కొనుగోల్‌కు దూరం | paddy yield likely this kharif Distance season | Sakshi
Sakshi News home page

కొనుగోల్‌కు దూరం

Published Mon, Dec 15 2014 12:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

కొనుగోల్‌కు దూరం - Sakshi

కొనుగోల్‌కు దూరం

‘కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి’..అన్నట్లు తయారైంది ఖరీఫ్ వరి పండించిన రైతుల పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు, సుడిదోమ కారణంగా చాలా పంట పోగా.. చేతికొచ్చిన కాస్త పంటనైనా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా పెద్దగా కొనుగోళ్లు జరగడం లేదు. పైగా సవాలక్ష నిబంధనలు పెట్టడంతో ప్రభుత్వ కేంద్రాల వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. ఇదేఅదనుగా మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు నచ్చిన ధరకు కొంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు.
 
 పాలకొండ:రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతుల్లో అవగాహన లోపం, అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ వ్యాపారులకు వరంగా పరిమిస్తున్నాయి. జిల్లాలో వంద కేంద్రాల్లో రెండు లక్షల క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 16 కేంద్రాల ద్వారా 981 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా చాలాచోట్ల కేంద్రాలే తెరుచుకోలేదు. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావంతో ఆలస్యంగా నాట్లు పడ్డాయి. దాన్ని ఎలాగో అధిగమించి పంట సాగు చేస్తే.. అక్టోబర్ సంభవించిన హుద్‌హుద్ తుపాను, ఆ వెంటనే వచ్చిన వరదలు చాలావరకు పంటను నాశనం చేశాయి. అటు తర్వాత సుడిదోమ దాడి చేసింది. ఫలితంగా చివరికి కొద్దిపాటి పంట మాత్రమే రైతుకు దక్కింది. దాన్ని సొమ్ము చేసుకుందామని రైతు తాపత్రయ పడుతుంటే ఇక్కడా పరిస్థితులు అనుకూలించడంలేదు.
 
 లభించని ‘మద్దతు’
 ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతును మద్దతు ధర, మిగిలిన ధాన్యం కొనగోలు విషయంలో అండగా ఉంటామని ప్రభుత్వం ఆర్భాటం చేసింది. జిల్లాలో వివిధ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అలాగే రకాలవారీగా మద్దతు ధర కూడా ప్రకటించింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే.. జిల్లాలో ఇప్పటివరకు 16 కేంద్రాల్లోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల కేంద్రాలే ప్రారంభం కాకపోగా, ప్రారంభమైన పలు చోట్ల కొనుగోళ్లు చేపట్టడంలేదు. ప్రస్తుతం రైతు సాధికార సదస్సులు, రుణమాఫీ వ్యవహారాలతో అధికారులు బిజీ అయిపోవడంతో మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. కాగా ఏ గ్రేడ్ క్వింటాలు రూ.1400, కామన్ రకం క్వింటాలు రూ.1360 మద్దతు ధరగా ప్రకటించి, దానికంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్-1 రకం కొనుగోళ్లే ఇంతవరకు జరపకపోవడం విశేషం.
 
 అన్నీ సమస్యలే
 కొనుగోలు కేంద్రాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. కేంద్రాలకు ధాన్యం తీసుకెళితే నాణ్యత పరీక్షల పేరుతో సవాలక్ష వంకలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రామాల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించాలి. 16 కి.మీ. లోపు దూరానికి టన్నుకు రూ.300 చొప్పున, 16 కి.మీ. మించిన  దూరానికి క్వింటాకు 4 రూపాయలు చొప్పున చెల్లించాలి. వాస్తవానికి ధాన్యం రవాణాకు ఈ చార్జీలు ఏమాత్రం సరిపోవు. అలాగే  గత ఏడాది కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యానికి రవాణా చార్జీలు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదు. మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల నుంచి ఇక్కడికి ధాన్యం రవాణా సమస్యగా మారుతోంది. దీంతో రైతులు ఈ ఏడాది కేంద్రాల వైపు చూడడం మానేశారు. అధికారులు ఈ కేంద్రాలు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
 
 నాణ్యత పేరుతో కొర్రీలు
 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మాలనుకున్న రైతులు ముందుగా నాణ్యత పరీక్షల కోసం రెండు మూడు కేజీల ధాన్యాన్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందులో తేమ శాతం, పొల్లు, రాళ్లు తదితర పరీక్షలు జరిపి ధర నిర్ణయిస్తున్నారు. ఈ ధర ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్న దాని కంటే తక్కువగానే ఉంటోందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన  మద్దతు ధర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే లభించడం లేదన్నది రైతుల వాదన. తుపానుకు పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో నాణ్యత ఎక్కడ ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
 
 వెంటాడుతున్న వర్షాల భయం
 కాగా కొద్దిరోజులుగా వాతావరణం మబ్బు పెట్టి అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో భయం మొదలైంది. అమ్ముకునే పరిస్థితి లేక కళ్లాల్లో నే ధాన్యం కుప్పలుగా నిల్వ చేశారు. ఈ తరుణంలో వర్షాలు పడితే పడితే పూర్తిగా తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. దాంతో గత్యంతరం లేక అందుబాటులో ఉన్న వ్యాపారులకే ధాన్యం విక్రయిస్తున్నారు.
 
 నిబంధనలు ఇలా..
  ప్రతి మండలంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా రెండు మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి కేంద్రం వద్ద ప్యాడీ క్లీనర్లు, తేమను నిర్థారించే మాయిశ్చర్ మీటర్లు, నాణ్యత నిర్థారణకు క్యాలీపర్స్, కాటాలు, జల్లెడలు ఉంచాలి. ప్రతి కేంద్రం వద్ద ఐదుగురు సభ్యులతో కూడిన బృందం రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత పరిశీలించి ధర నిర్ణయిస్తుంది. ఆ ధరకు అమ్మకానికి ధాన్యం తెచ్చే రైతు ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించేందుకు వీలుగా బ్యాంకు ఖాతా వివరాలు తెలిపే పత్రాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నాణ్యత, ధర నిర్ణయించిన తర్వాత ధాన్యం అమ్మకానికి సిద్ధపడే రైతుకు పౌరసరపరాల సంస్థ ఖాళీ గోనెసంచులు రైతులు వాటిలో ధాన్యాన్ని నింపి కొనుగోలు కేంద్రంలో అప్పగించాలి.  ధాన్యం పండించిన భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం వివరాలతో కూడిన అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకం, రుణ అర్హత కార్డు వంటి వాటి జెరాక్స్ కాపీలు కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అందజేయాలి. దీనివల్ల ఆ ధాన్యం సదరు రైతువేనని నిర్థారించుకునేందుకు వీలవుతుంది. కేంద్రం వద్ద ధాన్యం అన్‌లోడింగ్, కాటా వేయించడం, బస్తాలు కుట్టడానికి అయిన ఖర్చుల్లో రైతు, పౌరసరఫరాల సంస్థ కలిసి భరించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement