా తెబ్బతిన్నాయి. మిర్యాలగూడ మండలంలోని ప్రకాశ్‌నగర్, తుంగపాడు, మిర్యాలగూడ పరిసర పాంతాలలో వరి మెదలు వర్షపు నీటిలో తడిచిపోయాయి. దామరచర్ల మండల కేంద్రంతో పాటు బొత్తలపాలెం, తాళ్లవీరప్పగూడెం గ్రామాలలో వరి పంటలు నేలబారాయి. కొన్నిచోట్ల నీట మునిగాయి. దామరచర్ల మండలంలోనే వెయ్యి ఎకరాల్లో వరి పంటలు దెబ్బతినగా, పత్తి పూర్తిగా తడిసిపోయింది. వేములపల్లిలో గాలికి ఫ్లెక్సీ కూలి ఒక వ్యక్తికి గాయాలయ్యాయి.
నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు చిరుజల్లులు కురిశాయి. ఏరడానికి సిద్ధంగా, చేనుపై ఉన్న పత్తి తడిసిపోయింది.
తుంగతుర్తి నియోజకవర్గంలో 5వేల ఎకరాల్లో కోసిన వరి మెదలు నీటిలో మునిగాయి. 3వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. పత్తిచేలలో పత్తి విచ్చుకోవడంతో పూర్తిగా తడిసింది. వందలాది ఎకరాల్లో పత్తి చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
భువనగిరి నియోజకవర్గంలోని మూసీ ఆయకట్టు మండలాల్లో రైతులు కోసిన వరిపంటను కాపాడుకోవడానికి అవస్థలు పడ్డారు. వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో రైతులకు ఇబ్బంది కలిగింది.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వరి కోతలకు, పత్తి తీయటానికి ఆటంకం కలిగింది. వర్షం కారణంగా పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో రచ్చబండ కార్యక్రమాలు రద్దయ్యాయి.
రైతుపై విరుచుకుపడిన హెలెన్ తుపాను
Published Sun, Nov 24 2013 4:06 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement