=జిల్లాను వణికించిన తుపాను
=ఖరీఫ్ వరికి అపార నష్టం
=నేలకొరిగిన చోడి, అరటి
=నిండుగా జలాశయాలు
=అన్నదాతలు కన్నీరుమున్నీరు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతున్నను హెలెన్ తుపాను మరో సారి ముంచింది. సరిగ్గా పంట చేతికందుతుందన్న సమయంలో ఈదురుగాలులతో నేలమట్టం చేసింది. దానికి ఎడతెరిపిలేని వర్షాలు తోడవ్వడంతో అపార నష్టం వాటిల్లింది. కోసి పొలంలో ఉన్న వరిపనలు తడిసి ముద్దయ్యాయి. కంకులతో బరువుగా ఉన్న ఖరీఫ్ వరి నీట మునిగి కుళ్లిపోతోంది.
చోడి, అరటి పంటలు నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న చెరకు తోటలు చుట్టుకుపోయాయి. అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3వేల హెక్టార్లలో వరి శతశాతం నష్టపోయినట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మరో 3వేల హెక్టార్లు వరద నీటిలో ఉండటంతో కాస్త నష్టం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే రైతులు మాత్రం నష్టం వేలాది ఎకరాల్లో ఉంటుందని అంటున్నారు.
నెల రోజుల కిందటే
సరిగ్గా నెల రోజుల కిందటే ఇదే సమయానికి అల్పపీడనం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలను నీట ముంచి రూ.వందల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. రైతులు తేరుకోక ముందే హెలెన్ తుపాను ముంచుకొచ్చింది. దీని ప్రభావంతో రెండ్రోజులుగా వర్షాలతోపాటు గంటకు 50నుంచి 70కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు వరిలో పొడవు రకాలయినఆర్‌జేఎల్, సోనామసూరి, సాంభమసూరి వంటివి నేలకొరిగిపోయి నీటమునిగాయి. ఖండిపల్లి, దామునాపల్లి,చుక్కపల్లి,చోడవరం, పరిసరాల్లో వరిపంటపై నుంచి రైవాడ కాలువ నీరు పొంగి ప్రవహించడంతో సుమారు 400 ఎకరాలు పూర్తిగా నీటమునిగింది.
వర్షం తీవ్రత లేనప్పటికీ గాలులు బలంగా వీయడంతో వరిచేలు నేరకొ రిగాయి. ఒరిగిన పంటను పైకి లేపి దుబ్బులుగా కట్టుకొంటూ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఇన్‌ఫ్లో పెరిగితే ఏక్షణాన పొంగుతాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. తుపాను తీరందాటినప్పటికీ దాని ప్రభావం మరో 48 గంటల పాటు ఉంటుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాం గం అప్రమత్తమైంది. ఏజెన్సీ మండలాల్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది.
ఏపుగా కోతకు సిద్ధంగా ఉన్న చోడి పంటంతా నేలమట్టమైంది. రోజుల తరబడి నీటి నిల్వ తో రాజ్‌మా పంట కుళ్లిపోతోంది. జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 వరకు 2.81 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరంలో మాత్రం ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. గాజువాకలో 10.5 సెం.మీ., పెదగంట్యాడలో 10.46 సెం.మీ., విశాఖపట్నం అర్బన్‌లో 6.7 సెం.మీ., విశాఖ రూరల్‌లో 6.5 సెం.మీ, సబ్బవరంలో 5.4 సెం.మీ. వర్షం పడింది. మిగిలిన మండలాల్లో మూడు సెం.మీ. వరకు వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖలో భారీ వర్షం కారణంగా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ గెట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చే స్తున్నారు.
అధికారులు అప్రమత్తం
హెలెన్ తుపాను కారణంగా జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ ఎటువంటి నష్టం లేదని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు మండలాల్లోనే ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ తరలించలేదన్నారు. భారీ వర్షాలు పడినప్పటికీ నష్ట శాతాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
మళ్లీ ముప్పు
Published Sat, Nov 23 2013 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement