Kharif rice
-
కొనుగోల్‌కు దూరం
‘కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి’..అన్నట్లు తయారైంది ఖరీఫ్ వరి పండించిన రైతుల పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు, సుడిదోమ కారణంగా చాలా పంట పోగా.. చేతికొచ్చిన కాస్త పంటనైనా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా పెద్దగా కొనుగోళ్లు జరగడం లేదు. పైగా సవాలక్ష నిబంధనలు పెట్టడంతో ప్రభుత్వ కేంద్రాల వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. ఇదేఅదనుగా మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు నచ్చిన ధరకు కొంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు. పాలకొండ:రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతుల్లో అవగాహన లోపం, అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ వ్యాపారులకు వరంగా పరిమిస్తున్నాయి. జిల్లాలో వంద కేంద్రాల్లో రెండు లక్షల క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 16 కేంద్రాల ద్వారా 981 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా చాలాచోట్ల కేంద్రాలే తెరుచుకోలేదు. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావంతో ఆలస్యంగా నాట్లు పడ్డాయి. దాన్ని ఎలాగో అధిగమించి పంట సాగు చేస్తే.. అక్టోబర్ సంభవించిన హుద్‌హుద్ తుపాను, ఆ వెంటనే వచ్చిన వరదలు చాలావరకు పంటను నాశనం చేశాయి. అటు తర్వాత సుడిదోమ దాడి చేసింది. ఫలితంగా చివరికి కొద్దిపాటి పంట మాత్రమే రైతుకు దక్కింది. దాన్ని సొమ్ము చేసుకుందామని రైతు తాపత్రయ పడుతుంటే ఇక్కడా పరిస్థితులు అనుకూలించడంలేదు. లభించని ‘మద్దతు’ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతును మద్దతు ధర, మిగిలిన ధాన్యం కొనగోలు విషయంలో అండగా ఉంటామని ప్రభుత్వం ఆర్భాటం చేసింది. జిల్లాలో వివిధ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అలాగే రకాలవారీగా మద్దతు ధర కూడా ప్రకటించింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే.. జిల్లాలో ఇప్పటివరకు 16 కేంద్రాల్లోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల కేంద్రాలే ప్రారంభం కాకపోగా, ప్రారంభమైన పలు చోట్ల కొనుగోళ్లు చేపట్టడంలేదు. ప్రస్తుతం రైతు సాధికార సదస్సులు, రుణమాఫీ వ్యవహారాలతో అధికారులు బిజీ అయిపోవడంతో మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. కాగా ఏ గ్రేడ్ క్వింటాలు రూ.1400, కామన్ రకం క్వింటాలు రూ.1360 మద్దతు ధరగా ప్రకటించి, దానికంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్-1 రకం కొనుగోళ్లే ఇంతవరకు జరపకపోవడం విశేషం. అన్నీ సమస్యలే కొనుగోలు కేంద్రాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. కేంద్రాలకు ధాన్యం తీసుకెళితే నాణ్యత పరీక్షల పేరుతో సవాలక్ష వంకలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రామాల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించాలి. 16 కి.మీ. లోపు దూరానికి టన్నుకు రూ.300 చొప్పున, 16 కి.మీ. మించిన దూరానికి క్వింటాకు 4 రూపాయలు చొప్పున చెల్లించాలి. వాస్తవానికి ధాన్యం రవాణాకు ఈ చార్జీలు ఏమాత్రం సరిపోవు. అలాగే గత ఏడాది కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యానికి రవాణా చార్జీలు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదు. మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల నుంచి ఇక్కడికి ధాన్యం రవాణా సమస్యగా మారుతోంది. దీంతో రైతులు ఈ ఏడాది కేంద్రాల వైపు చూడడం మానేశారు. అధికారులు ఈ కేంద్రాలు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యత పేరుతో కొర్రీలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మాలనుకున్న రైతులు ముందుగా నాణ్యత పరీక్షల కోసం రెండు మూడు కేజీల ధాన్యాన్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందులో తేమ శాతం, పొల్లు, రాళ్లు తదితర పరీక్షలు జరిపి ధర నిర్ణయిస్తున్నారు. ఈ ధర ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్న దాని కంటే తక్కువగానే ఉంటోందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే లభించడం లేదన్నది రైతుల వాదన. తుపానుకు పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో నాణ్యత ఎక్కడ ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటాడుతున్న వర్షాల భయం కాగా కొద్దిరోజులుగా వాతావరణం మబ్బు పెట్టి అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో భయం మొదలైంది. అమ్ముకునే పరిస్థితి లేక కళ్లాల్లో నే ధాన్యం కుప్పలుగా నిల్వ చేశారు. ఈ తరుణంలో వర్షాలు పడితే పడితే పూర్తిగా తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. దాంతో గత్యంతరం లేక అందుబాటులో ఉన్న వ్యాపారులకే ధాన్యం విక్రయిస్తున్నారు. నిబంధనలు ఇలా.. ప్రతి మండలంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా రెండు మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి కేంద్రం వద్ద ప్యాడీ క్లీనర్లు, తేమను నిర్థారించే మాయిశ్చర్ మీటర్లు, నాణ్యత నిర్థారణకు క్యాలీపర్స్, కాటాలు, జల్లెడలు ఉంచాలి. ప్రతి కేంద్రం వద్ద ఐదుగురు సభ్యులతో కూడిన బృందం రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత పరిశీలించి ధర నిర్ణయిస్తుంది. ఆ ధరకు అమ్మకానికి ధాన్యం తెచ్చే రైతు ఆన్లైన్లో డబ్బు చెల్లించేందుకు వీలుగా బ్యాంకు ఖాతా వివరాలు తెలిపే పత్రాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నాణ్యత, ధర నిర్ణయించిన తర్వాత ధాన్యం అమ్మకానికి సిద్ధపడే రైతుకు పౌరసరపరాల సంస్థ ఖాళీ గోనెసంచులు రైతులు వాటిలో ధాన్యాన్ని నింపి కొనుగోలు కేంద్రంలో అప్పగించాలి. ధాన్యం పండించిన భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం వివరాలతో కూడిన అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకం, రుణ అర్హత కార్డు వంటి వాటి జెరాక్స్ కాపీలు కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అందజేయాలి. దీనివల్ల ఆ ధాన్యం సదరు రైతువేనని నిర్థారించుకునేందుకు వీలవుతుంది. కేంద్రం వద్ద ధాన్యం అన్లోడింగ్, కాటా వేయించడం, బస్తాలు కుట్టడానికి అయిన ఖర్చుల్లో రైతు, పౌరసరఫరాల సంస్థ కలిసి భరించాలి. -
వరించని వరుణుడు
వర్షాల్లేక అదును మీరిన ఖరీఫ్ వరి ఎదగని నారు చూసి రైతుల గగ్గోలు వర్షాధార భూములకు బోర్లే శరణ్యం 7 గంటల విద్యుత్‌కు అన్నదాతల మొర చోడవరం: ఖరీఫ్ వరికి అదును మీరడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. మొదట్లో వర్షాల్లేక ఆలస్యంగా వరి నారుమడులు వేయడంతో ఇప్పుడు నారు ఎదగడం లేదు. వాస్తవానికి 21 రోజుల్లో నారు ఎదిగి నాట్లకు సిద్ధం కావాలి. కాని తుపాను వర్షాలు కూడా సరిగ్గా కురవకపోవడంతో నారు కనీస ఎదుగుదల లేక ఉంది. దీనికి తోడు తెగులు బారిన పడి పలుచోట్ల నారుమళ్లలో ఆకు ఎర్రగా మారిపోయింది. వర్షాలు ఇలాగే ఉంటే బోర్లను ఆశ్రయించక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయానికి దమ్ములు పట్టి, నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. కానీ నారే ఎదగకపోవడంతో కనీసం నాట్లయినా పడలేదు. జలాశయాల కింద సైతం నారు పడకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో మునుపెన్నడూ లేనివిధంగా రైతుల డిమాండ్ మేరకు నాట్లు వేసేందుకు పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల నుంచి నీరు విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పెద్దేరు జలాశయం నుంచి 30 క్యూసెక్యుల నీరు విడుదల చేయక, కోనాం జలాశయం నుంచి సోమవారం 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. త్వరలో రైవాడ నీటిని కూడా విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జలాశయాల ఆయకట్టు రైతులకు ఈ పరిణామం కొంత ఉపశమనం కలిగించినా వర్షాధారం, నదులు, కొండగెడ్డలపై ఆధారపడ్డ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో రైతులు నాట్లు ఎలా వేయాలని ఆలోచిస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజులు చూసి బోర్ల సాయంతోనైనా నాట్లు వేయక తప్పదని రైతులు చెబుతున్నారు. మరోపక్క నారుమడికి తెగుళ్లు రావడం, నారు ఎదగకపోవడంతో ఎరువులు, పురువుగు మందులు వేసేందుకు సైతం నీరు అవసరం కావడంతో రైతులు సాగునీటి కోసం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి నిర్ణీత 7 గంటల విద్యుత్‌ను నిరాటంకంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
తీరని కడగండ్లు
=నదులు, కాలువ గట్ల పటిష్టం నామమాత్రం =నాణ్యతలేని పనులతో ఏటా ఇబ్బందులే.. =శాశ్వత చర్యలు చేపట్టని ప్రభుత్వం యలమంచిలి/చోడవరం, న్యూస్‌లైన్: వరదలప్పుడు కొట్టుకు పోయిన గండ్లు పూడ్చడంలో పాలకుల నిర్లక్ష్యం రైతులు, ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. ముంపు బారి నుంచి తప్పించడానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టడంలేదు. వరదలు ముంచెత్తాక నదులు, కాలువల గట్లను పటిష్టం చేస్తామన్న ప్రకటనలే తప్ప.. ఆచరణ శూన్యం. గతేడాది నీలం తుఫాన్, నెలరోజుల కిందట వరదలకు జిల్లాలో 97చెరువులకు, పెద్దేరు, తాచేరు, సర్పానది, వరహా, బొడ్డేరు, శారదా నదులకు 24చోట్ల, గెడ్డలకు 87 ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. వర దనీరు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వీటిలో సగానికి పైగా నీలం తుఫాన్‌కు దెబ్బతిన్నవే. వీటిలో కొన్నింటిని నామమాత్రంగా ఇసుక బస్తాలు పేర్చి వదిలేశారు. మరికొన్నింటిని పూడ్చలేదు. ఇటీవల వరదలప్పుడు పంటపొలాలతోపాటు పట్టణాలు, గ్రామాలు మళ్లీ ముంపునకు గురయ్యాయి. రైవాడ రిజర్వాయర్ నుంచి విశాఖ కార్పొరేషన్‌కు తాగునీటిని సరఫరా చేసే కాలువకు నాగయ్యపేట, సీతంపేట వద్ద, ఎడమ కాలువకు బేదపూడి వద్ద పడిన గండ్లను ఇప్పటికీ పూడ్చలేదు. చోడవరం మండలం పీఎస్‌పేట, రామజోగిపాలెం, జన్నవరం వద్ద పెద్దేరు నదికి గండిపడిన ప్రదేశాలను పూడ్చలేదు. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కాలువలు, ఆనకట్టలు, గ్రోయిన్ల ఆధారంగా జిల్లాలో 98,144 ఎకరాల్లో పంటలు చేపడుతున్నారు. వాటికి గండ్లు పడకుండా అన్నదాతలు ఇసుకబస్తాలతో రేయింబవళ్లు కాపలా కాయవలసివస్తోంది. అప్పుడు వారు ప్రమాదాలకూ గురవుతున్నారు. 2011 నవంబరులో తుఫాన్ సమయంలో రూ.80 కోట్లతో గట్లు పటిష్టానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. వాటికి అతీగతీ లేకుండా పోయింది. గత నెలలో వచ్చిన వరదలతో వీటి పటిష్టత విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. రూ.114 కోట్లతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు 645 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరణకు రూపొందించిన ప్రణాళికలు ప్రభుత్వానికి చేరాయి. నెలరోజులు తిరక్కుండానే మరోసారి హెలెన్ రూపంలో తుఫాన్ ముంచుకొచ్చింది. అంతో ఇంతో వరదనీరు గతంలో గండ్లు పడిన ప్రదేశం నుంచి పంటపొలాలను మళ్లీ ముంచెత్తింది. ముఖ్యంగా ఆనకట్టలు, కాలువల మరమ్మతుల పనుల్లో నాణ్యత కొరవడి ఖరీఫ్ వరి ముంపునకు గురయింది. ఇలా ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఏటా రైతులు పంటలను కోల్పోతున్నారు. పనులు పటిష్టంగా చేపడితే ఈ పరిస్థితి ఉండేది కాదన్న వాదన వ్యక్తమవుతోంది. గతేడాది పనుల నాణ్యతను పరిశీలిస్తే.... నీలం తుఫాన్లో దెబ్బతిన్న యలమంచిలి శేషుగెడ్డ, మైనర్ శారద నది కాలువ గండ్లు పూడ్చివేత పనులను చెరో రూ.25లతో చేపట్టారు. శేషుగెడ్డ కాలువకు ఒకవైపు మాత్రమే గట్టును పటిష్టంచేయడం, పనుల్లో నాణ్యతలేకపోవడంతో గత నెలలో భారీ వర్షాలకు వరదనీరు ముంచెత్తింది. యలమంచిలి పట్టణానికి భారీ నష్టం వాటిల్లింది. మైనర్శారద కాలువ గండ్లు కూడా కొట్టుకుపోయాయి. పనుల్లో నాణ్యతలేదని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమయినప్పటికీ అధికారయంత్రాంగం పట్టించుకోలేదు. కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో ఈ ఏడాది కూడా రైతులు పంటలు కోల్పోవలసి వచ్చింది. పురుషోత్తపురం గెడ్డకు రు.6లక్షలతో మరమ్మతు పనుల్లోనూ ఇదే దుస్థితి. -
మళ్లీ ముప్పు
=జిల్లాను వణికించిన తుపాను =ఖరీఫ్ వరికి అపార నష్టం =నేలకొరిగిన చోడి, అరటి =నిండుగా జలాశయాలు =అన్నదాతలు కన్నీరుమున్నీరు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతున్నను హెలెన్ తుపాను మరో సారి ముంచింది. సరిగ్గా పంట చేతికందుతుందన్న సమయంలో ఈదురుగాలులతో నేలమట్టం చేసింది. దానికి ఎడతెరిపిలేని వర్షాలు తోడవ్వడంతో అపార నష్టం వాటిల్లింది. కోసి పొలంలో ఉన్న వరిపనలు తడిసి ముద్దయ్యాయి. కంకులతో బరువుగా ఉన్న ఖరీఫ్ వరి నీట మునిగి కుళ్లిపోతోంది. చోడి, అరటి పంటలు నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న చెరకు తోటలు చుట్టుకుపోయాయి. అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3వేల హెక్టార్లలో వరి శతశాతం నష్టపోయినట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మరో 3వేల హెక్టార్లు వరద నీటిలో ఉండటంతో కాస్త నష్టం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే రైతులు మాత్రం నష్టం వేలాది ఎకరాల్లో ఉంటుందని అంటున్నారు. నెల రోజుల కిందటే సరిగ్గా నెల రోజుల కిందటే ఇదే సమయానికి అల్పపీడనం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలను నీట ముంచి రూ.వందల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. రైతులు తేరుకోక ముందే హెలెన్ తుపాను ముంచుకొచ్చింది. దీని ప్రభావంతో రెండ్రోజులుగా వర్షాలతోపాటు గంటకు 50నుంచి 70కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు వరిలో పొడవు రకాలయినఆర్జేఎల్, సోనామసూరి, సాంభమసూరి వంటివి నేలకొరిగిపోయి నీటమునిగాయి. ఖండిపల్లి, దామునాపల్లి,చుక్కపల్లి,చోడవరం, పరిసరాల్లో వరిపంటపై నుంచి రైవాడ కాలువ నీరు పొంగి ప్రవహించడంతో సుమారు 400 ఎకరాలు పూర్తిగా నీటమునిగింది. వర్షం తీవ్రత లేనప్పటికీ గాలులు బలంగా వీయడంతో వరిచేలు నేరకొ రిగాయి. ఒరిగిన పంటను పైకి లేపి దుబ్బులుగా కట్టుకొంటూ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఇన్‌ఫ్లో పెరిగితే ఏక్షణాన పొంగుతాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. తుపాను తీరందాటినప్పటికీ దాని ప్రభావం మరో 48 గంటల పాటు ఉంటుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాం గం అప్రమత్తమైంది. ఏజెన్సీ మండలాల్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఏపుగా కోతకు సిద్ధంగా ఉన్న చోడి పంటంతా నేలమట్టమైంది. రోజుల తరబడి నీటి నిల్వ తో రాజ్మా పంట కుళ్లిపోతోంది. జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 వరకు 2.81 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరంలో మాత్రం ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. గాజువాకలో 10.5 సెం.మీ., పెదగంట్యాడలో 10.46 సెం.మీ., విశాఖపట్నం అర్బన్‌లో 6.7 సెం.మీ., విశాఖ రూరల్‌లో 6.5 సెం.మీ, సబ్బవరంలో 5.4 సెం.మీ. వర్షం పడింది. మిగిలిన మండలాల్లో మూడు సెం.మీ. వరకు వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖలో భారీ వర్షం కారణంగా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ గెట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చే స్తున్నారు. అధికారులు అప్రమత్తం హెలెన్ తుపాను కారణంగా జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ ఎటువంటి నష్టం లేదని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు మండలాల్లోనే ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ తరలించలేదన్నారు. భారీ వర్షాలు పడినప్పటికీ నష్ట శాతాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.